పంజ్‌షేర్‌ కోటకు బీటలు! తాలిబన్లకు లొంగిపోయే యోచనలో అహ్మద్‌ మసూద్‌?

Panjshir Province Leader Ahmad Massoud Planning to Surrender to The Taliban | Afghanistan Latest News
x

పంజ్‌షేర్‌ కోటకు బీటలు! తాలిబన్లకు లొంగిపోయే యోచనలో అహ్మద్‌ మసూద్‌?

Highlights

Panjshir Province: పోరాటానికి తగిన వనరులు లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక, తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్‌..

Panjshir Province: ఇన్నాళ్లూ శత్రు దుర్భేద్యంగా ఉన్న పంజ్‌షేర్‌ కోటకు బీటలు వారుతున్నాయా? ఆ ప్రాంత అధినేత అహ్మద్‌ మసూద్‌ ముందు ప్రస్తుతం రాజీ తప్ప మరో మార్గం లేదా? అఫ్గానిస్థాన్‌ యావత్తూ తాలిబన్ల వశం కానుందా? ఈ ప్రశ్నలన్నింటికీ 'అవును' అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక.. తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పంజ్‌షేర్‌ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. 1980ల్లో సోవియట్‌ సేనలుగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దాన్ని ఆక్రమించుకోలేకపోయారు. పంజ్‌షేర్‌ సింహంగా పేరున్న అహ్మద్‌ షా మసూద్‌ నాటి పోరాటాల్లో ఈ ప్రావిన్సు బలగాలను ముందుండి నడిపించారు. ఆయన కుమారుడే అహ్మద్‌ మసూద్‌. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఇటీవల మళ్లీ విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్‌ మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు. ఒక్క పంజ్‌షేర్‌ను తప్ప! పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్‌ మసూద్‌ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ (తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు) సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్‌షేర్‌కే వచ్చేశారు. తాలిబన్లపై సాయుధ పోరుకు వారు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

అంతర్జాతీయ సమాజం మొండిచేయి...

అమ్రుల్లా సలేహ్‌ సహా పలువురు నేతలతో ఇటీవల పలు దఫాలు చర్చలు జరిపిన 32 ఏళ్ల మసూద్‌.. తండ్రి బాటలోనే తానూ నడుస్తానని ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. తమ బలగాల సంఖ్య 6 వేలకు పైగానే ఉందని తెలిపారు. మళ్లీ పోరుబాట పట్టే సమయం వస్తుందని గ్రహించి.. తన తండ్రి హయాం నుంచే తాము ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకుంటున్నామని చెప్పారు. అయితే తాలిబన్లపై పోరుకు అవి సరిపోవని పేర్కొన్నారు. అంతర్జాతీయ మద్దతు అవసరమన్నారు. సహాయం చేయాల్సిందిగా ఫ్రాన్స్, ఐరోపా, అమెరికా, అరబ్‌ దేశాలను కోరారు. కానీ వాటి నుంచి స్పందన కరవైంది.

నాటి పరిస్థితులు వేరు...

తన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకుండానే లొంగిపోయి, తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా మసూద్‌ యోచిస్తున్నారని ఆయన సలహాదారుడొకరు తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో తెలిపారు. ''తాలిబన్లతో పంజ్‌షేర్‌ పోరాడలేదు. మాతో పోలిస్తే తాలిబన్ల బలం చాలా ఎక్కువ. 1980లు, 1990ల నాటి పరిస్థితులు వేరు. యుద్ధాల్లో ఆరితేరిన ఫైటర్లు ఇప్పుడు తాలిబన్‌కు ఉన్నారు'' అని పేర్కొన్నారు. మరోవైపు- తాలిబన్లు ఇప్పటికే పంజ్‌షేర్‌ను చుట్టుముట్టారు. ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో రాజీ కుదుర్చుకునేందుకు మసూద్‌ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories