బ్యాంకు ఖాతాలో రూ.90 లక్షలు.. ఎక్కడ... ఎలా జరిగింది?

బ్యాంకు ఖాతాలో రూ.90 లక్షలు.. ఎక్కడ... ఎలా జరిగింది?
x
Highlights

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన దంపతుల ఖాతాలోకి అనుకోకుండా 1.20 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. అవి ఎలా వచ్చాయో వారికి తెలీదు. కానీ వెంటనే అందులో...

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన దంపతుల ఖాతాలోకి అనుకోకుండా 1.20 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. అవి ఎలా వచ్చాయో వారికి తెలీదు. కానీ వెంటనే అందులో లక్ష డాలర్లు ఖర్చు పెట్టేశారు. వాళ్లు డబ్బులు దొంగిలించారని బ్యాంకు కేసు పెట్టింది. రాబర్ట్, టిఫనీ విలియమ్స్ దంపతుల బీబీ అండ్ టీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 31వ తేదీ వీరి ఖాతాలోకి బ్యాంకు పొరపాటున 1,20,000 డాలర్లు డిపాజిట్ చేసింది. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు.

నిజానికి ఆ డబ్బులను ఒక పెట్టుబడి సంస్థకు బదిలీ చేయాల్సి ఉండగా పొరపాటున వీరి ఖాతాలో జమ చేశారని పోలీసులు చెప్పారు. అయితే తమ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయో విలియమ్స్ దంపతులకు తెలీదు. కానీ ఖాతాలో డబ్బులు చూడగానే ఖర్చు చేయటం మొదలుపెట్టారు. ఆ డబ్బులతో ఒక ఎస్‌యూవీతో పాటు ఇతర వస్తువులూ కొనుగోలు చేశారని పోలీసులు చెప్తున్నారు.ఆ డబ్బుతో ఒక చెవర్లే ట్రావెర్స్ ఎస్‌యూవీతో పాటు రెండు కార్లు, ఒక క్యాంపర్, ఒక రేస్ కారు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేశారని ఫిర్యాదులో వివరించారు. అంతేకాదు.. స్నేహితులకు 15,000 డాలర్లు సాయం కూడా చేశారని చెప్పారు.

దర్యాప్తు అధికారులు జూలైలో ఈ దంపతులతో మాట్లాడినపుడు.. తమ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు తమవి కావని తమకు తెలుసునని రాబర్ట్ (36), టిఫనీ (35) అంగీకరించారంటున్నారు పోలీసులు. ఈ డబ్బులు రాకముందు వీరి ఖాతాలో సగటున 1,000 డాలర్లు బ్యాలెన్స్ ఉండేది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. ''క్లయింటు గోప్యతా ప్రమాణాల దృష్ట్యా ఈ అంశం వివరాల గురించి మేం వ్యాఖ్యానించలేం. మా క్లయింట్ల మీద ప్రభావం చూపే ప్రతి అంశాన్నీ సత్వరం పరిష్కరించటానికి ప్రయత్నిస్తాం'' అని బీబీ అండ్ టీ బ్యాంక్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు పంపిన ఒక ప్రకటనలో చెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories