Top
logo

1971లో 54 మంది భారత సైనికుల్ని నిర్బంధంలోకి తీసుకున్న పాక్...

1971లో  54 మంది భారత సైనికుల్ని నిర్బంధంలోకి తీసుకున్న పాక్...
X
Highlights

అభినందన్ పాక్ చేతికి చిక్కడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 1971లో పాకిస్థాన్ ఇలాంటి దుస్సాసాహానికి...

అభినందన్ పాక్ చేతికి చిక్కడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 1971లో పాకిస్థాన్ ఇలాంటి దుస్సాసాహానికి ఒడిగట్టింది. ఆ యుద్ధ సమయంలో 54 మంది భారత సైనికుల్ని నిర్బంధంలోకి తీసుకుంది పాక్. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియకుండా పోయింది. సైనికుల బంధువులు, ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ 54మంది మిస్సింగ్ ఇప్పటీకీ మిస్టరీగానే మిగిలింది. `

భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను కస్టడీలోకి తీసుకుని పాకిస్థాన్‌ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. భారతీయ జవాన్లను ఇలా నిర్బంధంలోకి తీసుకోవడం పాకిస్థాన్‌కు ఇది కొత్త కాదు. 1971లోనే దాయాది దేశం ఇలాంటి ఘటనకే ఒడిగట్టింది. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో 54 మంది భారత సైనికుల్ని నిర్బంధంలోకి తీసుకుంది పాకిస్థాన్‌. వారు యుద్ధంలో చనిపోయారనో, లేదా తప్పిపోయారనో ప్రపంచాన్ని నమ్మిస్తూ కుటిల నీతిని ప్రదర్శించింది. కానీ వీరంతా ఇప్పటికీ పాకిస్థాన్‌ జైళ్లలోనే మగ్గుతున్నారనేది భారతీయుల ప్రగాఢ విశ్వాసం.

1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుగా ఓడించింది. ఆ యుద్ధంలో దాదాపు 90 వేల మంది పాకిస్థాన్‌ సైనికుల్ని యుద్ధ ఖైదీలుగా భారత్‌ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ తర్వాత కుదిరిన సిమ్లా ఒప్పందం మేరకు ఆ 90 వేల మందిని భారత్‌ విడిచిపెట్టి తన ఉదారతను చాటుకుంది. కానీ 54 మంది భారత సైనికుల ఆచూకీని మాత్రం పాకిస్థాన్‌ బయటపెట్టలేదు. వారిలో 27 మంది సైన్యం, 24 మంది వైమానిక దళం, ఇద్దరు నౌకాదళం, ఒకరు బీఎస్‌ఎఫ్‌కు చెందిన వారున్నారు.

54 మంది జవాన్ల తరఫున ఇద్దరు బ్రిటిష్‌ న్యాయవాదులు భారత సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేశారు. సైనికుల విడుదల కోసం ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పాక్‌ నిర్బంధంలో ఉన్న భారత సైనికుల ఆచూకీని కనుగొనలేకపోయామంటూ భారత ప్రభుత్వం 2015లో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేసింది. వారి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటామని అఫిడవిట్‌లో పేర్కొంది.

తమ జైళ్లలో భారతీయులెవరూ లేరంటూ పాకిస్థాన్‌ 1989 దాకా చెబుతూ వచ్చింది. అయితే 54 మంది యుద్ధ ఖైదీలు తమ వద్దే ఉన్నారని 1989లో పాకిస్థాన్‌ను సందర్శించిన భారత అధికారుల వద్ద మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో గుట్టువిప్పారు. ఆ తర్వాత పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పర్వేజ్‌ ముషారఫ్‌ బేనజీర్‌ వాదనను తిరస్కరించారు. భారత జవాన్లు ఎవరూ తమ జైళ్లలో లేరని, కావాలంటే తమ దేశంలోని జైళ్లను సందర్శించవచ్చునని ఆహ్వానించారు. ఎంత వెతికినా వీరి ఆచూకీ బంధువులకు తెలియలేదు. భారత జవాన్లు బతికే ఉన్నారని జైళ్ల వద్ద ప్రైవేటు గార్డులు తమకు చెప్పారని బంధువులు తెలిపారు.

మేజర్ అశోక్ సూరి నుంచి డాక్టర్ సూరికి లేఖ అందింది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నానని అందులో ఉంది. లేఖను తీసుకుని రక్షణ మంత్రిత్వశాఖను సంప్రదించారు. ఈ లేఖలోని రాత మేజర్‌ అశోక్‌దేనని నిర్ధారణకు వచ్చిన రక్షణ కార్యదర్శి ఒక అధికార ప్రకటన తయారుచేశారు. మేజర్‌ అశోక్‌ యుద్ధంలో చనిపోయాడు అని కాకుండా తప్పిపోయాడు అని అందులో రాశారు. ఆ తర్వాత 54 మంది సైనికుల బంధువులు ఒక సంస్థగా ఏర్పడ్డారు. డాక్టర్‌ సూరి 1999 వరకు రక్షణశాఖను సంప్రదిస్తూనే ఉన్నారు.

1982లో పాకిస్థాన్‌ నియంత జనరల్‌ జియావుల్‌ హక్‌ భారతదేశాన్ని సందర్శించినపుడు- 54 మంది భారత సైనికుల్ని విడిచిపెడతారని అందరూ ఆశించారు. కానీ వారిని తమ దేశం సందర్శించడానికి జియావుల్‌ హక్‌ అనుమతించారు. ఆరుగురు సైనికుల బంధువులు పాకిస్థాన్‌ వెళ్లడానికి ఏర్పాట్లుచేశారు. 1983 సెప్టెంబరు 12వ తేదీన వీరు లాహోర్‌ వెళ్లారు. అక్కడ్నుంచి సెప్టెంబరు 15వ తేదీన ముల్తాన్‌ జైలుకు వెళ్లారు. కానీ వారికి భారత సైనికుల జాడ ఎక్కడా కనిపించలేదు. డాక్టర్ సూరి 1999లో మరణించారు. మొత్తంమీద 54 మంది ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది!!

Next Story