కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాశే

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాశే
x
Highlights

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే ఏపీ, తెలంగాణను కేంద్రం ఉసూరుమనిపించింది. పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప...

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే ఏపీ, తెలంగాణను కేంద్రం ఉసూరుమనిపించింది. పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప తెలుగు రాష్ట్రాలకు అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించని కేంద్రం బడ్జెట్‌ ప్రసంగంలో కనీసం ఏపీ, తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు నిర్మలా సీతారామన్‌.

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే మిగిలింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో కనీసం తెలుగు రాష్ట్రాల ఊసు కూడా ఎత్తలేదు. తెలుగు రాష్ట్రాలకు ఒక్క కొత్త ప్రాజెక్టునూ మంజూరు చేయని నిర్మల ఆల్రెడీ కొనసాగుతున్న వాటికి గానీ రైల్వేలైన్లకు గానీ ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

విభజన కష్టాలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్‌‌‌ ఎప్పటిలాగానే, కేంద్ర బడ్జెట్‌ వైపు ఆశగా చూసింది. కానీ మోడీ సర్కార్‌ అస్సలు కనికరించలేదు. రాజధాని నిర్మాణంతోపాటు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే కరువైంది. ఇక, విశాఖ రైల్వే జోన్ ప్రకటించి ఏడాది కావొస్తున్నా ఆచరణలో మాత్రం అర అంగుళం కూడా ముందడుగు పడలేదు. విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. అలాగే, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌‌ ఊసే లేదు. అయితే, బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరులో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టుకు 18వేల 600కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం ఏపీ, తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకపోవడంపై ఏపీ, తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

ఇక, తెలంగాణకు కూడా కేంద్రం మొండి చెయ్యే చూపించింది. పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్టు ఏర్పాటుకు బీజేపీ హామీ ఇచ్చినా కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇక, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్వహణకు 53వేల కోట్లు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌ పదేపదే కేంద్రాన్ని కోరినా ఊసురుమనిపించింది. అలాగే, కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పట్నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.

ఇక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం అందులో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించలేదు. అలాగే, పర్యాటక రంగానికి 2వేల కోట్లు కేటాయించిన కేంద్రం.... తెలుగు రాష్ట్రాలను మాత్రం విస్మరించింది. ఓవరాల్‌గా కేంద్ర బడ్జెట్‌లో మరోసారి ఏపీ, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories