Trump Effect: మిలటరీ విమానాలే ఎందుకు... అమెరికా ఓవరాక్షన్ చేస్తోందా?

Why Donald Trump Using US Airforce Planes for Mass Deportation
x

మిలటరీ విమానాలే ఎందుకు... అమెరికా ఓవరాక్షన్ చేస్తోందా?

Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగిన అనుమతి పత్రాలు లేని వలసదారులను వారి సొంత దేశాలకు పంపిస్తున్నారు. అందుకోసం అమెరికా మిలిటరీ విమానాలు ఉపయోగిస్తున్నారు.

Why Donald Trump using US Airforce planes for mass deportation: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగిన అనుమతి పత్రాలు లేని వలసదారులను వారి సొంత దేశాలకు పంపిస్తున్నారు. అందుకోసం అమెరికా మిలిటరీ విమానాలు ఉపయోగిస్తున్నారు.

నిజానికి, వారిని సాధారణ విమానాల్లో పంపించవచ్చు. కానీ, ఖర్చు ఎక్కువైనా అందుకు ట్రంప్ మిలటరీ విమానాలను ఉపయోగిస్తున్నారు.

అమెరికా నుండి అక్కడికి సమీపంలోనే ఉన్న గ్వాటేమాల దేశానికి కూడా వలసదారులను ఇలాగే మిలిటరీ విమానంలో తరలించారు. అమెరికా నుండి 24 గంటల ప్రయాణ దూరం ఉన్న ఇండియాకు కూడా మిలటరీ విమానాలనే ఎందుకు ఉపయోగించారు?

మిలటరీ విమానాలతోనే మెసేజ్?

సాధారణ ప్రయాణికుల విమానాల్లో వలసదారులను పంపించడం వల్ల నిజానికి ఆయా దేశాల పట్ల మర్యాదతో వ్యవహరించినట్లుగా ఉండేది. కానీ, ట్రంప్ ఈ వ్యవహారంతో బలమైన సంకేతాలను ఇవ్వదలచుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను తాము నేరస్థులుగా పరిగణిస్తున్నామని, కాబట్టి నేరస్థుల డిపోర్టేషన్‌కు మిలటరీ విమానాలే కరెక్టని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, ఇది వలసదారుల పట్ల మాత్రమే కాదు, వారిని ఏ దేశానికి పంపిస్తున్నారో ఆ దేశం పట్ల కూడా అవమానకరంగా వ్యవహరించడమే అవుతుందనే వాదనలు బలంగా ముందుకు వస్తున్నాయి.

ఖర్చు రూ. 4 కోట్ల కన్నా ఎక్కువే...

టెక్సస్ నుంచి అక్కడక్కడా ఆగుతూ మొత్తంగా 19 గంటలు గాలిలో ప్రయాణించి ఇండియా చేరుకున్న యూఎస్ మిలటరీ సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం రవాణా వ్యయం రూ. 4 కోట్లకు పైమాటేనని రాయిటర్స్ వంటి వార్తా సంస్థలు తెలిపాయి. మామూలు ప్రయాణికుల విమానాల్లో ఒక వ్యక్తిని అమెరికా నుంచి ఇండియాకు ఫస్ట్ క్లాస్‌లో పంపించి 853 డాలర్లు ఖర్చవుతుంది. అదే, గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ‌లో పంపించడం వల్ల ఒక్కొక్కరికి 4,675 డాలర్లు ఖర్చయినట్లు వార్తలు వచ్చాయి. భారత కరెన్సీలో చూస్తే ఒక వ్యక్తిని పంపించడానికి 75 వేలతో అయ్యే పనికి ట్రంప్ 4 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

నేరస్థులనే ముద్ర కోసం...

అక్రమ వలసదారులను ట్రంప్ మొదటి నుండి నేరస్తులుగానే చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో కూడా అక్రమ వలసదారులను ట్రంప్ క్రిమినల్ ఏలియెన్స్ అనే సంభోదించారు. అందుకే వారిని గౌరవప్రదంగా రెగ్యులర్ ఫ్లైట్స్‌లో పంపించడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే, సరైన అనుమతి పత్రాలు లేకుండా తమ దేశంలోకి వచ్చే వారంతా నేరస్థులే అని చాటేందుకే ట్రంప్ ఇలా మిలటరీ విమానాలను ఉపయోగిస్తున్నారు.

ఇకపై కూడా ఇలా అమెరికాలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా... లేదా వీసా గడువు ముగిసిన తరువాత కూడా అక్రమంగా ఉంటున్నా వారికి ఇదే ట్రీట్మెంట్ ఇస్తామని ట్రంప్ చెప్పదలచుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

అయితే, అక్రమ వలసదారులకు ఎలాంటి హాని కలుగకుండా చూసేందుకు యుద్ధ విమానాల్ని వాడుతున్నారని మరికొందరు సమర్థిస్తున్నారు. వలసదారులను తరలిస్తున్నప్పుడు వారికి ఏమైనా జరిగితే అది అమెరికాకు చెడ్డ పేరు తెస్తుందన్నది వారి వాదన.

అయితే, ట్రంప్ వైఖరి తెలిసినవారు... ఆయన వలసదారుల పట్ల ఉపయోగిస్తున్న భాషను గమనిస్తున్న వారు ఈ తరహా వాదనల్లో అర్థం లేదని అంటున్నారు. ఒక దేశానికి చెందిన వలసదారులను తిప్పి పంపించే పద్ధతి అవమానకరంగా ఉండాల్సిన అవసరం లేదని దౌత్య నిపుణులు చెబుతున్నారు. మర్యాదపూర్వక దౌత్య సంబంధాలకు ఇది విఘాతం కలిగిస్తుందని వారు అంటున్నారు. పైగా, భారత్ సంగతి వేరు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడంలో సహకరిస్తామని భారత్ తెలిపిందని స్వయంగా ట్రంపే చెప్పారు. అలాంటప్పుడు అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం సరైంది కాదని వారంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కూడా వారు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories