చంద్రబాబు ఆందోళనకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం..

చంద్రబాబు ఆందోళనకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం..
x
Highlights

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోరుతూ హస్తిన వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఉదయం 8 గంటల...

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోరుతూ హస్తిన వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు. రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న దీక్ష కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. మరోవైపు దీక్షలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు హస్తినకు చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాలకు చెందిన ఇంచార్జీలంతా ఏపీ భవన్‌కు చేరుకున్నారు. రెండు రైళ్లల్లో క్యాడర్‌ను తరలించారు.

ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకున్న చంద్రబాబు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత ఏపీ భవన్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత 8 గంటలకు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక నుంచే మరోసారి చంద్రబాబు దీక్షకు దిగారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న మొండివైఖరిని ఎండగడుతూ దీక్ష సాగనుంది. రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న దీక్ష తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంతో పాటు కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడతారు.

2018 బడ్జెట్‌తో పాటు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కూడా ఏపీకి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో హస్తినలోనే ధర్మపోరాట దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ దీక్షకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే జాతీయ పార్టీల నేతలు కూడా హాజరవుతారు. చంద్రబాబు దీక్షకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలతో పాటు మేధావులు, జేఏసీ నాయకులు, విద్యార్థీ, ఉపాధ్యాయ సంఘాల వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఇటు వీరందరికీ సమాచారం ఇచ్చేందుకు ఏపీ భవన్‌లో హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటుచేశారు.

మరోవైపు మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు. దీక్ష వివరాలతో పాటు రాష్ట్రంపై కేందం అనుసరిస్తున్న వైఖరిని కోవింద్‌కు వివరిస్తారు.


Show Full Article
Print Article
Next Story
More Stories