Bill Gates: మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ రాజీనామా..!

Bill Gates: మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ రాజీనామా..!
x
Highlights

మైక్రోసాఫ్ట్ లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం...

మైక్రోసాఫ్ట్ లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ప్రకటించింది. అలాగే బెర్క్‌షైర్ హాత్వే బోర్డులో తన స్థానం నుండి కూడా ఆయన తప్పుకున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ బోర్డులో తనకున్న 35 సంవత్సరాల అనుబంధం నిన్నటితో తెగిపోయింది. నిజానికి బిల్ గేట్స్ తన భార్య మెలిండాతో కలిసి ప్రారంభించిన ఫౌండేషన్ వైపు దృష్టి సారించి, ఒక దశాబ్దం క్రితం సంస్థలో రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనడం మానేశారు. గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా 2014 ప్రారంభం వరకు పనిచేశారు.. ఇప్పుడు పూర్తిగా వైదొలిగారు అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

బిల్ గేట్స్ రాజీనామాపై మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెల్లా స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా బిల్‌తో కలిసి పనిచేయడం, ఆయన ద్వారా చాలా నేర్చుకోవడం జరిగిందని.. ఇదొక గొప్ప గౌరవం అని సత్య నాదెల్లా ఒక ప్రకటనలో తెలిపారు. 'బిల్ మా సంస్థను సమాజం యొక్క అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించే అభిరుచితో స్థాపించారు, మైక్రోసాఫ్ట్ కు ఆయన చేసిన సేవలు మరువలేనివి' అని సత్య నాదెళ్ల చెప్పారు. కాగా గేట్స్ 2000 సంవత్సరం వరకూ మైక్రోసాఫ్ట్ సీఈఓ గా పనిచేశారు.. ఆ తరువాత తన ఛారిటబుల్ ఫౌండేషన్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు.. ఈ క్రమంలో కంపెనీ పగ్గాలను స్టీవ్ బాల్మెర్‌కు అప్పగించారు. ఆ తరువాత సత్య నాదెల్లా 2014 లో మైక్రోసాఫ్ట్ కు మూడవ సీఈఓ అయ్యాడు.

ఇదిలావుంటే బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించారు. గేట్స్ తండ్రి విలియం ఒక న్యాయవాది.. ఆయన తల్లి మేరీ పాఠశాల ఉపాధ్యాయురాలు.. గేట్స్ కు ఇద్దరు సోదరీమణులు. ఆయన ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం మరియు సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవారు. తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. అలా మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించారు. 1985 లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. చిన్నవయసులో ఆయన స్థాపించిన ఈ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓ గా కొనసాగుతోన్న సత్య నాదెళ్లది ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories