America: అమెరికా అంతరిక్ష చరిత్రలో అద్భుతం

Miracle in American space history
x

స్వాతి మోహన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

America: పర్సెవరెన్స్‌ ప్రయోగం విజయవంతం * ఘనత వెనక భారతీయ సంతతికి చెందిన మహిళ

America: నుదుటన బొట్టుతో ఇప్పుడు ఆమె ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. విశ్వశోధనలో దూసుకుపోతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నావకు ఆమె చుక్కానిలా మారింది. ఆమె పేరే స్వాతి మోహన్‌. పేరుకు పుట్టింది భారత్‌లోనేనైనా స్వాతి పెరిగింది మొత్తం అమెరికాలోనే. భారత ఖ్యాతిని అగ్రరాజ్యంలో చాటిన స్వాతి లైఫ్‌ స్టోరీ ఇప్పుడు చూద్దాం.

అగ్రరాజ్యం అమెరికా అంతరిక్ష చరిత్రలో అద్భుతం జరిగింది. అంగారక గ్రహం ఉపరితలంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయోగించిన పర్సెవరెన్స్‌ ప్రయోగం విజయవంతమైంది. అయితే ఈ ఘనత వెనక భారతీయ సంతతికి చెందిన స్వాతి మోహన్‌ ఉందన్న విషయం యావత్‌ భారతీయులను గర్వపడేలా చేసింది. గత కొన్నేళ్లుగా నాసా చేపట్టిన పలు అంతరిక్ష మిషన్‌లలో స్వాతి మోహన్‌ భాగస్వామిగా ఉన్నారు. అత్యంత క్లిష్టమైన రోవర్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ నావిగేట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

బెంగళూరులో జన్మించిన స్వాతి ఏడాది వయసులోనే తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో అడుగుపెట్టింది. నార్తర్న్‌ వర్జీనియాలో విద్యాభ్యాసం చేసింది. స్వాతికి చదువుకునే సమయంలో చిన్న పిల్లల డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కానీ చిన్న వయసులో తాను చూసిన 'స్టార్‌ ట్రెక్‌' అనే సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిసోడ్‌లు తన ఆలోచనను మార్చేశాయి. విశ్వంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని, విశ్వ రహస్యాలను బయటపెట్టాలనే కోరిక పుట్టింది. దాంతో అప్పటివరకు డాక్టర్‌ కావాలనుకున్న స్వాతి సైంటిస్ట్‌ కావాలని నిశ్చయించుకుంది.

శాస్త్రవేత్త కావాలన్న ఆశతో తన ప్రయత్నాలు మొదలు పెట్టింది స్వాతి. కార్నెల్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీ ఎమ్‌ఐటీలో ఎరోనాటిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసింది.

ప్రస్తుతం కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. విశ్వ రహస్యాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. అయితే.. స్వాతిలోని ప్రతిభను గుర్తించిన నాసా అధికారులు.. మార్స్‌ పై చేపట్టిన పరిశోధన టీమ్‌కు ఆమెను లీడర్‌ను చేశారు. మార్స్‌ 2020 గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌ వంటివి స్వాతి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

పర్సెవరెన్స్‌ ప్రయోగం విజయం వెనక స్వాతి టీమ్‌ ఎనిమిదేళ్ల కృషి ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇంటి నుంచి పని చేస్తూ క్షణం తీరిక లేకుండా కష్టపడింది. ఇక స్వాతి వ్యక్తిగత విషయాలకొస్తే.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భారత్‌తో పెరిగిన జ్ఞాపకాలు తనలో లేకపోయినా భారతీయ సంస్కృతిని మాత్రం స్వాతి తూచా తప్పుకుండా పాటిస్తుంది. తాజాగా పర్సీవరెన్స్‌ ప్రయోగం జరిగే సమయంలో స్వాతి వేషదారణ దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ప్రయోగం జరుగుతున్నంత సేపు టీమ్‌కు దిశానిర్దేశం చేస్తున్న స్వాతి.. అచ్చమైన భారతదేశ వనితగా కనిపించి, అందరినీ ఆకట్టుకుంది.

మొత్తానికి భారతదేశ ఎల్లలు దాటినా భారతీయ సంస్కృతిని తన నరనరాల్లో నింపుకుంది స్వాతి. ఆమెను చూసి భారతీయ మహిళలు ఎంతో గర్వపడుతున్నారు. తన నుంచి నేర్చుకునేది చాలా ఉందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories