2014 గుండెకోతకు వైసీపీ స్టంట్‌ వేస్తుందా?

2014 గుండెకోతకు వైసీపీ స్టంట్‌ వేస్తుందా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మూడుపార్టీల అధినేతలూ సుడిగాలి పర్యటనతో నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. అయితే...

ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మూడుపార్టీల అధినేతలూ సుడిగాలి పర్యటనతో నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం గత ఎన్నికల ఫలితాలను తలచుకొని వెంట్రుకవాసిలో అధికారం చేజారిపోడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.

నవ్యాంధ్రప్రదేశ్ తొలిఎన్నికల్లో తమ పార్టీ విజయానికి చేరువగా వచ్చి స్వల్ప ఆధిక్యంతో అధికారానికి దూరం కావటాన్ని వైసీపీ అధినేత ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల ఫలితాలను తలచుకొంటే ఇప్పటికీ వైసీపీకి గుండెకోతగానే అనిపిస్తోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐదేళ్ల క్రితం నవ్యాంధ్రకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 5 లక్షల 63వేల ఓట్ల తేడాతో అధికారం చేజార్చుకోవాల్సి వచ్చింది. టీడీపీ-బీజెపీ కూటమితో పాటు జనసేన ప్రభావం కూడా తమ ఓటమికి కారణమనే వైసీపీ భావిస్తోంది. బీజెపీ, జనసేన పార్టీలు తమకు దక్కాల్సిన 9 లక్షల ఓట్లను టీడీపి పడేలా చేశాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తమకంటే కేవలం 1.96 శాతం తేడా ఓట్లతో మాత్రమే టీడీపీ అధికారం చేజిక్కించుకొందని ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

1999 ఎన్నికల్లో బీజెపీతో పొత్తు పెట్టుకోడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొన్న టీడీపీ 2014 ఎన్నికల్లో సైతం బీజెపీ, జనసేన అండతోనే లబ్దిపొందింది. 2014లో ఏపీ శాసనసభలోని 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2కోట్ల 87 లక్షల 94వేల 902 ఓట్లు పోల్ కాగా టీడీపీ-బీజెపీ కూటమికి కోటీ 34 లక్షల, 95వేల 305 ఓట్లు దక్కాయి. వైసీపీకి కోటీ 29 లక్షల 31వేల 730 ఓట్లు వచ్చాయి. టీడీపీ- బీజెపీ కూటమి 46.86 శాతం ఓట్లు సాధిస్తే వైసీపీ మాత్రం 44.90 శాతం ఓట్లు సాధించగలిగింది.

ఓట్ల శాతాన్ని సీట్ల పరంగా చూస్తే అధికార తెలుగుదేశం 102, వైసీపీ 67, బీజెపీకి 4 స్థానాలు సాధించాయి. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే కమ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కాల్వ శ్రీనివాసులు స్వల్పమెజారిటీతో గట్టెక్కగలిగారు. కోడెల 924 ఓట్ల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకొంటే కాల్వ శ్రీనివాసులు 1827 ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు.

ఏదిఏమైనా గత ఎన్నికల ఫలితాల అనుభవాలను సమీక్షించుకొన్న వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లో కట్టుదిట్టమైన వ్యూహాలతో అధికారాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే జనసేన ఈసారి టీడీపీకి మేలు చేస్తుందా? లేక వైసీపీని అందలం ఎక్కిస్తుందా? అన్నది ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories