Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌

Twitter has Confirmed the Sale of the Company to Elon Musk for $ 44 Billion
x

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌

Highlights

Elon Muskఅమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు మస్క్‌ ఫిర్యాదు చేయడంతో దారికొచ్చిన ట్విట్టర్‌

Elon Musk: దాదాపు నెల రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌ పిట్టను టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ పట్టేసుకున్నారు. వాక్‌ స్వాతంత్రం దిశగా నడిపించేందుకు 4వేల 400 కోట్ల డాలర్లకు డిజిటల్‌ పిట్టను మస్క్‌ సొంతం చేసుకున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సామాజికమాధ్యం పలు దేశాల్లో ప్రజల గొంతుకగా నిలవడమేకాదు ప్రధాన వార్తా శ్రవంతిగా కూడా మారింది. అంతేకాదు ఎన్నో వివాదాలకు కూడా ట్విట్టర్‌ వేదికయ్యింది. ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకోవడంతో మరిన్ని వివాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌పై కన్నేసిన ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. సామ, దాన, దండోపాయాలను ఉపయోగించి 4వేల 400 కోట్ల డాలర్లకు సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకున్నారు. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున 4వేల 650 కోట్ల డాలర్లను చెల్లించేందుకు కూడా సిద్దమని మస్క్‌ ప్రకటించడంతో ట్విటర్‌ యాజమాన్యంపై ఒత్తిడి మరింత పెరిగింది. అప్పటికే 9.2 శాతం షేర్లను 290 కోట్ల డాలర్లతో సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఎలాగైనా ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలని భావించారు. అందుకోసం డైరెక్టర్ పదవిని కూడా వదలుకున్నాడు. టేకోవర్‌కు ప్రతిపాదనలు చేశాడు. అయితే ఎలాన్‌ మస్క్‌ను అడ్డుకునేందుకు ట్విట్టర్‌ బోర్డు పాయిజన్‌ పిల్ వ్యూహాన్ని ప్రయోగించింది. కానీ అప్పటికే నిధులను సిద్ధం చేసుకున్నానని బ్యాంకుల నుంచి రుణాలను కూడా తీసుకున్నట్టు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు మస్క్ ఫిర్యాదు చేశారు. దీంతో ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్‌ ప్రతిపాదనపై చర్చించడం అనివార్యంగా మారింది. ఆమేరకు సోమవారం జరిగిన చర్చల్లో విక్రయానికి ట్విట్టర్ అంగీకరించింది.

వాక్‌ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే కంపెనీలో పెట్టుబడులు పెట్టానని మొదట్లో ఎలాన్‌ మస్క్‌ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత స్థితిలో కంపెనీ వాక్‌ స్వేచ్ఛను పెంచకపోవడమే కాదు. కల్పించే అవకాశమూ లేదంటూ పెట్టుబడులు పెట్టాక అర్థమైనట్టు ట్విట్టర్‌ చైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌కు రాసిన లేఖలో మస్క్‌ పేర్కొన్నారు. లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్‌ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అందుకే సంస్థను పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరువాత మస్క్‌ ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కంటెంట్‌ పరంగా నియంత్రణ సడలించడం, నకిలీ, ఆటోమేటెడ్‌ ఖాతాల తొలగింపు, ఎడిట్‌ బటన్‌ వంటి ప్రతిపాదనలను ఎలాన్ మస్క్‌ చేశారు. వాటినే అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌కు కలిసొస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. బోర్డు డైరెక్టర్లను తొలగించడంతో ఏడాదిలో 30 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని మస్క్‌ గతంలో చెప్పారు. అంతేకాకుండా చైనాలోనూ డిజిటల్‌ పిట్ట విహరించే అవకాశం ఉందంటున్నారు. దీంతో భారీగా ఖాతాదారులు చేరే అవకాశం ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే టెస్లా కంపెనీకి భారీగా బ్యాటరీలను చైనా నుంచే మస్క్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం ట్విట్టర్‌ను అనుమతించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే 2009లో ట్విట్టర్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. అయితే అమెజాన్ వ్యవస్థాకుడు జెఫ్‌ బేజోస్‌ మాత్రం అలా జరగకపోవచ్చని అన్నారు. ట్విట్టర్‌ను అనుమతిస్తే టెస్లాకు సమస్యలకు తప్పవన్నారు. దిగుమతి సుంకాల విషయంలో భారత్‌తోనూ మస్క్‌కు వివాదాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో అక్కడ కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని బేజోస్‌ చెప్పారు.

అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ను జాక్‌ డోర్సీ, బిజ్‌ స్టోన్, ఎవాన్‌ విలియమ్స్, నోవా గ్లాస్‌ కలిసి 2006లో ఏర్పాటు చేశారు. కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా ట్విట్టర్‌ను రూపొందించారు. ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విటర్‌ యూజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, జర్నలిస్టులు, మేధావులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్వయంగా మస్క్‌కు 8 కోట్ల 10 లక్షల మంది యూజర్లు ఉన్నారు. గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7 కోట్ల 70 లక్షల మంది యూజర్లు ఉండగా భారత్‌లో 2 కోట్లా 36 లక్షల మంది యూజర్లు ఉన్నారు. తాజాగా ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్నారని తెలియడంతో షేర్‌ వాల్యూ 3 శాతం పెరిగింది. ప్రస్తుతం షేర్‌ ధర 51. 63 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విట్టర్‌ వచ్చాక తన ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఈ ఏడాది మెుదట్లో తాను ప్రారంభించిన 'ట్రూత్‌ సోషల్‌' సామాజిక మాధ్యమంపై ఎక్కువగా దృష్టిసారిస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఎలాన్‌ మస్క్‌ మంచివాడని ట్విట్టర్‌ను మెరుగుపరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌లో ట్రంప్‌కు ఖాతాను బ్లాక్‌ చేయకముందు 8 కోట్లా 90 లక్షల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories