Russia: యుద్ధం కంటే.. జైలుకు వెళ్లడమే మేలంటున్న యూత్‌

Russian youth prefer prison to war | Telugu News
x

Russia: యుద్ధం కంటే.. జైలుకు వెళ్లడమే మేలంటున్న యూత్‌

Highlights

Russia: రష్యాలో తీవ్రమవుతున్న యువత ఆందోళన

Russia: ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్లాల్సిందే.. వెళ్లి పోరాడండి. చావైనా చావండి.. కానీ శత్రువుకు లొంగిపోవద్దు. లొంగితే పదేళ్ల జైలు శిక్ష తప్పదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరిస్తున్నారు. 3 లక్షల మంది సైనికులను యుద్ధానికి పంపుతామన్న పుతిన్‌ ప్రకటన ఇప్పుడు రష్యాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రష్యన్‌ యువతకు నిర్బంధ సైనిక శిక్షణ ఇస్తూ ఉక్రెయిన్‌ యుద్ధానికి సన్నద్దం చేస్తున్నారు. దీంతో యుద్ధానికి వెళ్లేందుకు రష్యన్‌ యువత నిరాకరిస్తోంది. ఉక్రెయిన్‌కు వెళ్లి చచ్చే కంటే మాస్కో జైళ్లలోనే మగ్గడం మేలని భావిస్తోంది. సైన్యంలో చేరేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. తాజాగా ఓ యువకుడు సైనిక శిక్షణ కార్యాలయంపై కాల్పులకు తెగబడ్డాడు. రష్యన్‌ సైనికాధికారిని పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చాడు.

యుద్ధంలో రష్యా సైన్యం భారీగా మృతి చెందినట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది. ఉక్రెయిన్‌ లెక్కల ప్రకారం 50 వేల నుంచి 80 వేల మంది క్రెమ్లిన్‌ సైన్యం చనిపోయారు. దీనిపై అమెరికా, బ్రిటన్‌ లెక్కలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే మాస్కో మాత్రం చనిపోయిన సైనికుల వివరాలను అస్సలు ప్రకటించలేదు. కానీ రష్యా సైన్యం భారీగానే చనిపోయినట్టు తెలుస్తోంది. 3 లక్షల మంది సైనికులను సమీకరిస్తామన్న పుతిన్‌ ప్రకటనతో రష్యన్‌ యువతలో భయాందోళన మొదలైంది. పలువురు దేశం విడిచి వెళ్లిపోయేందుకు యత్నించారు. దీంతో యువతకు ఎయిర్‌టికెట్లను విక్రయించకుండా మాస్కో బ్యాన్ చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి వెళ్తే మాత్రం చావు తప్పదన్న భావన.. రష్యన్‌ యువతకు స్పష్టంగా అర్థమైనట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి యువత విముకత వ్యక్తం చేస్తోంది. నిర్బంధ సైనిక నియామకం, శిక్షణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సైనిక నియామకాలు, ఉక్రెయిన్‌ యుద్ధానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటివరకు రష్యా వ్యాప్తంగా యుద్ధాన్ని వ్యతిరేకించేవారిని 2వేల మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

యువత సైన్యంలోకి వెళ్లాల్సిందేనని.. వెళ్లి ఉక్రెయిన్‌తో పోరాడాల్సిందేనని మాస్కో కఠిన ఆదేశాలను జారీ చేసింది. యుద్దం చేయడానికి నిరాకరించినా.. ఉక్రెయిన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయినా.. 10 ఏళ్ల జైలు శిక్ష తప్పందంటూ రష్యా ప్రభుత్వం హెచ్చరించింది. అంటే.. ఉక్రెయిన్‌కు వెళ్లి చావనైనా చావండి.. కానీ.. లొంగిపోకూడదంటూ మాస్కో చెబుతోంది. ఇదే రష్యన్‌ యువతను భయాందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు వెళ్తే చావు తదప్పదని.. అక్కడికి వెళ్లి చనిపోయే బదులు.. ఇక్కడే నేరం చేసి.. జైలుకు వెళ్లడమే మేలని రష్యా యువత భావిస్తోంది. తాజాగా ఓ రష్యన్‌ యువకుడు సైనిక శిక్షణ కార్యాలయంలో కాల్పులకు తెగబడ్డాడు. అంతేకాదు.. నిర్బంధ సైనిక శిక్షణకు వచ్చినవారిని పారిపోమంటూ పిలుపునిస్తూ.. కాల్పులకు జరిపాడు. ఈ ఘటనలో ఓ సైనిక కమాండర్‌ గాయపడ్డాడు. సైనికాధికారిని పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడంతో.. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో జరిగింది. సదరు యువకుడు రుస్లాన్‌ జినిన్‌గా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కోసం సైనిక సమీకరణలో తనను ఎంపిచ చేసినందుకు కాల్పులకు తెగబడినట్టు వెల్లడించారు. యుద్ధంలో చనిపోయేకంటే.. జైల్లో ఉండడమే మంచిదని ఇలా చేసినట్టు చెప్పాడు. అంటే కావాలనే తను నేరం చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు వెల్లడించాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. నిర్బంధ సైనిక నియామకాలపై ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను యుద్ధానికి పంపేది లేదంటూ మొండికేస్తున్నారు. నియామకాల కోసం వచ్చే అధికారులను నిలదీస్తున్నారు. పుతిన్‌ కోసం తమ పిల్లలను చంపుకునేందుకు తాము సిద్ధంగా లేమంటున్నారు. యుద్ధానికి తమ కుమారులను పంపలేమని తెగేసి చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో సైనికాధికారులను నిలదీస్తున్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులే ఇతర దేశాలకు పంపుతున్నారు. యుద్దంలో ప్రాణాలను పోగొట్టుకునే కంటే... తమ పిల్లలు ఎక్కడో ఓ చోట బాగుంటారని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇక వీసాలు, పాస్‌పార్టుల జారీని నిలిపేయడంతో... రోడ్డు మార్గంలో ఇతర దేశాలకు భారీగా వెళ్లిపోతున్నారు. మాస్కోతో పాటు ఇతర నగరాల్లో యువత రోడ్డు మార్గంలో వెళ్తుండడంతో రహదారులు ట్రాఫిక్‌తో స్తంభించాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. యుద్ధంలో పోరాడేందుకు వచ్చిన వారికి సైనికాధికారులు షాక్‌ ఇస్తున్నారు. అవసరమైన దుప్పట్లు, దుస్తులను యువకులే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. తాము ఏమీ ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నారు. శిక్షణ శిబిరాల వద్ద ఏమాత్రం వసతులు కల్పించకపోవడంతో.. నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితి తెలెత్తింది.

తాజా రష్యా ఆదేశాల నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. రష్యా తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధానికి నిరాకరించినా.. లొంగిపోయినా.. 10 ఏళ్ల జైలు శిక్ష విధించడమేమిటని ప్రశ్నించారు. మీ అధ్యక్షుడు మిమ్మల్ని చావడానికి పంపుతున్నారంటూ రష్యన్లను ఉద్దేశించి.. రష్యన్‌ భాషలో జెలెన్‌స్కీ మాట్లాడారు. లొంగిపోయిన పుతిన్ సేనలను.. సాధారణ పౌరుల్లాగే చూసుకుంటామని చెప్పారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో లొంగిపోయారో ఎవరికీ తెలియనీయబోమని జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. అంటే.. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోకండి.. వచ్చి లొంగిపోడంటూ జెలెన్‌స్కీ పరోక్షంగా పిలుపునిచ్చారు. రష్యన్‌ సైనికులు పారిపోయి ప్రాణాలను దక్కించుకోవాలని పలుమార్లు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఏడు నెలల ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఇటీవల ఎదురుదెబ్బలు తింటోంది. ఇటీవల మాస్కో సేనలపై ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడికి దిగి.. 8వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు కీవ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో యుద్దాన్ని మరింత ముమ్మరం చేసేందుకు 3 లక్షల మందిని పంపుతున్నట్టు పుతిన్‌ ప్రకటించారు. అందుకు దేశంలో ఉన్న యువతను సైన్యంలో చేరాలంటూ పుతిన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో యువత తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అగ్రరాజ్యం అమెరికా రహస్య నిఘా ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం ఇచ్చింది. అమెరికా నిఘా ఏజెన్సీ కాంట్రాక్టర్‌గా ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ పని చేశారు. అయితే అమెరికా రహస్యంగా చేపట్టిన పలు ఆపరేషన్ల వివరాలను 2013లో స్నోడెన్‌ బయటి ప్రపంచానికి వెల్లడించి సంచలనం సృష్టించాడు. దీంతో అప్పట్లో అమెరికా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో స్నోడెన్‌పై గూఢచర్య ఆరోపణలను అమెరికా మోపింది. క్రిమినల్‌ నేర విచారణను ఎదుర్కొనేందుకు స్వదేశానికి రప్పించేందుకు అమెరికా ప్రత్నించింది. 2013 నుంచి 39 ఏళ్ల ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ రష్యాలో తలదాచుకుంటున్నాడు. తాజాగా, స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైలుపై సంతకం చేశారు. ఇకపై స్నోడెన్ కు రష్యా పౌరులకు లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయి. దాంతో అతడిని స్వదేశానికి రప్పించడం అమెరికాకు కష్టమే.

మరోవైపు ఉక్రెయిన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను రష్యాలో కలుపుకొనేందుకు వరుసగా రెండోరోజు నిర్వహించిన ఓటింగ్‌లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని జెలెన్‌స్కీ విమర్శించారు. లుహాన్‌స్క్‌, డొనెట్‌స్క్‌, జపోరిజ్జియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే దిశగా క్రెమ్లిన్‌ వేగంగా అడుగులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories