Afghanistan: కాబుల్‌లో‌ స్కూళ్లలో బాంబు దాడులు

School Bombings in Kabul | Telugu News
x

Afghanistan: కాబుల్‌లో‌ స్కూళ్లలో బాంబు దాడులు

Highlights

Afghanistan: హాజార వర్గం ముస్లింలు ఉండే ప్రాంతాలపై సున్నీ ఇస్లామిస్ట్‌ గ్రూపుల దాడులు

Afghanistan: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని రెండు హైస్కూల్‌లో జరిగిన బాంబు దాడిలో 20 మంది మృతి చెందగా డజన్ల మందికి తీవ్ర గాయాలయ్యాయి. షియా హజారా వర్గానికి చెందిన ముస్లింలు అధికంగా ఉండే పశ్చిమ కాబుల్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అబ్దుల్‌ రహిమ్‌ సాహిద్‌ హైస్కూల్‌లో, ముంతాజ్‌ హైస్కూల్‌లో మూడు బాంబు దాడులు జరిగాయని కాబుల్‌ కమాండర్‌ ఖలిద్‌ జర్దాన్‌ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ముహమ్మద్‌ అలీ జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడులకు ఎవరు కారణమనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ స్పందించలేదు. అయితే షియా తెగకు చెందిన ముస్లింలు ఉండే ప్రాంతాలపై తరచూ సున్నీ ఇస్లామిస్ట్‌ గ్రూపులు దాడులు తెగబడుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

2021 ఆగస్టు 15న ఆఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దేశానికి తాము పూర్తి భద్రత కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఉగ్రముప్పు అఫ్ఘాన్‌కు పొంచి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు, నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తరచూ ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఉగ్రదాడులు షియా హజారా వర్గానికి చెందిన ప్రజలు ఉన్న ప్రాంతంలోనే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. 3 కోట్ల 80 లక్షల జనాభా ఉన్న అఫ్ఘాన్‌లో 20 శాతం మేర సియా హజారా వర్గం ముస్లింలు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ వర్గం ఆఫ్ఘాన్‌లో మైనార్టీలుగా బతుకుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories