కుల సమీకరణలే టిక్కెట్లకు బాటలా?

కుల సమీకరణలే టిక్కెట్లకు బాటలా?
x
Highlights

రాజకీయపార్టీలు, నాయకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా తమకు కులం, మతం అంటూ ఎలాంటి భేదాలు లేవని ప్రకటించినా కులబలాన్నే నమ్ముకొని అధికారం కోసం పాకులాడటం...

రాజకీయపార్టీలు, నాయకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా తమకు కులం, మతం అంటూ ఎలాంటి భేదాలు లేవని ప్రకటించినా కులబలాన్నే నమ్ముకొని అధికారం కోసం పాకులాడటం మనదేశంలో ఓ సాధారణ విషయంగా మారిపోయింది. చివరకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార, ప్రతిపక్షపార్టీలు ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితా చూసినా అదే కనిపిస్తుంది.

కులాలు, మతాలు పోవాలి అంటూ రాజకీయనాయకులు, పార్టీలు భారీగా ఉపన్యాసాలు దంచేయటం మనకు తెలిసిందే. అయితే భారత రాజకీయవ్యవస్థలో కులం, మతం బలంగా నాటుకు పోయినట్లు ఇటీవలే లోక్ నీతి సంస్థ, అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఏపీయూ) కలసి నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. భారత ఎన్నికల పోరులో కులం, మతం ప్రధాన అస్త్రాలని మరోసారి తేటతెల్లమయ్యింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన సర్వేలో 55 శాతం మంది కులం, మతం ప్రాతిపదికనే ఓటు వేస్తామని చెప్పడం విశేషం.

ఏడుదశాబ్దాల స్వతంత్రభారత ఎన్నికల చరిత్రలో వివిధ రాజకీయపార్టీలు కులం, మతం, సామాజిక సమీకరణాలను నమ్ముకొని పబ్బం గడుపుకొంటూ వస్తున్నాయి. చివరకు సీట్ల కేటాయింపులోనూ కులబలం వ్యూహాన్నే రాజకీయపార్టీలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలు చూసినా కులసమీకరణాలకు ఏస్థాయిలో ప్రాధాన్యమిచ్చింది అర్ధమవుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో చెరో ఆరుశాతం చొప్పున మాత్రమే ఉన్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధికారం కోసం జరుగుతున్న సమరమే ప్రస్తుత ఎన్నికలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆంధప్రదేశ్ జనాభాలో 45 శాతం వరకూ ఉన్న బీసీలకు అధికారం అందనిద్రాక్షలానే ఉంటూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు అధికార, ప్రతిపక్షాలు బీసీ అభ్యర్థులకు కేటాయించిన సీట్లు చూస్తేనే తెలుస్తుంది. బీసీల పార్టీగా ప్రచారం చేసుకొంటున్న టీడీపీ బీసీ అభ్యర్ధులకు 41 సీట్లు మాత్రమే ఇచ్చింది. అదే ప్రతిపక్ష వైసీపీ పార్టీ 35 సీట్లు మాత్రమే కేటాయించింది.

ఇక ఈ రెండుపార్టీలు తమతమ కులాల అభ్యర్థులకు మాత్రమే పెద్దపీట వేశాయి. రెడ్ల సామాజిక వర్గానికి కేరాఫ్ ఎడ్రస్ గా ఉన్న వైసీపీ ఏకంగా 50 మంది రెడ్డి సామాజిక వర్గం వారికి సీట్లు ఇచ్చింది. అధికార టీడీపీ సైతం తాను ఏమాత్రం తక్కువ తినలేదన్నట్లుగా కమ్మ సామాజికవర్గానికి 50 సీట్లు కేటాయించి తన ప్రాధాన్యం ఏంటో చెప్పకనే చెప్పింది.

మరోవైపు టీడీపీ రెడ్లకు 27 సీట్లు మాత్రమే ఇస్తే వైసీపీ మాత్రం కమ్మ సామాజికవర్గానికి 10 సీట్లు మాత్రమే కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 20 నుంచి 22 శాతం వరకూ ఉన్న కాపు సామాజిక వర్గానికి అధికార టీడీపీ 18 సీట్లు కేటాయిస్తే ప్రతిపక్ష వైసీపీ మాత్రం 28 సీట్లిచ్చి తన పెద్దమనసు చాటుకొంది.

మొత్తం మీద రాష్ట్రాలు ఏవైనా పార్టీలు ఏవైనా ఎన్నికల సమరంలో నెగ్గుకు రావాలంటే కులాలకు గాలం వేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో కులం, మతం సమీకరణాలు పక్కనపెట్టి అభ్యర్ధుల గుణగణాల ప్రాతిపదికన జరిగే ఎన్నికలు చూడాలంటే ఎంతకాలం వేచిచూడాలో మరి.



Show Full Article
Print Article
Next Story
More Stories