అమెరికాతో ఉంటారా? లేక రష్యాతోనే కొనసాగుతారా?... ప్రధాని మోడీ తీరుపైనే సర్వత్రా చర్చ

PM Narendra Modi in Uzbekistan for SCO Summit
x

అమెరికాతో ఉంటారా? లేక రష్యాతోనే కొనసాగుతారా?... ప్రధాని మోడీ తీరుపైనే సర్వత్రా చర్చ

Highlights

అమెరికాను వ్యతిరేకించే ఇద్దరు నేతలతో... ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొంటున్న ప్రధాని మోడీ

Narendra Modi: ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్-ఎస్‌సీవో.. ప్రపంచమంతా ఇప్పుడు అటువైపే ఆసక్తిగా చూస్తోంది. అటు అమెరికాతో, ఇటు రష్యా విషయంలో భారత ప్రధాని మోడీ ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అమెరికాను వ్యతిరేకించే ఇద్దరు అగ్రశ్రేణి నేతలతో మోడీ సమావేశమవుతున్నారు. ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్న రష్యాతో బంధానికే జైకొడతారా? లేక చైనాను అతిగా నమ్ముతున్న మాస్కోకు టాటా చెబుతారా? అంటూ పలు దేశాలు ఆసక్తిగా ఎస్‌సీవో సమ్మిట్‌ను గమనిస్తున్నాయి. రష్యా, అమెరికా సంబంధాలు ప్రధాని మోడీకి కత్తి మీద సాములా మారాయి. కర్ర విరగకుండా పాము చావకుండా ప్రధాని మోడీ దౌత్యాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో నిర్వహిస్తున్న షాంఘై సహకార సంస్థ-ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కూటమిలో 8 పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చైనా, రష్యా, భారత్‌తో పాటు కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌ కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పాల్గొననున్నారు. ఇదే ఇప్పుడు అన్ని దేశాలు ఇటువైపు చూడడానికి కారణం ఈ ముగ్గురి అగ్రశ్నేణి నేతల్లో పుతిన్‌, జిన్‌పింగ్‌ అమెరికాపై కత్తులు దూస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా కూటమిని కూడగట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకు ఇరాన్‌ను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్‌సీవో కూటమిలో ఇరాన్‌ను సభ్య దేశంగా చేర్చుకుని అమెరికాను నిలువరించాలని స్కెచ్‌ గీస్తున్నారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా, తైవాన్‌ విషయంలో చైనా అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు చెందిన నేతలను కలవడం, పుతిన్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడం.. చర్చలకు తావిస్తోంది.

ఏడు నెలల ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్ కింగ్‌ మేకర్‌గా అవతరించింది. రష్యా నుంచి భారత్‌ ఆయుధాలు, చమురును కొనుగోలు చేయడకుండా.. అమెరికా దాని మిత్రదేశాలు ఢిల్లీపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. రష్యాతో సన్నిహిత సంబంధాలను తెంచుకుని.. ఉక్రెయిన్‌కు మద్దతు పలకాలని డిమాండ్‌ చేశాయి. జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్‌ సదస్సులోనే తాము కలిసే ఉందామని.. మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోడీ మాత్రం.. దేశ జాతీయ ప్రయోజనాలే కీలకమని తేల్చి చెప్పారు. అటు అమెరికా, ఇటు రష్యాతో సమ దూరాన్ని పాటిస్తున్నారు. అయితే భారత సరిహద్దులో రెచ్చిపోతున్న డ్రాగన్‌ ఎదుర్కోవాలంటే.. కలసికట్టుగా పోరాడుదామంటూ అమెరికా పిలుపునిస్తోంది. తాజాగా రష్యా చమురు, గ్యాస్‌ ధరలను పరిమితం చేసేందుకు అమెరికా, మిత్ర దేశాలు సన్నద్ధం అవుతున్నాయి. దీనికి కూడా సహకరించాలని భారత్‌ను అమెరికా కోరుతోంది. పుతిన్‌ ఆదాయాన్ని తగ్గిస్తేనే ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అమెరికా చెబుతోంది. అంటే ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపే శక్తి భారత్‌కు ఉందని తేల్చి చెబుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్‌కు రష్యా అత్యంత చౌకగా చమురును విక్రయిస్తోంది. ప్రస్తుతం 93 డాలర్లు పలుకుతున్న బ్రైంట్‌ రకం చమురును 30 డాలర్లను మాస్కో తగ్గించి భారత్‌కు సరఫరా చేస్తోంది. దీంతో భారత్‌లో చమురు ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. మే నుంచి ఇప్పటివరకు చమురు దిగుమతులు ఐదు రెట్లు పెరిగాయి. ఇప్పటివరకు 5వేల కోట్ల డాలర్ల చమురును భారత్‌ కొనుగోలు చేసింది. ఒకవేళ అమెరికా చెప్పినట్టు చమురు ధరపై పరిమితిని విధిస్తే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే చమురు ధర పరిమితిని భారత్‌ తోసిపుచ్చింది. అంతేకాకుండా రక్షణ రంగానికి సంబంధించి రష్యాతో వేల కోట్ల డాలర్ల ఒప్పందాలను భారత్‌ చేసుకుంది. వాటన్నింటిని ఉన్నట్టుండి కట్‌ చేసుకోవడం కూడా అసాధ్యం. అంటే పరోక్షంగా రష్యాతో సంబంధాలను తెంచుకునేందుకు భారత్‌ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. కానీ భారత్‌ అత్యంత కీలకంగా మారినందున పదే పదే తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రష్యా నుంచి కొనుగోలు చేయాలనుకున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400 దిగుమతులపై నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది.

భారత్ కంటే డ్రాగన్‌ కంట్రీకే రష్యా అధిక ప్రాధాన్యమిస్తోందని ఇది భారత్‌కు ముప్పే అని అమెరికా చెబుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాతే ఈ ధోరణి అధికమైందని వివరిస్తోంది. అలాంటపుడు రష్యాతో స్నేహం చేయడమేమిటని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ కూడా కొంత పునరాలోచనల్లో పడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో భారత్‌ కలుస్తోంది. అమెరికా చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు రష్యాతో స్నేహాన్ని భారత్‌ తెంచుకోలేదు. అలా అని అమెరికాను పూర్తిగా నమ్మలేని పరిస్థితి. అమెరికాను వ్యతిరేకించే డ్రాగన్‌ కంట్రీ మిత్రదేశం పాకిస్థాన్‌కు బైడెన్‌ ప్రభుత్వం ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లను అప్‌గ్రేడ్‌ చేయడానికి 45కోట్ల డాలర్ల ప్యాకేజీని వైట్‌హౌస్‌ ఆమోదించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్‌ చేస్తే ఉగ్రవాదంపై కాకుండా పాకిస్థాన్‌ తమవైపే గురి పెడుతుందని భారత్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అమెరికాపైనే పూర్తిగా ఆధారపడేందుకు భారత్‌ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో అటు రష్యాతో, ఇటు అమెరికాతో సమదూరాన్ని పాటించేందుకే భారత్ మొగ్గుచూపుతోంది.

మరోవైపు చైనాతో అంటకాగుతున్న రష్యాతో బంధాన్ని కొనసాగించడం కూడా కొరివితో తల దువ్వుకోవడమేనని ప్రధాని మోడీకి కూడా బాగా తెలుసు. ఈ విషయం పశ్చిమ దేశాలకు కూడా తెలుసు. కానీ ఎవరి ప్రయత్నాలు వారివి స్వప్రయోజనాలే ముఖ్యమని ఆయా దేశాల అధినేతలు భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం కూడా అదే విషయమే చెబుతోంది. అందుకే ఉక్రెయిన్‌ విషయంలో తటస్థంగా ఉన్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. అయితే కానీ తైవాన్‌పై చైనా దాడి చేస్తే మాత్రం తటస్థ వైఖరిని మోడీ అవలంభించే అవకాశాలు లేవు. ఎందుకంటే తైవాన్‌పై దాడి తరువాత చైనా నెక్ట్స్‌ టార్గెట్‌ భారతే అవుతుంది. అక్కడే అడ్డుకట్ట వేయకపోతే డ్రాగన్‌ సరిహద్దులో యుద్ధానికి దిగినా దిగొచ్చు. ఇక ఇక్కడ తైవాన్‌కు మద్దతు ఇవ్వడం అంటే అమెరికాతో బంధం బలపడినట్టు కాదు కేవలం స్వప్రయోజనాలకు, రక్షణకు ఇబ్బంది రాకుండానే మోడీ ఇలా మధ్యేయమార్గాన్ని ఎంచుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఢిల్లీ మాత్రం స్పందించడం లేదు.

ఉక్రెయిన్ యుద్ధం తరువాత భారత్‌ అత్యంత కీలకంగా మారింది. ఎగుమతుల్లోనూ, గ్లోబల్‌ మార్కెట్‌లోనూ న్యూఢిల్లీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌ను ఎవరికి వారు తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్‌ మాత్రం ఇప్పటికీ తటస్థ వైఖరినే అవలంభిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories