GPS Spoofing: ఇరాన్, ఇరాక్ గగనతలంలో దారి తప్పుతున్న విమానాలు..

What Is GPS Spoofing That Has Misguided Around 20 Planes Near Iran Iraq Border And How Dangerous Is This
x

GPS Spoofing: ఇరాన్, ఇరాక్ గగనతలంలో దారి తప్పుతున్న విమానాలు..

Highlights

GPS Spoofing: 20 విమానాలకు ఎదురైన నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ ఇబ్బందులు

GPS Spoofing: ఇరాన్‌-ఇరాక్‌ గగనతలంలో విమానాలు తరచూ దారి తప్పడం ఆందోళనకరంగా మారింది. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నేవిగేషన్‌ వ్యవస్థను సైతం ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించేంత శక్తిమంతంగా ఈ సంకేతాలు ఉండడం ఆందోళనకరంగా మారింది. బోయింగ్‌ 777, బోయింగ్‌ 737, 747 సహా పలు ఇతర విమానాలు ఈ సిగ్నల్స్‌ బారినపడిన వాటిలో ఉన్నాయి. జీపీఎస్ తప్పుడు సంకేతాలతో ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 విమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు వారాల వ్యవధిలో 20 విమానాలు జీపీఎస్ తప్పుడు సంకేతాలతో గందరగోళానికి గురైన అంశంపై ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్ గగనతలం మీదుగా ఇటీవల ప్రయాణించిన 20 విమానాలు జీపీఎస్ స్పూఫింగ్‌కు గురయ్యాయని అధికారులు వెల్లడించారు. దీంతో తాము ఎక్కడ ఉన్నామో? ఎటు వెళుతున్నామనే విషయం తెలియక గందరగోళానికి గురయ్యామని పైలట్లు తెలిపారు. తమ లొకేషన్ వివరాల గురించి ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను అడిగి తెలుసుకున్నామని వివరించారు. అప్పుడు సమయం ఎంతవుతోందనే విషయంపైనా కాసేపు గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.

విమాన ప్రయాణాల్లో నేవిగేషన్ వ్యవస్థ కీలకం.. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ప్రతీ క్షణం జీపీఎస్‌తో అనుసంధానమై పైలట్లకు మార్గం చూపుతుంది. ప్రయాణ మార్గంలో వివిధ దేశాల జీపీఎస్ వ్యవస్థలతో అనుసంధానం అవుతూ విమానానికి దారి చూపుతుంది. అయితే, ఇరాన్‌లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని, ఫ్లైట్ నేవిగేషన్ వ్యవస్థ తప్పుడు సంకేతాలను చూపించిందని పైలట్లు తెలిపారు. సాధారణ ప్రయాణికుల విమానాలపై ఇలాంటి దాడి అత్యంత అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇరాన్‌ గగనతలం నుంచి వెళ్లే యూఎం688 ప్రయాణమార్గంలో ఈ ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు చేసింది. కేవలం 15 రోజుల వ్యవధిలో 20 విమానాలపై ఇలా దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

తాజా ఘటనలో నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ ఏకంగా విమాన నేవిగేషన్‌ వ్యవస్థను సైతం ఏమారుస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నేవిగేషన్‌ వ్యవస్థలో విమాన లోకేషన్‌ను చూపించే ఐఆర్‌ఎస్‌.. జీపీఎస్‌ సంకేతాలతో సంబంధం లేకుండా ఔట్‌పుట్‌ ఇస్తుంది. కానీ, తాజా ఘటనల్లో నకిలీ సిగ్నల్స్‌ ఐఆర్‌ఎస్‌ను సైతం తప్పుదోవ పట్టించడాన్ని గమనించారు.

కుర్దిస్థాన్‌ ప్రాంతంలో ఇరాన్‌, ఇరాక్‌ తమవైపు సరిహద్దుల్లో ఇటీవల భారీగా సైనిక బలగాలను మోహరించాయి. ఇరు దేశాల దగ్గర సిగ్నల్‌ జామింగ్‌, స్పూఫింగ్‌ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ వర్గాలు అంటున్నాయి. ఈ దేశాలే ఆ ప్రాంతంలో నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వ్యవస్థలను మోహరించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాక్‌లోని ఉత్తర భాగంలో సరిహద్దుల్లో అనేక స్థావరాల్లో ఇప్పటికీ అమెరికా సేనలు ఉన్నాయి. తుర్కియే సైతం తమ సరిహద్దుల్లో బలగాల్ని మోహరించింది. ఇటీవల అర్మేనియా, అజర్‌బైజాన్‌తో ఉన్న సరిహద్దుల్లో ఇరాన్‌ భారీగా బలగాలను దింపింది. అర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇక్కడ మూడు దేశాల వద్ద జామింగ్‌, స్పూఫింగ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories