Ukraine: భారీగా సైన్యాన్ని కోల్పోతున్న ఉక్రెయిన్‌

Ukraines Loss of Soldiers | Ukraine News
x

Ukraine: భారీగా సైన్యాన్ని కోల్పోతున్న ఉక్రెయిన్‌

Highlights

Ukraine: డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దాడులతో పెరిగిన రోజువారీ సైనికుల మృతి సంఖ్య

Ukraine: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో కీవ్‌కు తీరని నష్టం వాటిల్లుతోంది. నిత్యం వందలాది మందికి పైగా సైనికులు చనిపోతున్నట్టు తాజాగా ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈనెల ప్రారంభంలో రోజుకు 60 నుంచి 100 మంది సైనికులను కోల్పోతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో రష్యా ప్రారంభించిన తరువాత మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజువారి మరణాల సంఖ్య సగటు 200 నుంచి 500 పెరిగినట్టు ఉక్రెయిన్‌ ఎంపీ డేవిడ్‌ అరాఖమియా తెలిపారు. వాషింగ్టన్‌లోని జర్మనీ మార్షల్‌ ఫండ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తాజాగా రోజువారి నష్టాలను వివరించారు.

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంలో కీవ్‌ భారీగా సైనికులను, ఆయుధాలను కోల్పోతున్నది. రోజువారిగా భారీగా సైనికులు గాయపడుతున్నారు. సగటున వెయ్యి మంది సైనికులు గాయపడుతున్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దాడులు ప్రారంభించిన తరువాత మరణాల సంఖ్య భారీగా పెరిగింది. రష్యా దాడుల్లో సగటున రోజుకు 200 నుంచి 600 మంది సైనికులు చనిపోతున్నారు. తాజాగా ఈ వివరాలను ఉక్రెయిన్‌ ఎంపీ డేవిడ్‌ అరాఖమియా తెలిపారు. వాసింగ్టన్‌లోని జర్మనీ మార్షల్‌ ఫండ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అరాఖమియా పాల్గొన్నారు. తమకు సరైన ఆయుధాలు లేకపోవడంతోనే అత్యధికంగా సైనికులు మృత్యువాత పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి సుశిక్షుతులైన సైనికులు ఉన్నారని.. కానీ.. ఆయుధాలే లేవన్నారు. తమకు మరిన్ని ఆయుధాలను ఇవ్వాలని పశ్చిమ దేశాలను అరాఖమియా కోరారు.

డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్-రష్యా దళాల మధ్య పోరాటం భీకరంగా జరుగుతోంది. సెవెరోడొనెట్‌‌స్క్‌లో మాస్కో బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోరాటంలో వేలాది మంది సైనికులు గాయపడుతున్నారు. వందలాది మంది మృతి చెందుతున్నారు. జూన్‌ ప్రారంభంలో నిత్యం 60 నుంచి 100 మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. సైనికుల పరిస్థితి ఇలా ఉంటే.. పౌరులు ఎంత మంది మృతి చెందారో లెక్కలు తేలడం లేదు. రష్యన్‌ సైనికుల దాడికి సెవెరోడొనెట్‌స్క్‌లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ శిథిలాల కింద చిక్కుకుని ఎంత మంది మృతి చెందారో తెలియదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం సెవెరోడొనెట్‌స్క్‌ నగరాన్ని మాస్కో దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఇప్పటికీ ఈ నగరంపై తమ పట్టు కోల్పోలేదని ఉక్రెయిన్ చెబుతోంది.

రష్యాపై పోరాటానికి తమకు మరిన్ని ఆయుధాలను ఇవ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్నారు. పుతిన్‌ను అడ్డుకోకపోతే.. ఐరోపాకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. పుతిన్‌ను ఎదుర్కొనడానికి తమకు అండగా నిలవాలని జెలెన్‌‌స్కీ కోరుతున్నారు. అమెరికా తాజాగా మరో 100 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకే తాము కీవ్‌లో పర్యటించినట్టు జర్మనీ, ఫ్రెంచ్‌, ఇటలీ అధ్యక్షులు తెలిపారు. వారి పర్యటనతో ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య సభ్యత్వం మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఇచ్చేందుకు ఈ మూడు దేశాల అధినేతలు సానుకూలంగా ఉన్నారు. అయితే ఈయూ సభ్యత్వం రావాలంటే అంత సులభం కాదని.. కొన్నేళ్లు, లేదంటే దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సభ్యత్వం విషయంలోనే అంతకుముందు ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌దెర్‌ లియన్‌ సందర్శించారు. కీవ్‌ సభ్యత్వంపై సానుకూలం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 14న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. నాటి నుంచి రష్యా సైన్యం భీకర దాడులు చేస్తోంది. క్షిపణలు, బాంబర్లతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణాదిలోని మరియూపోల్‌, ఖేర్సన్ ప్రాంతాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు సెవెరోడొనెట్‌స్క్‌పై మాస్కో పట్టుబిగించింది. పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి. రెండ్రోజుల్లో అయిపోతుందనుకున్న యుద్ధం 114 రోజులకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా రష్యా సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. 30వేల మంది క్రెమ్లిన్‌ సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది. అయితే రష్యా మాత్రం అధికారికంగా మరణాల విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఉక్రెయిన్‌పై దాడిని రష్యా సైనిక చర్యగా పేర్కొంటోంది. పశ్చిమ దేశాలు మాత్రం ఆక్రమణగా పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో.. 60 లక్షల మంది ఉక్రెనియన్లు దేశం విడిచి వెళ్లిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. అత్యంత మానవ సంక్షోభం ఉక్రెయిన్‌లో తలెత్తినట్టు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories