ప్రపంచాన్ని భయపెడుతున్న ఆర్థిక మాంద్యం.. 69 దేశాల్లో సంక్షోభం..

The Global Financial Crisis | Telugu News
x

ప్రపంచాన్ని భయపెడుతున్న ఆర్థిక మాంద్యం

Highlights

World Economy: 107 దేశాల్లో విషమిస్తున్న ఆర్థిక పరిస్థితులు

World Economy: ప్రపంచమంతా ఫ్యాషన్ ట్రెండ్, బ్రేక్ డాన్స్, టేప్ రికార్డులతో హోరెత్తింది. కానీ ఒక్క లాటిన్ అమెరికా దేశాలు మాత్రం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అతలాకుతలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో పాటు అప్పులు, నిరుద్యోగం, వృద్ధి మందగమనం, అధిక ద్రవ్యోల్బణంతో తల్లడిల్లామయి. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. శ్రీలంక అందుకు మొదటి అడుగని చెబుతున్నారు. లంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. విదేశీ నిధుల కొరతతో ఆహార, ఇంధన కొరతతో విలవిలలాడుతోంది. ఇప్పుడు మరో 69 దేశాలు లంక బాటలోనే పయనిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 15 ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడానికి సరిగ్గా 9రోజుల ముందు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. అభివృద్ధి చెందుతున్న 69 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు తెలిపింది. 11 వందల కోట్ల డాలర్లు అప్పు బకాయిపడినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తరువాత 9 రోజులకే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. ప్రపంచ మార్కెట్లు స్తంభించిపోయాయి. భారీగా చమురు, ఆహార కొరత నెలకొంది. ఫలితంగా చిన్న చిన్న దేశాలపై భారీ ప్రభావం పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో 107 దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్టు మార్చిలోనే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక కష్టాలు మొదలవుతాయని వెల్లడించింది. దీంతో 107 దేశాలకు చెందిన 170 కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభాలో ఐదో వంతు ప్రజలకు కష్టాలకు గురి కానున్నట్టు ఐక్యరాజ్యసమితి స్పష్టంగా తెలిపింది.

107 దేశాల్లో 69 దేశాలను మాత్రం ఆహారం, ఇంధన ధరలు, ఆర్థిక కష్టాలు వణికిస్తాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ జాబితాలో 25 ఆఫ్రికా దేశాలు, 25 ఆసియా పసిఫిక్ దేశాలతో పాటు 19 లాటిన్ అమెరికా దేశాలు ఉన్నట్టు నివేదించింది. ప్రస్తుతం ఆర్థికంగా కుప్పకూలనున్న దేశాల్లో ఈజిప్టు ముందువరుసలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఈజిప్టే.. ఈ దేశానికి గోధుమలను ఎగుమతి చేసేది ఉక్రెయిన్, రష్యా దేశాలే. ఈ రెండు దేశాల సంక్షోభంతో గోధుమల సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న గోధుమల నిల్వలు మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని గతనెలలో అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ నిల్వలు అయిపోతే ప్రజలు ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహార కొరతతోపాటు నిరుద్యోగం, మందగించిన ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతోంది. ఈజిప్టు తరువాత టునీషియాను కష్టాలు వెంటాడనున్నాయి. ఈ దేశంలోనూ ద్రవ్యోల్బణం 7శాతం పెరిగింది. 80 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య లోటు నెలకొన్నది. ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో టునీషియా ప్రజలు... లంకేయుల్లాగా ఆందోళన బాటపట్టే అవకాశం ఉంది.

టునీషియా మార్గంలో లెబనాన్ పయనిస్తోంది. బేరూడ్‌లో 2020లో జరిగి పేలుడుతో లెబాన్ ధాన్యపు నిల్వలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో నిత్యావసర ధరలు 11 రెట్లు పెరిగాయి. లెబనాన్ పౌండ్ విలువ 90 శాతం పడిపోయింది. పూర్తిగా ఉక్రెయిన్ గోధుమలపై ఆధారపడిన ఈ దేశం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆహార భద్రత కోసం ఇప్పటివకే 15 కోట్ల డాలర్లను ప్రపంచ బ్యాంకు నుంచి లెబానాన్ రుణంగా తీసుకుంది. అర్జెంటీనా కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటివకే తొమ్మిది సార్లు అప్పులను కట్టలేక చేతులెత్తేసింది. పదోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ను అర్జెంటీనా ఆశ్రయించింది. 4కోట్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేయమని విన్నవించింది. పూర్తి అప్పుల్లో కూరుకుపోయిన అర్జెంటీనాలాగే... ఎల్ సాల్వడోర్, పెరు దేశాలు కూడా విలవిలలాడుతున్నాయి. ఈ దేశాల్లోనూ పెరిగిన ద్రవ్యోల్బణం, ఆహార కొరత, నిరుద్యోగం, మండుతున్న ధరలతో శ్రీలంక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆఫ్రికా దేశాలైన ఘనా, ఇథోఫియా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లోనూ పరిస్థితులు విషమిస్తున్నాయి. టర్కీ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. ద్రవోల్బణం 70శాతం పెరిగింది. 50 వేల టన్నుల గోధుమలను ఇటీవల భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆయా దేశాల్లో పరిస్థితులు విషమంగా మారుతున్నాయి. వచ్చే 12 నెలల్లో డజనుకు పైగా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తనున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఈ తరంలోనే అతి పెద్ద సంక్షోభంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంక తరువాత పాకిస్థాన్, మయన్మార్, నేపాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొనడానికి ప్రధానంగా స్థానిక పరిస్థితులు, కరోనా సంక్షోభం, తాజాగా తలెత్తిన ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాలే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయా దేశాల ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా పడనున్నది. ఇప్పటికే బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌ రాష్ట్రాలు లోటు బడ్జెట్‌తో కష్టాల్లో కూరుకుపోయాయి. సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్దం ఇప్పట్లో ఆగేలా లేదనే సంకేతలు కలరవపెడుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పలు దేశాలు ప్రమాదంలో పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories