బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా 'ఇన్ఫోసిస్‌' మూర్తి అల్లుడు

బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్‌ మూర్తి అల్లుడు
x
Highlights

'ఇన్ఫోసిస్‌' నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్‌ ఎంపీ రిషి సునక్‌(39) కు భారీ ప్రమోషన్‌ లభించింది. బ్రిటన్‌ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రిషి...

'ఇన్ఫోసిస్‌' నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్‌ ఎంపీ రిషి సునక్‌(39) కు భారీ ప్రమోషన్‌ లభించింది. బ్రిటన్‌ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రిషి సునాక్‌ను గురువారం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. ప్రధాని జాన్సన్‌ చీఫ్‌ స్పెషల్‌ అడ్వైజర్‌ డొమినిక్‌ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావిద్‌ రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. పదోన్నతి పొందిన వెంటనే ట్రెజరీ కార్యాలయం వెలుపల, సునాక్ విలేకరులతో మాట్లాడుతూ.. ఛాన్సలర్‌గా నియమించబడటం చాలా ఆనందంగా ఉంది.. నా బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాను అని చెప్పారు.

కాగా రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్‌. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్‌ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. ఇక సునాక్ ఆర్థిక మంత్రిగా దేశ రెండవ అతి ముఖ్యమైన ప్రభుత్వ పదవికి బాధ్యతలు స్వీకరించడంతో ప్రధాని కార్యాలయానికి పక్కనే ఉన్న 11వ డౌనింగ్ స్ట్రీట్‌ లోకి ఆయన మారనున్నారు. వచ్చే నెలలో యుకె బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నందున ఆయన పెద్దఎత్తున గ్రౌండ్ వర్క్ చెయ్యాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే ఆయన తోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్‌ శర్మ(52) వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం రాష్ట్ర కార్యదర్శి పదవికి పదోన్నతి పొందారు. ప్రస్తుతం శర్మ రీడింగ్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపిగా కొనసాగుతోన్నారు. గతంలో ఆయనఅంతర్జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా ఉన్నారు, ఈ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. గోవాకు చెందిన మరో భారత సంతతికి చెందిన ఎంపీ సుయెల్లా బ్రావర్‌మన్ (39) కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదోన్నతి పొందారు. ఆమెను అటార్నీ జనరల్‌గా నియమించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని 'దేశి కేబినెట్‌ ఇన్‌ యూకే హిస్టరీ'గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories