ఉత్తర కొరియాలో కొత్త అణు చట్టాన్ని ఆమోదించిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌

Kim as North Korea declares itself a nuclear weapons state
x

ఉత్తర కొరియాలో కొత్త అణు చట్టాన్నిఆమోదించిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌

Highlights

*అనుమానంతో ఏ దేశంపై అయినా దాడి చేసేలాఅవకాశం ఇవ్వనున్న కొత్త అణు చట్టం

Kim Jong-un: ఉత్తర కొరియా.. ఈ పేరు వింటేనే.. వింత చట్టాలు.. విచిత్రమైన ఆంక్షలతో పాటు అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇట్టే గుర్తొస్తారు. తాజాగా సంచలన ప్రకటనతో కిమ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అణు పరీక్షలను ఆపేది లేదని తేల్చి చెప్పాడు. నార్త్‌ కొరియా అణ్వస్త్ర దేశంగా ప్రకటించారు. అణ్వస్త్ర రహిత దేశాలపై దాడి చేయబోమని గతంలో ప్రకటించిన విధానానికి మంగళం పాడాడు. తమ దేశ భద్రతకు ముప్పు కలుగుతుందని భావిస్తే.. ఏ దేశంపైనైనా... అణు దాడికి దిగుతామని హెచ్చరించాడు. తాజాగా అందుకు ఓ కొత్త చట్టాన్నే తీసుకొచ్చాడు. నిన్న మొన్నటివరకు రష్యాకు సైన్యాన్ని పంపుతామని.. ఆయుధాలు ఇస్తామన్నారు.. కరోనాను అంతమొందించామని ప్రకటించారు.. ఇప్పుడేమో అణ్వస్త్ర ప్రకటనతో అమెరికా, జపాన్‌, ఉత్తర కొరియాకు సవాల్‌ విసిరాడు.

ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మాటే శాసనం.. ఆ దేశంలో వింత చట్టాలు.. విచిత్రమైన శిక్షలు ఎన్నో ఉన్నాయి. ఆ చట్టాలతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ.. కిమ్‌ మాత్రం అవేమీ పట్టించుకోడు. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కొత్త అణు చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇదేమీ వింతైనదో, విచిత్రమైనదో అనుకుంటే పొరబాటే.. అదొక భయంకరమైన చట్టం.. దీని ప్రకారం.. ఉత్తర కొరియాపై దాడి చేస్తుందని ఏదైనా దేశంపై కిమ్‌కు అనుమానం కలిగితే.. ఇక అణుబాంబులను అలా విసిరేయొచ్చు. దీనికి స్వీయ రక్షణ అన్న ట్యాగ్‌ను కూడా ఈ నియంత తగిలించాడు. ఈ భయంకరమైన చట్టం ఎంతో చిరస్మరణీయమైనదట. ఆ విషయం కూడా కిమ్మే చెప్పారు. ఈ చట్టాన్ని ఇక వెనక్కి తీసుకునేదే లేదని ఖరాకండీగా చెప్పేశారు. ఈ చట్టం అణ్వాయుధాలను ఎప్పటికీ తొలగించేది లేదని, అణు నిరాయుధీకరణ దిశగా ఉత్తర కొరియా ఎలాంటి చర్యలు, చర్చలు ఉండవని బల్లా గుద్దేశాడు కిమ్‌. పనిలో పనిగా మళ్లీ అమెరికా, మిత్రదేశాలపై కిమ్‌ సారు నిప్పులు చెరిగారు. భూ మండలంపై అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. అమెరికా, దాని మిత్రదేశాలు.. ఉత్తర కొరియా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నంత కాలం.. అణు ప్రస్థానం ఆపేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఉత్తర కొరియా ఇక నుంచి అణ్వస్త్ర దేశమని సంచలన ప్రకటన చేశారు.

తాజాగా ఇక 2013 చట్టాన్ని మరిన్ని మార్పులు చేసి.. కొత్త అణు చట్టాన్ని తెచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గతంలో కిమ్‌ చేసిన ప్రకటనకు కొత్త అణు చట్టం పూర్తి విరుద్ధంగా ఉంది. ఏ ఇతర దేశమైనా ఉత్తర కొరియాపై దాడి చేస్తేనే.. తాము స్పందిస్తామని.. కిమ్‌ గతంలో తెలిపారు. అణ్వస్త్ర రహిత దేశాలపై మొదట దాడి చేయబోమని అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కిమ్‌ మాట మార్చారు. స్వీయ రక్షణ కోసం... కేవలం అనుమానంతో ఏ దేశంపై అయినా దాడి చేసేందుకు అవకాశం ఇచ్చేలా కొత్త చట్టంలో పొందుపర్చారు. అయితే కిమ్‌ దూకుడు.. కొత్త అణు చట్టం తీసుకురావడానికి వెనుక భారీ కథే ఉందంటున్నారు విశ్లేషకులు.. కిమ్‌ భారీ అణు పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2017 నుంచి ఉత్తర కొరియా అణు ప్రయోగాలను చేపట్టలేదు. ఐదేళ్ల తరువాత ఉత్తర కొరియా అధ్యక్షుడు అణస్త్ర పరీక్షల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కిమ్‌ మళ్లీ అణు పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా కొన్నాళ్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఐదేళ్లలో కేవలం క్షిపణుల ప్రయోగాలతోనే సరిపెట్టారు. ఇప్పుడు రూట్‌ మార్చి.. కొత్త అణు చట్టంతో.. అణ్వస్త్రాలను అమెరికాపై ఎక్కుపెట్టేందుకు కిమ్‌ సిద్ధమవుతున్నారు. 2018లో అణు ప్రయోగాలను వదిలేయాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సహా ప్రపంచ దేశాల నాయకులు కోరినా.. కిమ్‌ మాత్రం ఖాతరు చేయలేదు.

ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత.. భారీ అణు ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 2006, 2009, 2013, 2016, 2017లో అణు పరీక్షలను నిర్వహించింది. ఉత్తర కొరియా వద్ద 100 నుంచి 370 కిలో టన్నుల మేర అణు పేలుడు పదార్థాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. జపాన్‌లోని హిరోషిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే.. ఆరు రెట్లు శక్తివంతమైన అణు బాంబులు కిమ్‌ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అణ్వాయుధాలే కాకుండా.. మిస్సైళ్లను కూడా అమెరికాను దృష్టిలో పెట్టుకునే కిమ్‌ ప్రభుత్వం రూపొందిస్తోంది. నిత్యం ఆ దేశంపై కయ్యానికి కాలుదువ్వే కిమ్‌.. తమపై దాడి చేస్తే.. అమెరికాను సర్వ నాశనం చేస్తామని హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రపంచ దేశాలు అణ్వాయుధాలపై ఆందోళన చెందుతున్నా.. కిమ్‌ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్ర పేదరికంతో మగ్గుతున్నా.. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న కిమ్‌ మాత్రం అణు పరీక్షలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాడు. ఇటీవల ఉత్తర కొరియాలో కరోనా సోకినా.. కనీసం పరీక్షలు చేయడానికి కూడా ఆ దేశంలో సరైన వసతులు లేవు. ఇప్పటికే కరోనా అంతమయిందిన కిమ్‌ ప్రకటించారు. కానీ.. ఆ దేశంలో ఇప్పటికీ వైరస్‌ విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌కు దక్షిణ కొరియా కారణమంటూ కిమ్‌ ఆరోపిస్తున్నారు.

దేశంలో నెలకొంటున్న దుర్భిక్ష పరిస్థితులను కిమ్‌ పట్టించుకోవడం లేదు. పైగా రష్యాకు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వలంటీర్లను పంపుతానని భీరాలు పలుకుతున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా పోరాడేందుకు అవసరమైన ఆయుధాలను కూడా ఇస్తామని చెబుతున్నారు. రష్యాతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న కిమ్‌.. ఆమేరకు సాయానికి ముందుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిమ్ సాయం తీసుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటివరకు 10కి పైగా క్షిపణుల ప్రయోగాలను నిర్వహించాడు. దీంతో పొరుగున ఉన్న దక్షిణ కొరియా, జపాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతుండడంతో ఆ రెండు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఒకవేళ కిమ్‌ మళ్లీ అణు పరీక్షలు నిర్వహిస్తే.. ఈసారి మరిన్ని కఠిన ఆంక్షలను విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర కొరియాపై 2వేల 97 ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరోసారి ఆంక్షలు విధిస్తే మాత్రం ప్రజల పరిస్థితిని అంచనా వేయడం కష్టమే..

మనందరికీ అందుబాటులో ఉన్న సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్లు.. ఉత్తర కొరియా ప్రజలకు అస్సలు తెలియదు. నెట్ కేవలం కంప్యూటర్‌ ఉన్న వీఐపీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ తీసుకోవాల్సిందే. అక్కడి ప్రజలకు టీవీలు కూడా చాలా తక్కువే.. ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే ప్రకటనలకు కేవలం రేడియోలను మాత్రమే వాడుతారు. అత్యంత దుర్భరంగా ఉండే ఉత్తర కొరియన్ల పరిస్థితి కిమ్‌ పోతే తప్ప మారదేమో..

Show Full Article
Print Article
Next Story
More Stories