పవన్‌ 5 మిస్టేక్స్‌...అవేంటి?

పవన్‌ 5 మిస్టేక్స్‌...అవేంటి?
x
Highlights

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలాడు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉసూరుమన్నాడు. కింగ్‌ లేదంటే కుమారస్వామిలా కింగ్‌ మేకర్‌ అవుతానంటూ,...

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలాడు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉసూరుమన్నాడు. కింగ్‌ లేదంటే కుమారస్వామిలా కింగ్‌ మేకర్‌ అవుతానంటూ, స్టేజి దద్దరిల్లేలా ప్రసంగించాడు. చివరికి తన సీటునూ గెలవలేకపోయాడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి ఏంటి? జనసేనను జనం ఎందుకు ఆదరించలేదు? గాజు గ్లాసును తుక్కుతుక్కుగా ఎందుకు ముక్కలు చేశారు నాడు అన్న చిరంజీవి, నేడు తమ్ముడు పవన్ కల్యాణ్‌ ఆటలో అరటిపండులా ఎందుకు మిగిలారు? జనసేన ఏమాత్రం పోటీనివ్వకపోడానికి కారణాలేంటి? పవన్‌ ఐదు మిస్టేక్స్‌ చేశారు...అవేంటి?

1. ఒక్కడేనా పార్టీ నిర్మాణమేది?

రాజకీయ పార్టీ అంటే ఒక నిర్మాణం ఉంటుంది. పొలిట్‌ బ్యూరో, కార్యవర్గం, జిల్లా, మండల, గ్రామ కార్యదర్శులు, ఇలా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంటుంది. ఎంత పాపులర్ లీడరైనా, సినీ గ్లామరున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో క్యాడర్‌లేకపోతే, అన్నీ వున్నా సున్నా. జనసేనలో పవన్‌ కల్యాణ్‌ తప్ప ఎవరూ కనిపించరు. అసలు పార్టీ నిర్మాణమే లేదు. ఒకరిద్దరూ తప్ప, ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడరు. పార్టీ విధానాలేంటో ఇప్పటికీ తెలియదు. ప్రజారాజ్యం టైంలోనైనా పార్టీ నిర్మాణం కొంతైనా కనిపించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో అలాంటిదేమీలేదు. టీడీపీ, వైసీపీ వంటి క్షేత్రస్థాయి బలమున్న పార్టీలతో తలపడుతున్నామన్న కనీస ఎరుకలేకుండా, పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేశారు పవన్. ఎన్నికల ముంగిట్లో కమిటీలు, కార్యదర్శులను ప్రకటించినా, అప్పటికే కాలాతీతమైంది. అందుకే పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే నాథులు కరువయ్యారు. పార్టీనే కనిపించనప్పుడు, కనిపించే పార్టీలనే జనం ఆదరిస్తారు. అందుకే ఇంత ఘోరాతి ఘోర ఓటమి. కనివిని ఎరుగని పరాజయం. ఆరంభంలోనే అంతులేని గుణపాఠం.

2. టార్గెట్‌ ప్రతిపక్షమేంటి?

అదేంటో విచిత్రంగా పవన్ కల్యాణ్‌, ప్రతిపక్షంపై విమర్శలదాడి చేశారు. ఐదేళ్లు పాలించిన అధికారపక్షాన్ని వదిలేసి, అపోజిషన్‌లో కూర్చున్న వైసీపీని తూర్పారబట్టారు. కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని, భావోద్వేగ అస్త్రాలను సంధించారు. మీకు ఆత్మగౌరవం లేదా, తెలంగాణ నేతలతో కుమ్మక్కయిన వైసీపీని ఆదరిస్తారా అంటూ, సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ నుంచి వైసీపీ పారిపోయిందని, అదే తానయితే సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడినని చెప్పుకున్నారు. మోడీపైనా మాటల దాడి చేశారు. అదే సమయంలో చంద్రబాబుపై విమర‌్శలు చేయడం తగ్గించారు. జనాలకిది ఎబ్బెట్టుగా తోచింది. దీంతో చంద్రబాబు, పవన్‌‌లు కుమ్మక్కయ్యారని వైసీపీ ఆరోపించింది. బాబు వదిలిన బాణమంటూ వైసీపీ చేసిన ఆరోపణలు, జనంలోకి బలంగానే వెళ్లాయి. అందుకే ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్‌ను తిరస్కరించారు.

3. ప్యాకప్‌ మధ్యలో పార్ట్‌టైం రాజకీయమా?

2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు పవన్‌ కల్యాణ్‌. కానీ ఎప్పుడు జనంలోకి వస్తాడో తెలీదు. సినిమా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి, ఆ గ్యాప్‌లో వచ్చినట్టుగా వచ్చి, జనంతో మాట్లాడతారు. వైసీపీ విమర్శించినట్టుగానే, పార్ట్‌ టైం పొలిటీషియన్‌గానే జనాలకు కనిపించారు తప్ప, ఒక చంద్రబాబు, ఒక జగన్‌లా సీరియస్‌‌ పొలిటిషియన్‌గా అనిపించలేదు. వారిలా నిత్యం జనాల్లో లేరు. ఆవేశపూరితంగా ప్రసంగించడం, నాలుగు తిట్లు తిట్టడం వెళ్లిపోవడం. సీఎం కావాలన్న బలమైన కాంక్ష కూడా పవన్‌లో కనపడలేదు. అధికారంలోకి రావడానికి రాజకీయాల్లోకి రాలేదని, 20 ఏళ్లపాటు పోరాడతామని చెప్పారు పవన్. అంటే ఇప్పుడే గెలవడం పవన్‌ టార్గెట్‌ కాదు, అందుకే గెలిచే పార్టీనే జనం కూడా గెలిపించారు.

4. దీటైన అభ్యర్థుల అన్వేషణ ఏది?

చివరి వరకూ జనసేన అభ్యర్థులెవరో, ఆ పార్టీ నేతలకే తెలీదంటే ఆశ్చర్యంలేదు. దీటైన గెలుపు గుర్రాలెవరో, ఎక్కడుంటారో, ఎలా ఆకర్షించాలో అన్వేషణ చేయలేదు పవన్. టీడీపీ, వైసీపీల్లో టికెట్లు దక్కని నేతలెవరో వస్తారు, నిలబెడదామని ఎదురుచూశారు. కానీ గట్టి నాయకులెవరూ జనసేన వైపు కూడా తొంగిచూసే సాహసం కూడా చేయలేదు. సీరియస్‌నెస్‌లేకపోవడంతో, గెలిచే పార్టీ వైపే వెళ్లారు. దీంతో అటు క్యాడరు లేక, ఇటు లీడర్లు లేక చతికిలబడింది జనసేన.

5. హోదా ఉద్యమంలో చేతులు కలపలేదే?

ఒకవైపు జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు. కేంద్ర, రాష్ట్ర పాలకులేమో స్టేటస్‌పై దోబూచులాటలు. ఇలాంటి టైంలో హోదా కోసం బలమైన వాయిస్ వినిపించాల్సిన పవన్, మోడీ, బాబు మీద మొహమాటమో, ఎందుకు అనడం అనుకున్నారో కానీ, స్టేటస్‌ మీద సైలెంటయ్యారు. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఉంటే, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసి వుంటే, జనం నమ్మేవారు. కానీ అలాంటిదేం చేయలేదు పవన్. రాజకీయ వ్యూహం లేక డీలాపడ్డారు. జనం ఇంత ఘోరంగా ఓడించడమే అందుకు నిదర్శనం.

ఈ ఫైవ్‌ మిస్టేక్సే కాదు, ఇంకెన్నో వ్యూహాత్మక తప్పిదాలు చేశారు పవన్ కల్యాణ్‌‌. చివరికి తూర్పు, పశ్చిమ గోదావరిలో తన వర్గం ఓట్లను కూడా ఆకర్షించలేకపోయారు. ఈ రెండు జిల్లాల్లోనూ జనసేన వైఫల్యానికి కారణం, ప్రజారాజ్యం ప్రయోగం వైఫల్యం. పీఆర్పీ లాగే పవన్ కూడా, జనసేనను ఏదో ఒక పార్టీలో కలిపేస్తాడేమోనని కాపు వర్గం నేతలు, ప్రజలు అనుమానించారు. నాడు పీఆర్పీ కోసం ఆస్తులు సైతం అమ్ముకున్న నేతలు, ఈసారి మాత్రం ఇటువైపు చూడలేదనడానికి ఫలితాలే తార్కాణం. వీటికి బలమిచ్చేలా, చిరంజీవని వెనకేసుకురావడం, ఆయనను అన్యాయం చేశారని మాట్లాడటం కూడా గందరగోళానికి ఆస్కారమిచ్చింది. చివరికి సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జట్టుకట్టినా, కనీస పోటీ ఇవ్వలేకపోయారు. కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోయింది జనసేన. ఆ రకంగా టీడీపీకి నష్టాన్ని మిగిల్చింది. ఆరంభంలోనే వచ్చిన ఈ ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని పవన్ కల్యాణ్‌, ఇప్పటికైనా పార్టీ నిర్మాణం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున నిత్యం పోరాటం చేయడానికి సిద్డపడతాడో, లేదంటే అన్నయ్యలా తనకూ రాజకీయాలు అచ్చిరావని, ప్యాకప్‌ చెప్పిన సినిమాలకు తిరిగి మేకప్‌ వేసుకుంటాడో చూడాలి. కానీ ఓడినా, గెలిచినా ప్రజలతో మమేకపార్టీనే జనం ఆదరిస్తారనడానికి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనమే నిదర్శనం. మరి అంతటి ఓపిక, సహనం, వ్యూహం, కార్యదక్షత పవన్‌లో ఉన్నాయా?


Show Full Article
Print Article
Next Story
More Stories