North Korea: ఓవైపు కరోనా.. మరోవైపు అణు పరీక్షలు

Nuclear Weapons Test in North Korea | Telugu Online News
x

North Korea: ఓవైపు కరోనా.. మరోవైపు అణు పరీక్షలు

Highlights

North Korea: మూడో టన్నెల్‌ను సిద్ధం చేస్తున్న ఉత్తర కొరియా

North Korea: ప్రజలకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. అయినా ఆ దేశంలో అభివృద్ధి మాట వినిపించదు. నిత్యం వేలాది మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నా ఆ దేశ అధ్యక్షుడికి అస్సలు పట్టదు. అమెరికాను భయపెట్టాలన్నదే లక్ష్యం. అందుకు నిత్యం క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. తాజాగా 26వేల మంది అస్వస్థతకు గురయినట్టు కొరియన్‌ మీడియా తెలిపింది. అది కరోనా అని ప్రపంచతంతా గొంతు చించుకుంటుంటే కిమ్‌ మాత్రం జ్వరం అని తాపీగా చెబుతున్నారు. ప్రజలు విలవిలలాడుతున్నా పట్టించుకోకుండా కిమ్‌ అణుపరీక్షలకు సిద్ధమవుతున్నారు.

రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించిన చందంగా మారింది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీరు. మహమ్మారి బారిన పడి.. విలవిలలాడుతున్న వేలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తగిన కిట్లు లేవు.. కానీ అణు పరీక్షలను నిర్వహించేందుకు మాత్రం కోట్లాది రూపాయలను తగలబెడుతున్నారు. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఉత్తర కొరియాలో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కచ్చితమైన సంఖ్యను మాత్రం కిమ్‌ ప్రభుత్వం చెప్పడం లేదు. అయితే పశ్చిమ పోర్టు నగరం హేజుకు కిమ్‌ భారీగా మందులను పంపినట్టు మాత్రం కొరియన్‌ మీడియా వివరించింది. అయితే కరోనాతో ఆ దేశ ప్రజలు విలవిలలాడుతున్నారు. కిమ్‌ మాత్రం కరోనా కాదని కేవలం సాధారణ ఫ్లూగానే వర్ణిస్తున్నారు. నార్త్‌ కొరియాలో 24 గంటల్లో 26వేల మంది అస్వస్థతకు గురయినట్టు తెలిసింది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 45 లక్షల 60 వేల మంది అస్వస్థతకు గురయ్యారు. కేవలం 73 మంది మాత్రమే చనిపోయారు.

ప్యాంగ్యాంగ్‌ నిత్యం జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను వెల్లడిస్తోంది. బాధితులు కరోనా బారిన పడినట్టు మాత్రం చెప్పడం లేదు. మే మొదటి వారంలో కరోనా కేసు నిర్ధారించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే నాటి నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వారంతా కేవలం జ్వరం బారిన పడినట్టే కిమ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఉత్తర కొరియా వద్ద అసలు కరోనా టెస్ట్‌ చేసేందుకు కిట్లే లేవు. కరోనా కిట్లు, అవసరమైన మందులను ఇస్తామని దక్షిణ కొరియా, చైనా ముందుకొచ్చాయి. అయినా కిమ్‌ మాత్రం పట్టించుకోలేదు. అందుకుముందు కరోనా వ్యాక్సిన్లు ఇస్తామని ఐక్యరాజ్య సమితి చెప్పినా.. చెవికెక్కించుకోలేదు. ఇప్పుడు ఆ దేశంలో కరోనా బారిన పడి వేలాది మంది విలవిలలాడుతున్నారు. పైగా వారికి సరైన తిండి లేదు. వారిలో కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తి కూడా లేదు. టీకాలు తీసుకోని వారు కరోనా సోకినా ప్రాణాలను దక్కించుకోవడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నా.. కిమ్‌ మాత్రం బయటపెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా పరిస్థితి ఇలా ఉంటే కిమ్‌ తాజాగా అణు పరీక్షలకు సిన్నద్ధమవుతున్నట్టు అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియా అణు పరీక్షలను నిర్వహించే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. అందుకు న్యూక్లియర్‌ మూడో టన్నెల్‌ను సిద్దం చేస్తున్నట్టు అమెరికా తెలిపింది. తొలిసారి నాలుగో టన్నెల్‌ వద్ద నిర్మాణాలు చేపడుతున్నట్టు వివరించింది. మూడో టన్నెల్‌ వద్ద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల చిత్రాలు బయటకు వచ్చినట్టు అగ్ర రాజ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తర కొరియా అణు పరీక్షల కోసం నాలుగు భూగర్భ సొరంగాలను నిర్మించింది. రెండు సొరంగాల నుంచి 2006 నుంచి 2017 వరకు ఆరు భూగర్భ అణు పరీక్షలను కిమ్‌ ప్రభుత్వం నిర్వహించింది. మిగిలిన రెండింటిని మాత్రం ఇప్పటివరకు వినియోగించలేదు. 2018లో అమెరికాతో కుదరిన అణు నిరాయుధీకరణ ఒప్పందం ప్రకారం అణు పరీక్షలను నిలిపేస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అదే సమయంలో ఉపయోగించని రెండు సొరంగాల ద్వారాలను ధ్వంసం చేసింది.

అయితే అణు నిరాయుధీకరణ చర్చలపై అమెరికా, ఉత్తర కొరియా పరస్పర చర్యలు తీసుకోలేదు. దీంతో తాత్కాలిక అణు పరీక్షల నిషేధానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కిమ్‌ చెప్పారు. దీంతో ఈ ఏడాది అణ్వస్త్ర పరీక్షలకు పదును పెట్టారు. ఖండాంతర క్షిపణులను పరీక్షిస్తున్నారు. ఉత్తర కొరియాను పేదరికం పట్టి పీడిస్తున్నా కిమ్ పట్టించుకోవడం లేదు. ఆధునిక ఆవిష్కరణలతో దక్షిణ కొరియా దూసుకెళ్తోంది. ఉత్తర కొరియా మాత్రం పేదరికంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. దక్షిణ కొరియన్లు టచ్‌ స్క్రీన్లతో దూసుకుపోతుంటే ఉత్తర కొరియన్లకు స్మార్ట్‌ ఫోన్‌ అంటే కూడా తెలియదు. ఉత్తర కొరియన్లలో కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటోంది. దానిపైనా అనేక కఠిన నియమాలు ఉంటాయి. ప్రజలు సరైన కూడు, గూడు లేకపోయినా.. కిమ్‌ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోపక్క అణుపరీక్షలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

ప్రపంచమంతా మారుతున్నా కిమ్‌ మాత్రం మారడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రష్యా, చైనా అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. అమెరికాపై అణుబాంబులను వేసి సర్వ నాశనం చేస్తామని కిమ్‌ నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. ఉత్తర కొరియాపై పలు దేశాలు కఠిన ఆంక్షలను విధించినా కిమ్‌ మాత్రం లెక్క చేయడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories