Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం మరో అరాచకం.. ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బ

Mass burial sites found in liberated Izyum
x

Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం మరో అరాచకం.. ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బ

Highlights

Ukraine: పౌరులను చిత్రహింసలు పెట్టి.. చంపేశారన్న ఉక్రెయిన్

Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం సాగించిన మరో దారుణ మారణకాండ బయటపడింది. ఇజియం ప్రాంతాన్ని సందర్శించిన ఉక్రెయన్‌ సైనికులకు ఒళ్లు గుగుర్పొడిచే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో అచ్చం బూచా నరమేధం వెలుగుచూసినట్టే ఇజియం శివారు ప్రాంతంలో శవాల దిబ్బను ఉక్రెయిన్‌ అధికారులు గుర్తించారు. ఓకేచోట గొయ్యి తవ్వి.. వందల కొద్దీ మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉక్రెయిన్ అధికారులు నిర్ధారించారు. పౌరులను చిత్రహింసలు పెట్టి చంపేసినట్టు శరీరాలపై గుర్తులు ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. గతంలో బూచా నుంచి రష్యా సైన్యం వెనుదిరిగిన తరువాత ఆ నగరంలో వారి అరాచకం బయటపడింది ఇప్పుడు కూడా ఇజియం ప్రాంతం నుంచి క్రెమ్లిన్‌ సేనలు పారిపోయిన తరువాతే ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. మరో వారం రోజులుంటే యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు పూర్తవుతుంది. తాజాగా రష్యా సైన్య మరో ఆరాచకం ఇజియం ప్రాంతంలో బయటపడింది. ఇజియం శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఉక్రెయిన్ సైన్యానికి వెన్నులో వణుకుపుట్టించే ఘటన బయటపడింది. ఒకే గొయ్యిలో వందల కొద్దీ మృతదేహాలను గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నట్టు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఏకంగా 500 మేర మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వివరించారు. మృతుల్లో చాలా మంది తుపాకీ కాల్పులతోనే చనిపోయారని గుర్తించారు. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని వివరిస్తున్నారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు నిర్ధారించారు. కొన్ని మృతదేహాలపై తీవ్రంగా హింసించిన గుర్తులు ఉన్నాయన్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్‌ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు మరో అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. ఈ సైనికులను పూడ్చివేసిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు కూడా ఉన్నట్లు తెలిపింది.

ఖార్కివ్‌ ప్రాంతంలో రష్యా సైన్యం తిష్ఠ వేసింది. వారి నుంచి ఖార్కివ్‌ను తిరిగి దక్కించుకోవడానికి భారీ దాడికి ఉక్రెయిన్‌ సైన్యం తెగబడింది. ఈ దాడిని తట్టుకోలేక క్రెమ్లిన్‌ బలగాలు పిక్క బలం చూపించాయి. ఇజియం ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి. దీంతో ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ దళాలు ప్రకటించాయి. ఆమేరకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఇజియం ప్రాంతాన్ని సందర్శించారు. 6వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు జెలెన్‌స్కీ కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఇజియం శివారు ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యానికి ఈ శవాల దిబ్బ కనిపించింది. ఈ ఘటనపై జెలెన్‌స్కీ స్పందించారు. అప్పుడు బుచా, మరియూపోల్‌, దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇజియంలో అదే దారుణ నరమేధం బయటపడిందన్నారు. రష్యా సైన్యం ప్రతిచోటా మరణశాసనం రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజియం ఘటనకు రష్యా బాధ్యతవహించాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచమంతా రష్యా దారుణాలపై స్పందించాలి కోరారు. సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న రష్యా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మండిపడ్డారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు సాగించిన ఊచకోత దారుణ మారణకాండను తలపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలోనూ 300 మందికి పైగా పౌరులను అత్యంత కిరాతకంగా రష్యా సైన్యం ఊచకోత కోసింది. అప్పట్లో బోరోడ్యాంకా, ఇతర పట్టణాల్లో సాధారణ పౌరుల మరణాల సంఖ్య లెక్కకు మంచి ఉండొచ్చని ఉక్రెయిన్ వెల్లడించింది. బుచా నగరం నుంచి రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోయిన తరువాతే నరమేధం బయటపడింది. రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు రష్యా సైన్యం అకృత్యాలకు సాక్షంగా నిలిచాయి. ఉక్రెయిన్‌తో పాటు పాశ్చాత్య దేశాల కూటమి రష్యా దమనకాండను ఖండిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడంతో పాటు యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా దర్యాప్తునకు ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని కోరాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా ఈ మారణహోమంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరాలను ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రష్యా దురాగతాలపై స్వతంత్ర దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

బుచా నుంచి రష్యా సైన్యం వెనుదిరిగిన తరువాతే ఆ ఘటన బయటపడింది. తాజాగా ఇజియం ప్రాంతంలోనూ రష్యా సైన్యం పారిపోయిన తరువాతే అక్కడి శవాల దిబ్బ బయటపడింది. దీనిపై అంతర్జాతీయ సమాజం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఇక యుద్ధం ప్రారంభం నుంచి నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌కు చెందిన కీలకమైన మరియూపోల్‌పై రష్యా భీకర దాడులకు దిగింది. మార్చి చివరి నాటికి ఈ నగరంలోని భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిచ్చాయి. శిథిలాల కింద పడి రష్యా దాడుల కారణంగా 10 వేల మంది పౌరులు మరణించి ఉంటారని అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చిలోనే మరియూపో‌ల్‌ ప్రాంతాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత మరిన్ని వ్యూహత్మకంగా అజోవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను దక్కించుకుంది. ఇప్పటికీ ఈ నగరం రష్యా సేనల ఆధీనంలోనే ఉంది. స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న కొందరు ఉక్రెయిన్‌ ఫైటర్లను రష్యా అరెస్టు చేసి యుద్ధ ఖైదీలుగా బంధించింది. మరియూపోల్‌ ఘటనపైనా పశ్చిమ దేశాలు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోని బుచా, మరియూపోల్‌, తాజాగా ఇజియం ప్రాంతాల్లోని పౌరులను రష్యా సేనల ఊచకోత కోసింది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. ప్రారంభంలో రెండ్రోజుల్లో యుద్ధం పూర్తవుతుందని పుతిన్‌ అంచనా వేశారు. బెలారస్‌ మీదుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ దశగా మాస్కో బలగాలు వేలమంది సైన్యం దండెత్తింది. కీవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. ఉక్రెయిన్ గెరిల్లా పోరాటానికి క్రెమ్లిన్‌ సైన్యం విలవిలలాడింది. కీవ్‌ను మాత్రం చేరుకోలేకపోయింది. మూడు నెలల తరువాత గత్యంతరం లేక డాన్‌బాస్‌ వైపు మళ్లాయి. కానీ ఖార్కివ్‌లో మాత్రం రష్యా సైన్యం తిష్టవేసింది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు చెందిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సైన్య, పౌరులు కలిపి మొత్తం 15 వేల మంది మృత్యువాత పడ్డారు. రష్యాకు మాత్రం భారీగా సైనిక, ఆయుధ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌కు చెందిన 60 లక్షలకు పైగా ప్రజలు విదేశాలకు వలసవెళ్లారు. మరో కోటి మందికి పైగా స్వగ్రామాలను వదిలి సురక్షిత ప్రాతాలకు తరలివెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తొలిసారి భారీ మానవ వలసలు సంభవించినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం తెలిపింది.

యుద్ధం తాజాగా కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు రష్యానే పైచేయి సాధించింది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్‌ ఎదురుదాడికి దిగుతోంది. రష్యా సైన్యాన్ని తరిమికొడుతోంది. ఈ క్రమంలోనే ఖార్కివ్‌ ప్రావిన్స్‌లోని ఇజియం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనతో మాస్కో సైన్యం బలహీనపడిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే రష్యా మరిన్ని ఉధృతమైన దాడులకు దిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories