Trump Tariff: భారతీయ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమాలపై భారీ ప్రభావం

Trump  Tariff: భారతీయ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమాలపై భారీ ప్రభావం
x

Trump Tariff: భారతీయ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమాలపై భారీ ప్రభావం

Highlights

సినిమాలనూ వదలని డొనాల్డ్ ట్రంప్‌.. విదేశీ చిత్రాలపై 100% సుంకాలు భారతీయ సినిమాలకు కష్టకాలం సుంకాలతో తెలుగు పరిశ్రమకు దెబ్బ

ప్రపంచ చలన చిత్ర పరిశ్రమకు పెద్ద షాకే ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై ఏకంగా వంద శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా.. దీని ప్రభావం భారతీయ చిత్రాలపై భారీగానే ఉండే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బే పడబోతోంది. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్‌ నుంచి 30 నుంచి 40 శాతం వసూళ్లు ఉంటే అందులో సింహభాగం తెలుగు సినిమాలదే ఉంటుంది. ట్రంప్ విధించిన సుంకాల నుంచి తప్పించుకోవాలంటే వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.


సినీ పరిశ్రమకు ఇప్పుడు హారర్ సినిమా చూపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్.ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించి ఎడాపెడా సుంకాలు వేస్తున్న అమెరికా అధ్యక్షుని కన్ను ఇప్పుడు సినీ పరిశ్రమ మీద పడింది. అమెరికా వెలుపల విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. వినోద, తయారీ రంగాల ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ యాప్‌లో ప్రకటించేశారు.

‘‘అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై నూరు శాతం సుంకం విధించబోతున్నాం. మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. పిల్లాడి నుంచి మిఠాయిని దొంగిలించినట్లు మా వద్ద నుంచి లాక్కున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న బలహీన, అసమర్థత గవర్నర్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను నూరు శాతం సుంకాలు విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అంటూ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పేర్కొన్నారు.


ప్రస్తుతం అమెరికాలో విదేశీ సినిమాలపై ఎలాంటి సాధారణ సుంకాలు లేవు. అక్కడ సినిమాల్ని ఓ భౌతిక వస్తువులా కాకుండా డిజిటల్‌ గూడ్స్‌ లేదా మేధో సంపత్తిగా పరిగణించడం వల్ల వాటిపై సంప్రదాయ సుంకాలేవీ లేవు. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి ప్రత్యేక పన్ను లేకుండా సినిమాల్ని నేరుగా విడుదల చేస్తున్నారు. థియేటర్లలో టికెట్‌ విక్రయాలపై అమ్మకపు పన్ను, లేదా వినోద పన్ను రూపంలో ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. అందులో దేశీయ సినిమాలు, విదేశీ చిత్రాలనే తేడాలేమీ లేవు.

మే నెలలోనే ట్రంప్‌ సినిమా రంగంపై టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ సినిమా రంగాన్ని వదిలేస్తారేమో అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రేపో మాపో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ట్రంప్‌ యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది.


విదేశీ పోటీదార్ల కారణంగా సినిమా పరిశ్రమపై అమెరికా ఆధిపత్యం తగ్గిందని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఒకప్పుడు అమెరికన్ చిత్రాలకు మారుపేరుగా హాలీవుడ్​ ఉండేది. కానీ ఇటీవల అది ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా ఆన్​లైన్ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్స్‌, ఓటీటీలు వల్ల ప్రేక్షకులు సినిమా థియేటర్​కు రావడం గణనీయంగా తగ్గింది. దీనితో చాలా సినిమాలు బాక్సాఫీస్​ వద్ద బోల్తా పడుతున్నాయి. దీనితో సినిమా నిర్మాణం కూడా బాగా తగ్గింది. దీనికి తోడు 2023, 2024లో రైటర్స్ గిల్డ్​, కార్మిక సంఘాలు సమ్మెలు చేశాయి. ఇవి కూడా అమెరికన్ చిత్ర రంగానికి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించాయి. ఒక అంచనా ప్రకారం 2023లో అమెరికా చిత్ర రంగానికి వచ్చిన నష్టం సుమారుగా 5 బిలియన్ డాలర్లు. పైగా సినిమా రంగంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికీ ఈ నష్టం భర్తీ కాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే, హాలీవుడ్‌ను దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలకూ అమెరికా పెద్ద మార్కెట్‌. ట్రంప్‌ తాజా నిర్ణయం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో పడుతుందో తెలియాలంటే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి సుంకాల నిర్ణయం వేళ అమెరికా మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ షేరు విలువ 1.5 శాతం మేర పతనమైంది.అమెరికాలో సినిమా చిత్రీకరణల్ని పెంచుతూ హాలీవుడ్‌ని బలోపేతం చేయడం కోసమే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఆ ప్రభావం ఇతర దేశాల సినిమాలన్నిటిపైనా పడనుంది. విదేశాల్లో చిత్రీకరణ చేసుకొనే హాలీవుడ్‌ సినిమాలకూ ఈ నిర్ణయం భారమే. వంద శాతం సుంకాల ప్రభావంతో ఇకపై అమెరికా చిత్రాలన్నీ కూడా ఆ దేశంలోనే చిత్రీకరణ చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.


ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం అమెరికా, కెనడాల్లో ఏ సమయంలో చూసినా 1,000కిపైగా భారత భాషల సినిమాలు ఆడుతుంటాయి. భారత దేశ నిర్మాతలు, అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రభావం భారతీయ సినిమాలకు భారంగా మారే ప్రమాదం ఏర్పడింది. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్‌ నుంచే 30 నుంచి 40 శాతం వసూళ్లు వస్తున్నాయి. ట్రంప్‌ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి సినిమాపై వంద శాతం అదనపు సుంకంచెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్‌ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.

ఇక తెలుగు సినీ పరిశ్రమకు మరింత ప్రమాదం ముంచుకొస్తోంది.


అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్‌ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్‌ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్‌ సినిమాలకు మార్కెట్‌ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. త్వరలో కాంతార ఛాప్టర్​-1 రిలీజ్ కానుంది. క్రిష్ 4, కల్కి 2 లాంటి చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటికి తోడు ప్రశాంత్ నీల్​, జూనియర్ ఎన్టీఆర్​, మహేశ్ బాబు, రాజమోళి కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. అమెరికాలో వీటిని రిలీజ్ చేసే ప్లాన్​లో మేకర్స్ ఉన్నారు.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారతీయ సినిమాలపై పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది.


ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్‌ ధరలు 15-25 డాలర్ల మధ్య ఉండగా.. ప్రీమియర్‌ షోలకు ఆ ధర 30 డాలర్ల వరకు ఉంటుంది. దీనిపై ఇప్పుడు ట్రంప్‌ సుంకాల ప్రభావం పడితే ఆ మేరకు పంపిణీ ఖర్చులు డబుల్‌ అవుతాయి, ఆ ప్రభావంతో టికెట్‌ ధరలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి. దాంతో అక్కడ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉంది.

సుంకాల భారి నుంచి తప్పించుకోవాలంటే అమెరికాలోనే షూటింగ్ జరుపుకోవాల్సి ఉంటుంది. మన సినిమాలు అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవడం చాలా అరుదు. అక్కడ చిత్రీకరణలు చేయాల్సిందే. మనవైన కథలు, మన బడ్జెట్‌లతో అక్కడ పూర్తిగా చిత్రీకరణలు చేయడం దాదాపు అసాధ్యమే. ప్రస్తుతం హిందీతోపాటు, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. చిన్న సినిమాలూ అక్కడ విడుదలవుతున్నాయి. సుంకాలు అమల్లోకి వస్తే అక్కడ చిన్న చిత్రాలు విడుదల కావడమే కష్టం అంటున్నాయి వ్యాపార వర్గాలు.


అయతే ట్రంప్ ప్రకటించిన సుంకాలు ఎప్పటి నుంచి? ఎలా విధిస్తారు? అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వైట్‌హౌస్‌ నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. సుంకాలు ఎలా అమలు చేస్తారనే విషయాలపై స్పష్టత వస్తేనే ఇది మన సినిమాని ఎంత ప్రభావం చేస్తుందో ఓ అంచనాకి రావచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ చేసిన సినిమాలకు మాత్రమే ఈ సుంకాలా లేక, కొద్దిమేర అమెరికాలో చిత్రీకరణ చేస్తే సుంకాల భారాన్ని తప్పించుకోవచ్చా? విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు అమెరికాలోనే జరుపుకుంటే ఆ సినిమాలకి పన్ను నుంచి మినహాయింపు దక్కుతుందా అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు.మరోవైపు విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకం విధించే చట్టబద్ధమైన అధికారం అధ్యక్షుడికి ఉందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


విదేశీ సినిమాలపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్, కొద్ది సేపటికే ట్రూత్​ సోషల్​లో మరో పోస్టు పెట్టారు. విదేశాల్లో తయారై, అమెరికాకు వచ్చే ఫర్నీచర్​పై కూడా భారీగా సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు ఫర్నిచర్‌ తయారీ రంగంలో ఒక వెలుగువెలిగిన నార్త్‌ కరోలినా రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు విదేశీ ఫర్నిచర్‌పై సుంకాలు పెంచుతామని తెలిపారు. ‘‘చైనా, ఇతర దేశాల కారణంగా నార్త్‌ కరోలినా ఫర్నిచర్‌ వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ రాష్ట్రాన్ని మళ్లీ ‘గ్రేట్‌’గా మార్చేందుకు అమెరికాలో తయారుచేయని ఫర్నిచర్‌పై టారిఫ్‌లు పెంచుతాం’’ అని పేర్కొన్నారు

ఇటీవల కిచెన్‌ క్యాబినెట్‌, బాత్‌రూమ్‌ పరికరాలతో పాటు అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తాజాగా కలపపై 10 శాతం, కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను తాజాగా విధించారు. ఇవి అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories