Burj Khalifa: యుద్ధం వస్తే బుర్జ్ ఖలీఫాకు బీమా వర్తిస్తుందా? వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

Burj Khalifa
x

Burj Khalifa: యుద్ధం వస్తే బుర్జ్ ఖలీఫాకు బీమా వర్తిస్తుందా? వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

Highlights

Burj Khalifa: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తున్నాయి.

Burj Khalifa: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తున్నాయి. యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, ఒక దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఆస్తి నష్టం కూడా. ఈ నేపథ్యంలోనే, గల్ఫ్ దేశాల గర్వకారణంగా, దుబాయ్ సిగలో వజ్రంలా మెరిసే ప్రపంచంలోనే ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఈ ఐకానిక్ కట్టడానికి ఏదైనా నష్టం వాటిల్లితే, బీమా సంస్థలు ఆ నష్టాన్ని భరిస్తాయా? అసలు బుర్జ్ ఖలీఫా బీమా వెనుక ఉన్న అసలు చిక్కుముడులేంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బుర్జ్ ఖలీఫా వంటి భారీ నిర్మాణాలకు బీమా అనేది సాధారణ ఇళ్లకు చేసే పాలసీలా ఉండదు. దీనిని అభివృద్ధి చేసిన ఎమ్మార్ ప్రాపర్టీస్, ఈ మెగా ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయల కవరేజీని తీసుకుంది. అయితే, భీమా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. బుర్జ్ ఖలీఫా వంటి అత్యాధునిక మౌలిక వసతుల ప్రాజెక్టుల బీమా పాలసీలు అత్యంత క్లిష్టంగా ఉంటాయి. ఇందులో ఆస్తి నష్టం, నిర్మాణ లోపాలు, ప్రమాదాలు వంటి వాటికి రక్షణ ఉన్నప్పటికీ, రాజకీయ హింస లేదా యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.

ముఖ్యంగా ఉగ్రవాద దాడులకు, పూర్తిస్థాయి యుద్ధానికి మధ్య బీమా సంస్థలు స్పష్టమైన రేఖను గీస్తాయి. సాధారణంగా ఉగ్రవాద దాడులు లేదా అల్లర్ల వల్ల జరిగే నష్టానికి బీమా కవరేజ్ లభించే అవకాశం ఉంటుంది. కానీ, రెండు దేశాల మధ్య అధికారికంగా యుద్ధం ప్రకటించబడితే, ఆ యుద్ధం వల్ల కలిగే విధ్వంసాన్ని అనేక అంతర్జాతీయ బీమా పాలసీలు మినహాయింపుల కింద పరిగణిస్తాయి. అంటే, యుద్ధం వల్ల భవనం దెబ్బతింటే బీమా కంపెనీలు పైసా కూడా చెల్లించకపోవచ్చు.

అంతేకాకుండా, క్లెయిమ్ చెల్లింపు అనేది కేవలం నష్టం జరగగానే ఆటోమేటిక్‌గా జరగదు. జరిగిన నష్టం స్వభావం ఏమిటి? అది పాలసీ పరిమితుల్లో ఉందా? లేదా? అనే దానిపై సుదీర్ఘ దర్యాప్తు జరుగుతుంది. బుర్జ్ ఖలీఫా అనేది ఒక మిక్స్‌డ్-యూజ్ భవనం. అంటే ఇందులో హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాలు, విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిలో ప్రతి విభాగానికి విడివిడిగా బీమా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నష్టం ఎక్కడ జరిగింది అనే దానిపై కూడా పరిహారం ఆధారపడి ఉంటుంది.

విశ్లేషకుల అంచనా ప్రకారం, ఒకవేళ చిన్నపాటి నష్టం లేదా ప్రమాదం జరిగితే దాదాపు రూ. 150 కోట్ల వరకు పరిహారం అందే అవకాశం ఉంది. కానీ భారీ విధ్వంసం జరిగితే మాత్రం పరిహారం రావడం అనేది పూర్తిగా పాలసీలోని చిన్న అక్షరాల నిబంధనలపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి, బుర్జ్ ఖలీఫా వంటి అద్భుత కట్టడాలకు బీమా రక్షణ ఉన్నప్పటికీ, యుద్ధం అనే భయంకర వాస్తవం ముందు ఆ కాగితపు నిబంధనలు ఎంతవరకు నిలబడతాయనేది సందేహమే. అందుకే, ప్రపంచ శాంతిని కోరుకోవడమే ఈ ఐకానిక్ భవనానికి అసలైన రక్షణ.

Show Full Article
Print Article
Next Story
More Stories