Mass deportation: లక్షల మంది భారతీయులు ఇక అమెరికా నుండి వెనక్కి రావాల్సిందేనా?

US Military flight landed in Amritsar
x

Trump Immigration Policy: అమెరికా నుంచి 205 మంది వెనక్కి వచ్చేశారు... ఇంకా ఎందరు?

Highlights

US Military flight landed at Amritsar Airport in India: భారత్‌కు కూడా అమెరికా ఒక మిలిటరీ ఫ్లైట్ పంపించింది. అందులో 205 మంది భారతీయులు ఉన్నారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరిన C-17 అనే మిలిటరీ విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో అత్యధికంగా 30 మంది పంజాబ్ వారే ఉన్నారు.

Donald Trump about India, US relations : అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. అక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి సొంత దేశాలకు వెనక్కి పంపిస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ పని మొదలుపెట్టేశారు. ఇప్పటికే 5 వేల మంది అక్రమవలసదారులతో గ్వాటెమాల, పెరు, హండురస్ లాంటి దేశాలకు విమానాలు వెళ్లిపోయాయి. ఈ మూడు కూడా సెంట్రల్ అమెరికన్ దేశాలే.

భారత్‌కు కూడా అమెరికా ఒక మిలిటరీ ఫ్లైట్ పంపించింది. అందులో 205 మంది భారతీయులు ఉన్నారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరిన C-17 అనే మిలిటరీ విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో అత్యధికంగా 30 మంది పంజాబ్ వారే ఉన్నారు. మాస్ డిపోర్టేషన్ మొదలుపెట్టిన తరువాత సుదూర ప్రాంతానికి అమెరికా పంపించిన మొదటి ఫ్లైట్ ఇదే.

ఇండియా వెరిఫై చేసిన తరువాతే

ఈ విమానంలో ఉన్న భారతీయులను అందరినీ భారత ప్రభుత్వం ముందుగానే వెరిఫై చేసుకుంది. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలకు తమ సహకారం ఉంటుందని భారత్ ముందుగానే చెప్పింది. ఇదే విషయమై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ... అక్రమ వలస అనేది వ్యవస్థీకృత నేరం కిందకే వస్తుందన్నారు. అందుకే భారత్ ప్రతిష్ట దెబ్బతినకుండా వారిని వెనక్కి తీసుకుంటామని అన్నారు.

ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ట్రంప్ కూడా ఒక మాట స్పష్టంగా చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ గుర్తుచేసుకున్నారు.

అయితే, ఈ విషయంలో భారత్ కూడా అమెరికాకు ఒక విషయం స్పష్టంగా చెప్పింది. అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న భారతీయులను కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీ పేరుతో ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని భారత్ కోరింది. అలాగే స్టూడెంట్ వీసాలు, H1B వీసాల జారీ విషయంలోనూ అమెరికా సహకరించాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కోరారు.

ఫ్రాన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సదస్సు ముగించుకున్న తరువాత ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 13న ప్రధానీ మోదీ, ట్రంప్‌తో భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.

అమెరికాలో అన్నిరంగాల్లో పని చేస్తున్న వారిలో 5 శాతం మంది అక్రమ వలసదారులేనని అమెరికా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందుకే, ఈ విషయంలో స్థానిక అమెరికన్లు ట్రంప్ ను సమర్థిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లక్షల మంది భారతీయులు వెనక్కి రావాల్సిందేనా?

అమెరికా ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ 1 కోటి 33 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వారిలో 7 లక్షల 25 వేల మంది భారతీయులు ఉన్నారు.

ప్రస్తుతానికి 15 లక్షల మందిని దేశం దాటించేందుకు గుర్తించారు. ఆ ప్రాథమిక జాబితాలో 18 వేల మంది భారతీయులు కూడా ఉన్నారు. అంటే, ఒకవేళ ట్రంప్ ఈ మాస్ డిపోర్టేషన్ ప్రోగ్రాం ఇలానే కంటిన్యూ చేస్తే... రాబోయే రోజుల్లో అమెరికా నుండి ఇలాంటి విమానాలు ఇంకా చాలానే వచ్చే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో అక్కడి ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ బిక్కుబిక్కుమంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?

2024లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అమెరికాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించారు. కాకపోతే ఇప్పుడున్నంత భారీ సంఖ్య అప్పుడు లేదు. గతేడాది అమెరికా 1100 మంది భారతీయులను ఇండియాకు పంపించింది.

ఇలాంటి ఘటనే మరొకటి 2019 అక్టోబర్ 18న జరిగింది. అమెరికాకు పొరుగునే ఉన్న మెక్సికో నుండి న్యూ ఢిల్లీకి ఒక విమానం వచ్చింది. ఈ విమానంలో 300 మంది భారతీయులు ఉన్నారు.

డిపొర్టేషన్‌కు అయ్యే ఖర్చు ఎంత?

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఇలా విదేశీయులను అమెరికా సరిహద్దులు దాటించేందుకు అమెరికాకు 315 బిలియన్ డాలర్ల నుండి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అమెరికాకు భౌగోళికంగా దగ్గరిగా ఉన్న గ్వాటెమాలకు ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్‌ను పంపించేందుకు ఒక్కొక్కరి 4,675 డాలర్ల చొప్పున ఖర్చయింది. మరి అలా లక్షల మందిని బార్డర్ దాటించాలంటే ఆ ఖర్చు ట్రిలియన్ డాలర్లు దాటే ప్రమాదం ఉందని ఒక అంచనా.

అమెరికాలో అక్రమ చొరబాట్లకు కారణాలు

ఈ విషయంలో ఉదాహరణకు భారతీయుల కోణంలోనే చూస్తే... భారత్‌లో రూపాయి విలువతో పోల్చుకుంటే అమెరికాలో డాలర్ వ్యాల్యూ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం ఒక డాలర్ విలువ 87 రూపాయలకు సమానం. అంతేకాదు... ఉదాహరణకు అమెరికాలోని మిస్సిసిప్పి రాష్ట్రంలో తలసరి ఆదాయం 48,100 డాలర్లుగా ఉంది. అదే ఇండియాలో తలసరి ఆదాయం 1,161 డాలర్లుగా ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా అమెరికాలో ఉండేవారి తలసరి ఆదాయం ఇక్కడి కంటే 40 రెట్ల కంటే ఎక్కువే అన్నమాట.

అందుకే సహజంగానే అవకాశం ఉంటే అమెరికా వెళ్లి సంపాదించాలనే కోరిక చాలామందిలో ఉంటోంది. కానీ అమెరికా వీసా ప్రక్రియ అంత ఈజీ కాదు. వీసా కోసం అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. అలాగే వీసా కోసం అప్లై చేసింది మొదలు అప్రూవ్ అవడానికి పట్టే సమయం ఇంకా ఎక్కువ. ఇవన్నీ తప్పించుకుని అమెరికాలో కాలు పెట్టాలని అనుకున్న వారే ఇలా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు.

యస్... ఇప్పుడు మీకు సహజంగానే ఒక డౌట్ రావచ్చు. మరి అమెరికా వీసా లేకుండానే ఇండియా బార్డర్ దాటి అక్కడి వరకు ఎలా వెళ్లగలుగుతున్నారని!! రైట్... అక్కడికే వస్తున్నాం.

అమెరికా వీసా ప్రాసెస్ కష్టం. కానీ ఆ పక్కనే ఉన్న కెనడాకు వీసా రావడం అంత కష్టమేం కాదు. అమెరికాతో పోల్చుకుంటే ఇప్పటివరకు ఇండియన్స్‌కు కెనడా ఈజీగానే వీసాలు ఇచ్చేసింది. కెనడా వెళ్లిన ఇండియన్స్ అక్కడి నుండి అక్రమంగా దేశం సరిహద్దులు దాటి వీలైతే నేరుగా అమెరికాలోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లేదంటే మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు.

తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చే వారికి కెనడా, మెక్సికో బార్డర్స్ ఒకరకంగా గ్రీన్ కారిడార్ తరహాలో పనిచేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అక్కడి పరిస్థితి ఏంటో చెప్పడానికి అమెరికా చేస్తోన్న ఈ ఒక్క ఆరోపణ చాలు.

2023-24 మధ్య కాలంలో 90,415 మంది ఉత్తరాదిన ఉన్న సరిహద్దుల గుండా అమెరికాలోకి చొరబాటుకు యత్నించినట్లు అమెరికా గుర్తించింది.

అమెరికాలోకి అక్రమంగా ఉంటున్న ఆసియా వాసుల్లో గతంలో ఫిలిప్పీన్స్ వాసులు అధికంగా ఉండే వారు. కానీ ఇప్పుడు భారతీయుల సంఖ్య వారిని దాటిపోయింది.

అక్రమ వలసదారుల్లో అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డవారు ఉన్నారు. అమెరికా ఇచ్చిన వీసా గడువు దాటినప్పటికీ దేశం విడిచిపోకుండా ఉన్న వాళ్లూ ఉన్నారు.

అక్రమ వలసదారులలో చాలామంది ప్రభుత్వం తమను గుర్తించకుండా ఉండేందుకు అనధికారిక పనులలోనే కొనసాగుతుంటారు. హోటల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, భవన నిర్మాణ రంగం వంటి పనులు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అక్కడే ఒక చోటు నుండి మరో చోటుకు మకాం మార్చుతూ ఉంటారు.

ఇండియా ఎందుకు సహకరిస్తోందంటే...

మాట వినని దేశాలు, తమకు సహకరించని దేశాల నుండి వచ్చే దిగుమతులపై ట్రంప్ అధిక పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాతో పాటు యూరప్ దేశాలకు ట్రంప్ హై టారిఫ్స్ పేరుతో వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు అమెరికాతో ట్రేడ్ వార్ కొనితెచ్చుకోకపోవడమే ఉత్తమం అని ఇండియా భావిస్తోందనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట.

పైగా అమెరికా లీగల్ ఇమ్మిగ్రేషన్ పాలసీకి సహకరించడం ద్వారా భారత్ దౌత్యపరంగా బాధ్యతగా వ్యవహరించినట్లవుతుంది. దీనివల్ల భారతీయులకు H1B వీసాల జారీలో ట్రంప్ కొర్రీలు పెట్టకుండా ఉంటారన్నది కూడా మోదీ ఆలోచనగా ఆ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా అమెరికా గుర్తించిన దాదాపు 18 వేల మందిని సురక్షితంగా వెనక్కి రప్పించే విషయంలో సహకరిస్తామని భారత్ అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories