Top
logo

మనసు కదిలించే కథనాలు: జీవించే అవకాశం ఉండీ యువత కోసం త్యాగం చేస్తున్న పెద్దలు!

మనసు కదిలించే కథనాలు: జీవించే అవకాశం ఉండీ యువత కోసం త్యాగం చేస్తున్న పెద్దలు!
X
Highlights

సాధారణంగా ఎంత వయసు వచ్చినా.. శరీరం ఒంగిపోయినా.. జీవితం మీద మమకారం మానవుడికి పోనేపోడు. ఎక్కడో ఒక చోట ఎవరికో...

సాధారణంగా ఎంత వయసు వచ్చినా.. శరీరం ఒంగిపోయినా.. జీవితం మీద మమకారం మానవుడికి పోనేపోడు. ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి తప్ప. అటువంటి వారు మహనీయులుగా మిగిలిపోతారు. ఇప్పుడు కరోనా వైరస్ అటువంటి మానవీయుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

కరోనా వైరస్ ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్యలో కూడా వృద్ధులే ఎక్కువ. ఇక ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంటే అభివృద్ధి చెందిన దేశాలే నిశ్చేష్టులై నిలబడి పోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటలీ లాంటి దేశాల్లో ప్రజలకు వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో వారు 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వైద్యం పూర్తిగా ఆపేసి వారిని మరణానికి వదిలేస్తున్నారు. అయితే, ఒక్కోచోట కొంతమంది వృద్ధులు స్వచ్చందంగా తమకు వైద్యం అక్కర్లేదని నిరాకరిస్తున్నారట. నిజానికి మరణం వస్తుందని తెలిసి.. దానికోసం చిరునవ్వుతో ఎదురు చూడటం ఏ వయసులోనైనా కష్టతర విషయమే. కానీ, ఈ వృద్ధులు మాత్రం తమకు వయసు అయిపోయిందనీ, తమకు బదులుగా వైద్యాన్ని యువకులకు అందిస్తే వారిలోనే తాము జీవిస్తామని చెప్పి ఆత్మత్యాగం చేసుకున్నారు.

ఇటలీకి చెందిన 72 సంవత్సరాల చర్చి ఫాదర్ కథ వింటే అయ్యో అనిపించినా.. అయన త్యాగానికి నమస్కరించాలనిపిస్తుది. అయన లోవేరే ప్రాంతంలో ఓ చర్చిలో ఫాదర్. తన మోటార్ సైకిల్ పై తిరుగుతూ పెద్ద వయసులోనూ చలాకీగా అందర్నీ పకరిస్తూ.. వారి సమస్యలను తీర్చేందుకు సహాయం చేసేవారు. ఆయనకు పాపం కరోనా సోకింది. ఇక ఇటలీ ఉన్న పరిస్థితుల్లో వైద్యం చాలా కష్టతరమైన పనే. కానీ, చర్చి ఫాదర్ కావడంతో ఆయనకు చర్చి పరిధిలో ఉన్న వారు వెంటిలేటర్, మందులు, ఇతర పరికరాలు కొనుక్కుని వచ్చి వైద్యం చేయించాలని ప్రయత్నం చేశారు. అయితే, ఆయన మాత్రం..'' నాకు వయసు అయిపొయింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవించి ఉండాల్సింది నేను కాదు. ఎవరైనా యువకుడు లేదా యువతికి వీటిని ఉపయోగించి వారిని కరోనా బారి నుంచి విముక్తుల్ని చేయండి. బతకాల్సింది వాళ్ళే.'' అని చెప్పి తిరస్కరించి మరణాన్ని నవ్వుతూ ఆహ్వానించారు.

ఇక ఇలాంటిదే మరో ఉదాహరణ.. బెల్జియం కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు. ఈమెకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమె ససేమిరా.. అన్నారు. కరోనా వ్యాధి గురించి.. దానితో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఆమెకు స్పష్టంగా తెల్సు. వెంటిలేటర్ అందాకా ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో కూడా ఆమెకు అవగాహన ఉంది. అందుకే ఆమె వెంటిలేటర్ ను తిరస్కరించారు. '' నాకు వయసు అయిపొయింది. నేను బతకడం వలన ఉపయోగం ఏమీ లేదు. వయస్సులో ఉన్న వారెవరికైనా దీనిని ఉపయోగించండి. వారు జీవిస్తే నేను జీవించి ఉన్నట్టే'' అంటూ ఎటువంటి పరిస్థితిలోనూ వెంటిలేటర్ పెట్టడానికి అంగీకరించలేదు. అలాగే ఆమెను కరోనా కబళించింది.

వీరు కొన్ని ఉదాహరణలు మాత్రమె. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే యూరోప్ ఖండం అంతా ఇలా ఎందరో తమ జీవితాల్ని నవ్వుతూ విదిచిపెట్టేస్తున్నారు. ఒక పూట అన్నం.. పది రూపాయలు.. ఇలా ఏదో ఒకటి దానం చేయడం లేదా తమకున్న వాటిని వదులుకోవడం పెద్ద విశేషం కాదు. బతకడానికి అవకాశం ఉండీ.. తమకు వయసు ఎక్కువైపోయిందన్న కారణంతో మరింత కాలం జీవించగలిగే కాలాన్ని యువత కోసం త్యాగం చేస్తున్న ఇటువంటి వారిని అభినందించడానికి పదాలు చాలవు కదూ!

ఇటువంటి కథనాలు వినయాన.. మన ప్రజలు ప్రభుత్వానికి సహకరించి లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండాలని ఆశిద్దాం.

Web Titlethe old age people sacrificing their lives to youth and welcoming death due to coronavirus with a smile
Next Story