Joe Biden: అమెరికా అధక్షుడు బైడెన్ వయస్సుపై ట్రోల్స్‌

Trolls on Americas President Joe Bidens Age
x

Joe Biden: అమెరికా అధక్షుడు బైడెన్ వయస్సుపై ట్రోల్స్‌

Highlights

Joe Biden: బైడెన్‌కు మతిమరుపుపై రిపబ్లికన్ల విమర్శలు

Joe Biden: ఆయన వయస్సు 80 ఏళ్లు. దేశ అధ్యక్షుడైన ఆయన ఇటీవల సైకిల్‌పై నుంచి కింద పడ్డాడు. దీంతో ట్రోలింగ్‌ మొదలయ్యింది. ఆయనకు ఏమీ చేతకాదని వచ్చే ఎన్నికల్లో కష్టమేనని వృద్ధాప్యం కారణంగా మతిమరుపు వచ్చేసిందని ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఇప్పుడు సొంత పార్టీలోనే వచ్చే ఎన్నికలకు ప్రత్యామ్నాయం వెతకాలన్న ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. ఏదో చిన్న దేశానికి అధ్యక్షడు అయితే ఇదేమీ పెద్ద విషయం కాదు. ఆయన మరెవరో కాదు. అగ్రదేశానికి అధ్యక్షుడు జో బైడెన్‌. అమెరికాలో బైడెన్‌ వయస్సుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే డెమెక్రాట్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ ఏడాది నవంబర్‌ 20తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 80 ఏళ్లు నిండుతాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడు బైడెనే. గల్ప్‌ దేశాల పర్యటనకు సిద్ధమవుతున్న బైడెన్‌ 2024లో మళ్లీ పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఆయన వయస్సు ఇప్పుడు ప్రత్యర్థులకు, విమర్శకులకు ఆయుధంగా మారింది. బైడెన్‌ మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. తాజాగా 2024లో 64 శాతం మంది డెమొక్రాటిక్‌ ఓటర్లు బైడెన్‌ వద్దని కోరుతున్నట్టు అమెరికాకు చెందిన మీడియా దిగ్గజం న్యూయార్క్‌ టైమ్స్‌ చేపట్టిన సర్వే వివరాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బైడెన్‌ను తిరస్కరించడానికి వయస్సే ప్రధానకారణంగా తెలిపినట్టు వివరించింది. ప్రస్తుతానికి బైడెన్‌ అధ్యక్షుడిగా తగినవాడేనని కానీ వచ్చే ఎన్నికల నాటికి వయస్సు మరింత పెరుగుతోందన్న కథనాలు అమెరికా మీడియాలో వెల్లువెత్తున్నాయి. ఇది డెమెక్రాట్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి బైడెన్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడం డెమెక్రాట్లను కలవరపరుస్తోంది.

బైడెన్‌ ప్రస్తుత అధ్యక్ష పదవీకాలం ముగిసేనాటికి 82 ఏళ్లకు చేరుకోనున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే బైడన్‌ పదవీ కాలం పూర్తయ్యే సమయానికి 86 ఏళ్లకు చేరుకుంటారు. రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై.. పదవీకాలం పూర్తయ్యేనాటికి 77 ఏళ్లకు చేరుకున్న వృద్ధ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌. ఆయనతో పోల్చి చూస్తే.. 10 ఏళ్ల మేర ఎక్కువ. ఉక్రెయిన్‌ యుద్ధం, పరుగులు పెడుతున్న ద్రవ్యోల్బణం, అమెరికాను కుదిపేస్తున్న గన్‌ కల్చర్‌, అబార్షన్‌ హక్కులతో పాటు సుప్రీంకోర్టు తీరు బైడెన్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అంతేకాదు ఆయనకు కీళ్లనొప్పులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ పడిపోతానో? అన్నట్టుగా బైడెన్‌ జాగ్రత్తగా నడుస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా తరచూ బైడెన్‌ తన ఆలోచనలు కోల్పుతున్నారని.. టెలిప్రాంప్టర్‌లో చూసి చదువుతూ కూడా పొరపాట్లు చేస్తున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇటీవల నత్తి కూడా పెరిగిందని చెబుతున్నారు.

అనాలోచితంగా బైడెన్‌ చేస్తున్న వ్యాఖ్యలతో వైట్‌హౌస్‌ ఇబ్బందులు పడుతోంది. పలుమార్లు బైడెన్‌ చైసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. గతంలో అధ్యక్షులకు భిన్నంగా బైడెన్‌ విలేకరులతో సమావేశాలు, ఇటర్వ్యూలు చాలా తక్కువగా ఇస్తున్నారు. గత నెలలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన అధ్యక్షుల్లో అత్యంత వృద్ధుడు బైడెనే కావడం గమనార్హం. బయట వస్తున్న విమర్శలను బైడెన్‌ సహాయకులు మాత్రం తిప్పికొడుతున్నారు. జూన్‌ 18న సైక్లింగ్‌ చేస్తూ... విలేకరులు, కొందరు అభిమానులు నిలబడిన ప్రాంతానికి బైడెన్‌ వచ్చారు. సైకిల్‌ నిలబెట్టే క్రమంలో ఆయన కింద పడ్డారు. అప్పటి నుంచి బైడెన్‌ వృద్ధాప్యంపై ట్రోల్స్‌ మరింత పెరిగాయి. నిజానికి బైడెన్‌ కంటే ముందు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా వృద్ధుడే. 70 ఏళ్ల వయస్సులో అధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రస్తుతం ట్రంప్ వయస్సు 76 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ట్రంప్‌కు 78 ఏళ్లకు చేరుకుంటారు. బైడెన్‌ వయస్సు పెద్ద మ్యాటర్‌ కాదని ఇటీవల ట్రంప్‌ కూడా చెప్పారు. కానీ ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.

ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టినా.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జన్మించిన బైడెన్‌ యువ అమెరికన్లతో కలిసిపోలేరని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాను కుదిపేస్తున్న అబార్షన్‌ హక్కు తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వైట్‌హౌస్‌ ఎదుట భారీగా మహిళలు నిరసన తెలిపారు. దీనిపై బైడెన్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కేవలం నిరసనలు చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండని బైడెన్‌ సూచించడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. దేశ యువతులను కలవరపరుస్తున్న సమస్యపై ఇలానేనా అధ్యక్షుడు స్పందిచేది? అన్న ఆగ్రహం వ్యక్తమైంది. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సున్న డెమెక్రాట్లలో 43 శాతం మంది మాత్రమే బైడెన్‌ పాలన తీరుపై సంతృప్తిగా ఉన్నారు.

అయితే బైడెన్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనేది డెమెక్రాటిక్‌ పార్టీలో తీవ్రంగా చర్చజరుగుతోంది. బైడెన్‌ పోటీ చేయకపోతే సహజంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కమలా హారిస్‌ గెలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories