Sri Lanka: అజ్ఞాతంలో ఉన్నా.. గొటబాయ ఆదేశాలు

Sri Lanka President Gotabaya Rajapaksa Confirms Resignation
x

Sri Lanka: అజ్ఞాతంలో ఉన్నా.. గొటబాయ ఆదేశాలు

Highlights

*గొటబాయ అధికారికంగా రాజీనామా చేసేవరకు అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేసేది లేదన్న నిరసనకారులు

Sri Lanka: కల్లోల శ్రీలంక... తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధ్యక్ష, ప్రధాని నివాసాలను వేలాది మంది ఆందోళనకారులు ముట్టడించడంతో గొటబాయ రాజపక్స, రణిల్‌ విక్రమసింఘే రాజీనామాకు అంగీకరించారు. అయితే గొటబాయ, విక్రమసింఘే అధికారికంగా రాజీనామా చేసేవరకు అధ్యక్ష, ప్రధాని నివాసాలను వదిలి వెళ్లేది లేదని నిరసనకారులు తేల్చి చెబుతున్నారు. నిన్నటి నుంచి నిరసనకారులు అధ్యక్ష భవనంలోనే గడుపుతున్నారు. అక్కడి లగ్జరీ వసతులను చూసి.. ఆశ్చర్యపోతున్నారు. పలువురు అక్కడి కొలనులో ఈత కొడుతున్నారు. భనవంలోని పరుపులు, సోపాలపై నిద్రపోతున్నారు. ఎలాంటి ధ్వంసం జరగకుండా పోలీసులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. పరిస్థితిని చక్కదిద్దని అధ్యక్షుడు, ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. 9న దేశ నలుమూలల నుంచి వాణిజ్య రాజధాని కొలంబోకు నిరసనకారులు చేరుకున్నారు. భారీ ర్యాలీగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి గాల్లో కాల్పులు జరిపినా.. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆందోళనకారులు వస్తున్న విషయం ముందే తెలుసుకున్న అధ్య‌క్షుడు గొటబాయ పరారయ్యారు. రాణిల్‌ విక్రమసింఘే రాజీనామా చేయాలంటూ ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని విక్రమసింఘే ప్రకటించారు. గొటబాయ కూడా 13న రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోవాలంటూ.. నిరసనకారులను సైన్యాధిపతి సివేంద్ర సిల్వ కోరారు. అయితే తాము అధ్యక్షుడి మాటలను నమ్మలేమని.. అధికారికంగా రాజీనామా చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు.

అజ్ఞాతంలో ఉన్న అధ్యక్షుడు గొటబాయ ఎక్కడున్నారనేది ఎవరూ చెప్పడం లేదు. పార్లమెంట్‌ స్పీకర్ మహింద యాప అభయ్‌వర్ధనేతో మాత్రమే అధ్యక్షుడు టచ్‌లో ఉన్నారు. అజ్ఞతాంలో ఊంటూ కూడా గొటబాయ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలకు వంటగ్యాస్‌ సరఫరా చేయాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. శ్రీలంక పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 మంది ఎంపీలు అవసరం. ఇప్పటికీ అధ్యక్షుడు గొటబాయకు చెందిన శ్రీలంక పొడుజన పెరమున-ఎస్‌ఎల్‌పీపీ పార్టీనే పార్లమెంట్‌లో బలంగా ఉంది. కానీ.. విపక్షాలు అన్నీ కలిస్తే మాత్రం మేజిక్‌ ఫిగర్‌ 113 సాధ్యమే. ఇక ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు స్పీకర్‌ అభయ్‌వర్ధనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంకలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భారత్‌ సైన్యాన్ని పంపనున్నట్టు వస్తున్న వార్తలను మోదీ ప్రభుత్వం కొట్టిపడేసింది. తాము ఎలాంటి సైన్యాన్ని పంపడం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. లంకలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత్‌ తెలిపింది. శ్రీలంక ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపింది. ఆ మేరకు 40వేల టన్నుల యూరియాను కూడా తాజాగా పంపుతున్నట్టు తెలిపింది. లంకలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలతో పాటు చమురు, గ్యాస్‌ను భారత్‌ సరఫరా చేస్తూనే ఉంది. తాజాగా దీర్ఘకాలంపాటు ప్రభుత్వం లేకపోతే అరాచకం ప్రభలే ప్రమాదం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు సహాయం అందిస్తామని భారత్‌ స్పష్టం చేసింది. క్రెడిట్‌ లైన్‌ ద్వారా శ్రీలంకకు ఇప్పటికే భారత్‌ 350 కోట్ల డాలర్ల సాయం భారత్‌ అందించినట్టు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ తెలిపారు.

నాలుగు నెలలుగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. చేతిలో డబ్బున్నా.. తినడానికి తిండి లేని పరిస్థితి నెలకొన్నది. కరెంటు కోతలతో లంక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. చమురు, గ్యాస్‌ కొరతతో విలవిలలాడుతున్నారు. చమురు లేకపోవడంతో ఇప్పటికే స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. దేశంలో దుర్బర పరిస్థితులు నెలకొనడానికి రాజపక్స కుటుంబమే కారణమంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మహింద రాజపక్స ఇంటిని ముట్టడించడంతో మే 9న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా రెండు నెలల తరువాత.. జూలై 9న.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని వేలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో గొటబాయ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

లంకకు రాజపక్సల పీడ విరగడ అయినా.. పరిస్థితులు మాత్రం కల్లోలంగానే ఉన్నాయి. లంక కోలుకునేందుకు దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లంకేయులు కోలుకునేందుకు భారత్‌ సహకరిస్తామని ప్రకటించింది. అమెరికా కూడా సహాయం అందిస్తామన్నది. అయితే శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి రష్యానే కారణమంటూ అమెరికా నిందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories