పాకిస్తాన్ గగనతలంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త: అమెరికా హెచ్చరిక!

పాకిస్తాన్ గగనతలంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త: అమెరికా హెచ్చరిక!
x
Highlights

పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే విమానాలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా హెచ్చరిస్తోంది.

పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే విమానాలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకు ప్రమాద కర పరిస్థితులు ఎక్కువ ఉండవచ్చని ఆ దేశపు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)అంటోంది. నిజానికి ఈ హెచ్చరికలు గతేడాది మార్చి 23న జారీ చేసింది. అయితే, అప్పట్లో ఈ ముప్పు డిసెంబర్ 31 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ హెచ్చరికలను మరో సంవత్సరం పాటు అంటే, వచ్చే సంవత్సరం జనవరి 1 వరకూ పొడిగిస్తూ తమ వెబ్సైట్ లో సమాచారం ఉంచారు.

అసలు ముప్పు ఎందుకు?

పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు చేసింది.. దీంతో భారత్ స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రయత్నించింది.. తమ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైనట్టు అమెరికా సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది.

ఏం జరగవచ్చు..

'భారత, పాక్ సైన్యం వద్ద ఉపరితలం నుంచి గాల్లోకి, గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించి సామర్థ్యం కలిగిన అధునాతన క్షిపణి వ్యవస్థ ఉంది. ఇవి సాధారణంగా పౌర విమానాలు ప్రయాణించే ఎత్తు లేదా అంతకు మించిన లక్ష్యాలను చేరుకోగలవు. పౌర విమానాలను కూల్చివేయడం ఇరు దేశాల ఉద్దేశం కాకపోయినా, సైన్యం ప్రయోగించిన ఆయుధాలు వల్ల పొరపాటున వాటికి తాకి కూలిపోయే ప్రమాదం ఉందని అమెరికా ఏవియేషన్ సంస్థ హెచ్చరిస్తోంది. కశ్మీర్‌లో ఘర్షణలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, పొరుగు ఉన్న ఎయిర్ నావిగేషన్ సర్వీసు ప్రొవైడర్లు తమ గగనతలాన్ని రక్షించుకునే క్రమంలో పౌర విమానాలను శత్రువుల యుద్ధ విమానాలుగా భావించిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి అంటూ ఆ సంస్థ పేర్కొంది.

అంతేకాదు, పాక్ భూభాగంలోని ఉగ్రవాదుల నుంచి కూడా అమెరికా విమానాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు, ఎయిర్‌పోర్టుల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, ఫిబ్రవరి 26 తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని కొద్దిరోజుల పాటు మూసివేసింది. వైమానిక స్థావరాలను కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అటు, భారత ప్రధాని, రాష్ట్రపతి విమానాలు సైతం తమ గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories