
Sunita Williams: సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమి మీదకు రానున్నారు. ఎనిమిది రోజుల అంతరిక్షయాత్ర 9 నెలలకు చేరింది.
Sunita Williams: సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమి మీదకు రానున్నారు. ఎనిమిది రోజుల అంతరిక్షయాత్ర 9 నెలలకు చేరింది. 2025 మార్చి 12 స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష వ్యోమనౌకలో సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు? ఆమెకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఇంతకాలం అంతరిక్షంలో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అంతరిక్షంలో సునీతా విలియమ్స్ రికార్డ్స్ ఏంటో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
సునీతా విలియమ్స్ కు ట్రంప్ పంపిన సందేశం
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను అంతరిక్షం నుంచి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన వారికి సందేశం పంపారు. సునీతా బృందాన్ని భూమి మీదకు తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించినట్టు ఆయన తెలిపారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకుందని ట్రంప్ విమర్శించారు.9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉన్నందున ఇక్కడి వాతావరణాన్ని భూమి మీదకు వస్తే కోల్పోతానని సునీతా విలియమ్స్ చెప్పారు. మార్చి 6న ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఆమె మీడియాతో మాట్లాడారు. అంతరిక్షంలో గడిపిన సమయమంత ఆనందమేనని ఆమె అన్నారు.
సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారు?
సునీతా విలియమ్స్, విల్ మోర్ అంతరిక్షం నుంచి తీసుకురావడానికి 2024 సెప్టెంబర్ 29న స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగించారు. ఇందులో హాక్, గోర్బునోవ్ అనే ఇద్దరు వ్యోమగాములను నాసా పంపింది. 2025 ఫిబ్రవరిలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్ తో కలిసి ఈ ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రావాలి. కానీ, టెక్నికల్ సమస్యలతో ఇది వాయిదాపడింది. సునీతా విలియమ్స్, విల్‌మోర్ లను తీసుకురావాలని నాసా టార్గెట్‌గా పెట్టుకుంది. నాసా ప్రోటోకాల్ ప్రకారం క్రూ 10 వచ్చేవరకు క్రూ 9 అంతరిక్ష కేంద్రంలోనే ఉండాలి. క్రూ 10 కి తొలుత కేటాయించిన డ్రాగన్ క్యాప్సూల్ ను మార్చుకోవడం ద్వారా నిర్ణీత షెడ్యూల్ కంటే వారం ముందే భూమి వీదకు తీసుకురానున్నారు. మార్చి 19న వీరిద్దరూ తిరిగి వస్తారు.
అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు?
అంతరిక్ష టూరిజంలో భాగంగా బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో 2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఎనిమిది రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండి తిరిగి భూమి మీదకు ఈ ఇద్దరు రావాలి. కానీ, బోయింగ్ స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఇది సరిచేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు.
వ్యోమనౌకలోని 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో కొన్ని పాడయ్యాయి. వ్యోమనౌక సజావుగా పని చేయాలంటే 14 థ్రస్టర్లు సక్రమగా పనిచేయాలి. ప్రొపల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది. దీన్ని రిపేర్ చేసి అందులోనే రావాలని భావించారు. కానీ, టెక్నికల్ సమస్యలు పూర్తి చేయలేకపోయారు. దీంతో సునీతా విలియమ్స్, విల్ మోర్ లేకుండానే స్టార్ లైనర్ వ్యోమనౌక 2024 సెప్టెంబర్ 7 ఉదయం భూమిపైకి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలోని చెత్తను ఇందులో పంపారు.
సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ లో రికార్డు
సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ లో రికార్డు సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలు స్పేస్ లో నడిచారు. అత్యధిక టైమ్ స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ పేరుతో కొత్త రికార్డు నమోదైంది. గతంలో నాసాకు చెందిన మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న 60 గంటల 21 నిమిషాల స్పేస్ వాక్ రికార్డును ఆమె బద్దలు కొట్టారు. సునీతా విలియమ్స్ కు ఇది 9వ స్పేస్ వాక్, విల్ మోర్ కు ఇది ఐదోది. సునీతా విలియమ్స్ అంతరిక్షానికి మూడు సార్లు వెళ్లారు. 1998లో ఆమె నాసాకు ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో ఆమె శిక్షణ పూర్తైంది. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర ఆమె దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చారు. 2012 లో రెండోసారి కూడా అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది. మూడోసారి బోయింగ్ వ్యోమనౌకతో అంతరిక్షానికి చేరుకున్నారు. ఈసారి ప్రాబ్లమ్ రావడంతో ఆమె అక్కడే ఆగిపోయారు.
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉంటే ప్రమాదమా?
అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్ పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేని కారణంగా రక్తపోటు నియంత్రణపై ప్రభావం ఉంటుంది. కాల్షియం పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కళ్ల నరాల వాపు, కంటి ఆకారంలో మార్పు , కన్ను పొర ముడతలు పడటం వంటి లక్షణాలను వ్యోమగాముల్లో చూడవచ్చు. మరోవైపు స్పేస్ ఫ్లైట్-అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ కు గురౌతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తొమ్మిది నెలల పాటు కుటుంబసభ్యులకు దూరంగా ఉన్న సునీతా విలియమ్స్, విల్ మోర్ మార్చి రెండో వారంలో భూమిమీదకు రానున్నారు. వీరి రాక కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎలా భూమి మీద నుంచి అంతరిక్షానికి చేరుకున్నారో అలానే భూమి మీదకు రావాలని కోరుకుందాం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




