
ఎగిరే బైక్‌తో ప్రపంచంలో మరో విప్లవం.. తొలి ప్లయింగ్ బైక్‌ను ప్రదర్శించిన జపాన్ కంపెనీ
అమెరికాలోని డెట్రాయిట్ ఆటో షోలో... ఫ్లయింగ్ బైక్ విజయవంతంగా ప్రదర్శన
Star Wars Bike: భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతోంది?.. ఈ ప్రశ్నకు జపనీస్ స్టార్టప్ ఎర్‌వింగ్స్ టెక్నాలజీస్ సమాధానం చెబుతోంది. అమెరికాలోని డెట్రాయిట్ ఆటో షోలో ఎగిరే బైక్‌ను ప్రదర్శించి ఎర్‌వింగ్స్ సంస్థ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అచ్చం హాలీవుడ్ సినిమా స్టార్ వార్‌లోని బైక్‌లను తలపించేలా ఉందంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తు రవాణా వ్యవస్థను గాల్లో ఎగిరే బైక్.. పూర్తిగా మార్చి వేయనున్నదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో విన్యాసాలకే పరిమితమైన ఎగిరే కార్లు, బైక్‌లు ఇప్పుడు వాస్తవ రూపంలో వస్తున్నాయి. గాల్లో ఎగిరే కారును తయారుచేసి.. ప్రదర్శించిన చైనాకు.. రెండు వారాల్లోనే ఫ్లయింగ్ బైక్‌ను నడిపి జపాన్ షాకిచ్చింది.
గాల్లో ఎగిరే కార్లు, బైక్‌లపై పయనించాలన్న మనిషి కలలుగన్నాడు. అవి ఎన్నో ఏళ్లుగా ఉరిస్తున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్‌లోని ఎగిరే కార్లు, బైక్‌లను చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వాటిని చూసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నాయి. అందుకు తొలి అడుగు చైనా వేసింది. తాజాగా గాల్లో ఎగిరే కారును ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. సిచువాన్ ప్రావిన్స్ చెంగ్డులోని నైరుతి జియాటాంగ్ యూనివర్శిటీకి చెందిన చైనీస్ పరిశోధకులు ఎగిరే కారును తయారుచేసి పరీక్షించింది. ఆయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కండక్టర్ రైల్‌పై కారు ఎగురుతూ ప్రయాణించింది. ఒక విధంగా చెప్పాలంటే హైస్పీడ్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీనే ఈ కార్లలో కూడా ఉపయోగించారు. మొత్తం 8 కార్లను పరీక్షించారు. బలమైన అయస్కాంతాలను కార్లకు దిగువన అమర్చి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ స్సెషల్ ట్రాక్‌పై ఎగురుతూ పరుగులు తీసింది. 8 కార్లలో ఓ కారు.. 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. 2.8 టన్నుల బరువున్న ఈ కారు... నేలకు 35 మిల్లీ మీటర్ల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించింది. అయితే నిపుణులు మాత్రం ఈ కారును ఎగిరేది కాదని.. మాగ్నటిక్ కారుగానే చెబుతున్నాయి. అత్యంత వేగవంతమైన అయస్కాంత రైళ్లను చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఇప్పటికే విజయవంతంగా నడుపుతున్నాయి. ట్రాక్‌కు, చక్రాలకు మధ్య ఘర్షణ లేకపోవడంతో అత్యంత వేగంగా ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి.
చైనా ఎగిరే కారుపై ఆటో రంగం నిపుణులు పెదవి విరిచారు. ప్రత్యేకంగా అయస్కాంతాల తయారీ.. ట్రాక్ ఉన్న చోటే ఎగిరే కారును నడపడం.. అనేది ఇబ్బందికరమైన విషయమని వివరిస్తున్నారు. దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కష్టమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు జపాన్ షాకిచ్చింది. ఎగిరే కారు కాదు.. ఏకంగా ఎగిరే బైక్‌ను తయారు చేసి.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ బైక్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన ట్రాక్ నిర్మించాల్సిన అవసరం లేదు. ఇది అచ్చంగా.. హెలికాప్టర్ లాగా గాల్లోకి ఎగురుతుంది.. జపాన్‌కు చెందిన సార్టప్ కంపెనీ ఎర్‌వింగ్స్ టెక్నాలజీ... ప్రపంచంలోనే తొలి ఫ్లయింగ్ బైక్‌ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. ఈ హోవర్‌బైక్‌ను చూసిన నెటిజన్లు.. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన స్టార్‌వార్స్‌లోని స్పీడర్ బైక్‌లా ఉందే అంటూ ఆశ్చర్యపోయారు. అచ్చం సీటింగ్ బైక్‌లా ఉండి.. దిశలను మార్చుకునేందుకు హ్యాండిల్ ఉంది. ఈ బైక్‌ను డెట్రాయిట్ ఆటో షో ఉపాధ్యక్షుడు థాడ్ స్వయంగా నడిపి చూపించాడు. 300 కేజీల బరువున్న ఈ బైక్ 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఫ్లయింగ్ ఎగిరింది. ఈ బైక్‌ను థాడ్.. నడిపినప్పుడు తన వయస్సు 15 ఏళ్లు ఉన్న భావన కలిగిందని థాడ్ చెప్పారు. స్టార్‌వార్స్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించిందన్నారు. ఇదొక అద్భుతమని.. కొందరికి భయం కలిగినా.. తనకు మాత్రం ఒళ్లు గుగుర్పాటుకు లోనైట్టు థాడ్ చెప్పారు.
టురిస్మో హోవర్ బైక్ పేరుతో తయారుచేసిన ఈ ఫ్లయింగ్ బైక్.. గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు. ఇప్పటికే జపాన్‌లో టురిస్మో హోవర్‌బైక్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నుంచి అమెరికాలో విక్రయించడానికి ఎర్‌వింగ్స్ టెక్నాలజీస్ సిద్ధమవుతోంది. ఆ సంస్థ ఫ్లయింగ్ బైక్ ధరను కూడా నిర్ణయించింది. 7 లక్షల 77 వేల డాలర్లకు ఈ హోవర్ బైక్‌ను విక్రయిస్తున్నట్టు వెల్లడించింది. అంటే.. మన రూపాయల్లో చెప్పాలంటే.. దీని ఖరీదు 6 కోట్ల 19 లక్షల 30వేల పైమాట.. అయితే ఈ ట్రెస్మో హోవర్ బైక్ ధర భారీగా ఉంది. దీన్ని మరింత మెరుగు పరిచి.. మరింత లైట్ బైక్‌లను తయారుచేయనున్నట్టు ఎర్‌వింగ్స్ టెక్నాలజీ చెబుతోంది. రెండు, మూడేళ్లలో తక్కువ ధరకు అంటే.. 39 లక్షల రూపాయలకు విక్రయించనున్నదట. ఒకప్పుడు ఎవరికైనా సైకిల్ ఉంటేనే.. అబ్బో అనుకునే రోజుల నుంచి... ఇప్పుడు ప్రతి పేదోడి ఇంటి ముందూ బైక్ నిలబడే రోజులు వచ్చేశాయి. ఈ ఫ్లయింగ్ బైక్ కూడా ఫ్యూచర్‌లో మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో.. మరింత ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఫ్లయింగ్ టెక్నాలజీలో చైనాను జపాన్ మించిపోయింది. హైస్పీడ్, మాగ్నెటిక్ ట్రైన్ల విషయంలో బీజింగ్‌తో టోక్యో పోటీ పడుతోంది. ఇప్పుడు ఈ టురిస్మోహోవర్ బైక్‌తో జపాన్ పైచేయి సాధించింది. టెక్నాలజీలో తాము కూడా ముందున్నామంటూ జపాన్ నిరూపించింది.
టురిస్మో హోవర్‌బైక్‌ను నిజానికి 2021 అక్టోబరులోనే ఎర్‌వింగ్స్ సంస్థ ప్రదర్శించింది. టురిస్మో రాకతో భవిష్యత్తులో పట్టణ రవాణా వ్యవస్థ తీరు సమూలంగా మారనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భారీ ట్రాఫిక్‌లు, పొల్యూషన్‌కు ఈ ఎగిరే బైక్‌లు చెక్ పెడుతాయంటున్నారు. అంతేకాకుండా.. ఈ బైక్‌ను ఎక్కడైనా ల్యాండింగ్ చేసే అవకాశం ఉంది. ఈజీగా ఎగరగలదు. ఇదే కాకుండా.. ఓలా లాంటి సంస్థలు ఎగిరే కారును తయారుచేయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎగిరే కారు పేరుతో చైనా మాత్రమే ప్రదర్శన నిర్వహించింది. ఆ తరువాత ఎగిరే బైక్‌లను జపాన్ కంపెనీ ఎర్‌వింగ్స్ ప్రదర్శించింది. దీంతో వీటి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. రవాణా వ్యవస్థ పూర్తిలో కీలక మార్పులు రానున్నాయి. ఒకప్పుడు జంతువులను రవాణా సాధనాలుగా మనిషి ఉపయోగించుకున్నాడు. ఆ తరువాత చక్రం విప్లవంతో.. ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆ తరువాత బండ్లు, వాహనాలు, రైళ్లు వచ్చాయి. విమానాల రాకతో దేశాల మధ్య దూరం కూడా బాగా తగ్గిపోయింది. ఆ తరువాత ఒక్కరే ఎగరాలన్న కల మొదలైంది. విమానాలు, హెలికాప్టర్లు భారీ వాహనాలు కావడం.. వాటిని సమాన్యులు కొనలేని పరిస్థితి. దీంతో ఎగిరే కార్లు, బైక్‌లపై ప్రజలకు మోజు పెరిగింది. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడ్డాయి.
ఏదేమైనా.. ఎగిరే కారు మాత్రం.. ప్రపంచాన్ని విస్మయపరిచింది. సర్వత్రా జపాన్ కంపెనీ ఎర్‌క్విన్ రూపొందించిన టురిస్మో హోవర్‌బైక్ ఆసక్తి రేపుతోంది. ఈ బైక్ రవాణా విప్లవానికి నాంది పలుకుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




