Iran News Supreme: ఇరాన్ కొత్త సుప్రీంగా అయతుల్లా ఖమేనీ కొడుకు మోజ్తబా!

Iran News Supreme: ఇరాన్ కొత్త సుప్రీంగా అయతుల్లా ఖమేనీ కొడుకు మోజ్తబా ఎంపికయ్యారు. మోజ్తబా నేపధ్యం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

KVD Varma
Updated on: 4 March 2026 10:00 AM IST
Iran News Supreme: ఇరాన్ కొత్త సుప్రీంగా అయతుల్లా ఖమేనీ కొడుకు మోజ్తబా ఎంపికయ్యారు.
X

Iran News Supreme

Iran News Supreme: అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అలీ ఖమేనీ ఇజ్రాయెల్ -అమెరికా నిర్వహించిన వైమానిక దాడిలో మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యారని ఇరాన్ ప్రతిపక్షంతో సంబంధం ఉన్న ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. వ్యతిరేకత ఉన్నప్పటికీ IRGC ఒత్తిడితో నిపుణుల అసెంబ్లీ ఈ ఎంపిక చేసిందని పేర్కొంది.

ఫిబ్రవరి 28న, టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడి అలీ ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆ దాడిలో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత ఇరాన్ 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఏడు రోజుల ప్రభుత్వ సెలవు దినాలు కూడా ప్రకటించారు.దేశవ్యాప్తంగా భద్రతను పెంచారు, ప్రధాన నగరాల్లో, ప్రభుత్వ భవనాల వెలుపల అదనపు భద్రతా దళాలను మోహరించారు.

మోజ్తబా ఖమేనీ ఎవరు?

Iran News Supreme: మోజ్తబా ఖమేనీ 1969లో మషాద్ నగరంలో జన్మించారు. మతపరమైన విద్యను పూర్తిచేశారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన రివల్యూషనరీ గార్డ్‌లో కూడా పనిచేశారు. ఆయన తన తండ్రి నిర్ణయాల వెనుక చాలా కాలం ఉన్నారని అంతేకాకుండా, ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారని చెబుతారు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వ పదవులు చేపట్టకపోయినా, ఆయన తన తండ్రికి నమ్మకమైన సలహాదారు. ఆయనకు సైనిక, పారామిలిటరీ దళాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఇరాన్ షియా పరిపాలనలో సుప్రీం లీడర్ అత్యంత శక్తివంతమైన స్థానం. ఈ పదవిలో ఉన్న వ్యక్తి సాయుధ దళాలకు కమాండర్-ఇన్-చీఫ్. దేశంలో ప్రధాన రాజకీయ, సైనిక మరియు వ్యూహాత్మక నిర్ణయాలపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారు.

ఇరాన్ ప్రస్తుతం సైనిక, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. మోజ్తాబాను సుప్రీం లీడర్‌గా పదోన్నతి కల్పించడం వల్ల ఆ దేశం ప్రస్తుత విధానాలలో పెద్ద మార్పులు జరిగే అవకాశం లేదని అర్ధం అవుతోంది. అయితే, ఈ నాయకత్వ మార్పు ఇరాన్ రాజకీయాలు, ప్రాంతీయ గతిశీలతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే.

2009లో జరిగిన నిరసనల సమయంలో మోజ్తబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపించింది. నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఇప్పుడు, ఆయన సుప్రీం లీడర్‌గా నియామకం దేశంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. 1979 విప్లవం సమయంలో, వంశపారంపర్యత ఆధారంగా అధికార బదిలీకి వ్యతిరేకత ఉంది. అందువల్ల, ఇరాన్ లో ఖమేనీ వ్యతిరేకులు ఆయన ఎంపికను ప్రశ్నిస్తున్నారు.

మోజ్తాబా ఖమేనీకి సైనిక మద్దతు ఉండటం వల్ల ప్రస్తుతం ఆయన బలమైన నాయకుడిగా భావిస్తున్నారు. యుద్ధ సంక్షోభ సమయంలో ఇరాన్ సుప్రీంగా నియమితులైన ఆయన రాబోయే రోజుల్లో దేశాన్ని ఏ దిశలో తీసుకువెళ్తారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తరువాతే..

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని మష్హాద్‌లో ఖననం చేస్తారు. తేదీ ఖరారు కానప్పటికీ, ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ ఫార్స్, ఖమేనీని ఇమామ్ రెజా (సల్లల్లాహు అలైహి వ సల్లం) మందిరం సమీపంలో ఖననం చేస్తారని రిపోర్ట్ చేసింది. ఖమేనీ 1939లో మష్హాద్‌లో జన్మించారు. ఇరాన్ తరువాతి సుప్రీం లీడర్ ని నిర్ణయించేసినప్పటికీ . . అధికారిక ప్రకటన రాలేదు. ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాతే ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

KVD Varma

KVD Varma

Next Story