Kash Patel:FBI డైరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు కాష్ పటేల్..

Kash Patel Appointed Director Federal Bureau OF Investigation
x

FBI డైరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు కాష్ పటేల్..

Highlights

అమెరికా ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు.

Kash Patel: అమెరికా ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. పటేల్ నియమాకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే ఇలాంటి పదవులకు సంబంధించిన నియమాకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీర్మానంపై సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్ పటేల్‌కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకాన్ని అధికారికంగా ధృవీకరించారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియమాకానికి లైన్ క్లియర్ అయింది.

అయితే రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియామకంపై ఓటింగ్ చేపట్టారు. అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సెనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియమాకాన్ని వ్యతిరేకించారు. ఇక ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్రలను ప్రోత్సహించడం, క్యాపిటల్ హిల్ పై దాడికి పాల్పడిన ట్రంప్ మద్దతుదారులను సమర్థించడం, రిపబ్లికన్ అధ్యక్షుడిని వ్యతిరేకించేవారిపై వివాదాస్పద ప్రకటనలు చేయడం వంటి అంశాలపై పటేల్.. డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు ట్రంప్ చేపట్టిన అన్ని క్యాబినెట్ నియామకాలను సెనేట్ ఆమోదించింది.

ఇక పటేల్ నియమకాన్ని చివరి వరకు డెమోక్రాట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలోని FBI కార్యాలయం వద్ద డెమొక్రాట్ సెనేటర్ డిక్ డర్చిన్ మీడియా సమావేశం నిర్వహించి కాష్‌ను చీఫ్ గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని అన్నారు. ఆయన ప్రమాదకరమైన వేర్పాటువాది అని ఆరోపించారు. తన రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశ అత్యున్నత చట్ట అమలు సంస్థను వాడుకోవాలనే తన ఉద్దేశాన్ని ఆయన పదే పదే వ్యక్తం చేశారు అని డిక్ ధ్వజమెత్తారు.

ఇక FBI డైరెక్టర్‌గా నియామకం తర్వాత కాష్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమెరికా గర్వపడేలా FBIని తీర్చుదిద్దుతానన్నారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తాం. అలాంటి వారు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వెంటాడుతామని హెచ్చరించారు. మిషన్ ఫస్ట్. అమెరికా ఆల్ వేస్ లెట్స్ వర్క్ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు డైరెక్టర్‌గా తన లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్పుకొచ్చారు.


ఎవరీ కాష్ పటేల్:

కాష్ పటేల్ పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. ప్రవాస భారతీయుడు. స్వరాష్ట్రం గుజరాత్. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తండ్రి అమెరికాలోని ఓ ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 2002లో యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై.. మియామీ కోర్టులో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.

కీలక కేసులను వాదించిన కశ్యప్ అలియాస్ కాష్.. కొన్నాళ్లు న్యాయశాఖలో చేరారు. అప్పుడే ఆయన ట్రంప్ దృష్టిలో పడ్డారు. ట్రంప్‌కు సన్నిహిడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా 2019లో నియమితులయ్యారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా.. తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీ, ఫెడరల్ ప్రాసిక్యూటర్, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా పలు విధులు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories