ఫిలిప్పైన్లను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిగడ్డ.. కిలో ఆనియన్స్‌ ధర 2వేల రూపాయల పైమాటే..!

Decorating Wedding Venue With Onions In The Philippines
x

Philippines: ఫిలిప్పైన్స్‌లో పెళ్లి వేదికను ఉల్లిగడ్డలతో అలంకరణ 

Highlights

Philippines: ఫిలిప్పైన్స్‌లో పెళ్లి వేదికను ఉల్లిగడ్డలతో అలంకరణ

Philippines: పెళ్లంటే ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆకట్టుకునే డెకరేషన్లు అందమైన పువ్వులతో పెళ్లి వేదికను ముస్తాబు చేస్తారు. నూతన వధూవరులకు ఆకర్షణీయమైన పూలతో చేసిన బొకేలను అందించి శుభాకాంక్షలు చెబుతారు. కానీ ఫిలిప్పైన్స్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెళ్లి వేదికను ఉల్లిగడ్డలతో అలంకరిస్తున్నారు. నూతన వధూవరులకు ఫ్లవర్‌ బొకేలకు బదులుగా ఆనియన్‌ బొకేలను అందిస్తున్నారు. ఒక్కో ఐదు కేజీల ఉల్లి బొకే కోసం ఫిలిప్పైన్స్‌ కరెన్సీలో 8వేలను వెచ్చించారట. అంటే ఇది అల్మోస్ట్ 147 అమెరికన్‌ డాలర్లు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 12వేల రూపాయల పైమాటే అంటే కిలో ధర 2వేల 427 రూపాయలు పలుకుతోంది. అంత డబ్బు పెట్టి ఉల్లిగడ్డలను కొని ఉల్లి బొకే ఇచ్చారంటే అవేవో ప్రత్యేకమైనవి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఇప్పుడు ఫిలిప్పైన్స్‌లో ఉల్లి ధర ఆకాశాన్నంటుతోంది ఆ దేశంలో ఉల్లి బంగారంలా మారింది. అసలు ఉల్లి వైపు చూడడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. ఫిలిప్పైన్స్‌లో పెరిగిన నిత్యావసరాల ధరలు ప్రజలను వణికిస్తున్నాయి. ఆహార సంక్షోభం నెలకొనడంతో ఆకలికేకలతో అల్లాడుతున్నారు.

ఆహార ధరలు అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నట్టు ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి ఫెరినాండ్‌ మార్కస్‌ జూనియర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశంలో నిత్యావసరాలైన చక్కెర, ఉప్పు, ఉల్లిగడ్డల ధరలు కొన్నాళ్లుగా విపరీతంగా పెరుగుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో కిలో 90 రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలకు చేరుకుంది. అది కూడా చిన్న ఉల్లిగడ్డలైతేనే వెయ్యి రూపాయలు అదే మంచివైతే కిలో 2వేలకు పైనే పలుకుతోంది. కిలో మాంసం ధర కంటే కిలో ఉల్లినే అధిక ధర పలుకుతోంది. ఈ సమస్య బర్గర్ కింగ్‌ వంటి పెద్ద కంపెనీలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చక్కెర కొరత కారణంగా కోకోకాలా కంపెనీ తమ ఉత్పత్తులను నిలిపేసింది. ఫిలిప్పైన్స్‌లో ప్రతి పది మందిలో ఒకరికి ఆహారం అందడం లేదని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో పెరిగిన నిత్యావసర ధరలను అత్యయిక పరిస్థితి నెలకొన్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

అసలు ఫిలిప్పైన్స్‌లో ఆహార సంక్షోభానికి కారణమేమిటి? అంటే ఆ దేశాన్ని భారీ తుఫానులు చుట్టుముడుతున్నాయి. మరోవైపు , చీడపురుగుల కారణంగా స్థానికంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఎరువుల, పిచికారి మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటికి ఆజ్యం పోసేలా చమురు దరలు రెట్టింపయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఎఫెక్ట్‌ ఒక్క శ్రీలంక, పాకిస్థాన్‌పైనే కాదు ఫిలిప్పైన్‌పైనా పడింది. మొదట్లో ఈ పరిస్థితిన కృత్రిమ కొరతగా ప్రభుత్వం పేర్కొన్నది. కావాలనే కొందరు వ్యాపారులు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను మార్కెట్లోకి రాకుండా నిలిపేశారని ప్రభుత్వం ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories