Russia: రసాయన, అణ్వాయుధాల దాడికి పుతిన్‌ సిద్ధం?

Joe Biden Warns Vladimir Putin against Nuclear Attack on Ukraine
x

ఉక్రెయిన్‌ ఆణ్వాయుధ దాడికి రష్యా రెడీ

Highlights

*ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయొద్దంటూ... పుతిన్‌ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

Russia: ఉక్రెయిన్‌ సేనల దెబ్బకు రష్యా సైన్యం పారిపోయింది. మరోవైపు మాస్కో ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో రష్య అధ్యక్షుడు పుతిన్‌ చిర్రెత్తిపోతున్నారు. ఉన్న ఆయుధ నిల్వలు పడిపోతుండడంతో.. ఆసియాలోని అగ్రదేశాలూ చురకలంటిస్తుండడంతో ఉడికిపోతున్నారు. ఉక్రెయిన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు అసలైన అస్త్రాలను సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లోనూ ఆందోళన నెలకొన్నది. ఉక్రెయిన్‌పై అణు, రసాయన ఆయుధాలను ప్రయోగించే సాహసం చేయొద్దంటూ హెచ్చరించారు. అలా చేస్తే.. మొత్తం యుద్ధం స్వరూపాన్నే మార్చేస్తుందని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్‌ యుద్ధం.. ఎనిమిదో నెలకు చేరుకుంటోంది.. ఉక్రెయిన్‌ సైన్యం.. ఊహించని ఎదురు దాడులకు దిగుతోంది. దీంతో ఈ యుద్దంలో రోజు రోజుకు రష్యా సేనలు బలహీనపడుతున్నాయి. ఖార్కివ్‌ ప్రావిన్స్‌లోని ఇజుమి ప్రాంతంలో తిష్ఠ వేసిన క్రెమ్లిన్‌ సేనలను ఉక్రెయిన్‌ బలగాలు వెంటబడి మరీ తరిమికొట్టాయి. ఖార్కివ్‌లో 8 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో కీవ్‌ బలగాలు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాయి. గ్రామాలను పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. కీలకమైన ఆక్సిల్‌ నది తీరానికి ఉక్రెయిన్ బలగాలు చేరుకున్నాయి. దీంతో రష్యాకు గడ్డు పరిస్థితి తప్పదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా సైనికులు మృత్యువాత పడడం.. ఉన్నవారు పారిపోవడం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో శత్రవును కట్టడి చేయాలని భావిస్తోన్నారు. అందులో భాగంగా లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లను మోహరిస్తున్నారు. యుద్ధంలో ఎవరెన్ని చెప్పినా.. తగ్గేదే లేదని పుతిన్‌ తేల్చి చెబుతున్నారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు లాంగ్‌ రేంజ్‌ క్షిపణులతో పాటు అసలైన అస్త్రాలను బయటకు తీస్తున్నట్టు సర్వత్రా అనుమాణాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని రకాలుగా యుద్ధంలో నష్టాలను మూటగట్టుకుంటున్న పుతిన్‌ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ సైన్యం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోందని పుతిన్‌ చెప్పుకొచ్చారు. తమపై ఒత్తిడి పెంచితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. ఉక్రెయిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. డాన్‌బాస్‌ విముక్తి కోసం చేపట్టిన సైనిక చర్యలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టంచేసిన ఆయన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ దేశ పౌర, మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తే.. తమ స్పందన తీవ్రంగా ఉంటుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. లాంగ్‌ రేంజ్ మిస్సైళ్లను రంగంలోకి దింపడం.. తాజాగా పుతిన్‌ వార్నింగ్స్‌తో పశ్చిమ దేశాల్లో ఆందోళన మొదలైంది. లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లతో ఏకంగా కీవ్‌ను లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. పరాభవంతో రగిలిపోతున్న పుతిన్‌ అణ్వస్త్రాలను, రసాయన ఆయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తారేమో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఒకవేళ అణ్వస్త్రాలనే పుతిన్‌ ప్రయోగించదలిస్తే తక్కువ తీవ్రత ఉన్నవాటితో దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా పలు నగరాలు పూర్తిగా నేలమట్టమైన ఉక్రెయిన్‌లో అణు దాడి జరిగితే మాత్రం భారీ విధ్వంసం తప్పదని నిపునులు హెచ్చరిస్తున్నారు.

అణు, రసాయన ఆయుధాలతో పుతిన్‌ దాడి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఉక్రెయిన్‌పై అణు, రసాయన ఆయుధాలను ప్రయోగించొద్దని పుతిన్‌ను బైడెన్‌ హెచ్చరించారు. ఒకవేళ ఆ ఆయుధాలను ప్రయోగిస్తే... మొత్తం యుద్ధం స్వరూపాన్నే మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల పర్యవసనాలపై ఆధారపడి.. అమెరికా స్పందన ఉంటుందన్నారు. రసాయన, అణ్వాయుధాలతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగితే.. మునుపెన్నడూ లేనివిధంగా ప్రపంచ వేదికపై ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలతో నాటో రంగంలోకి దిగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటో యుద్ధానికి దిగితే మాత్రం పరిస్థితి మరింత దిగజారుతుంది. యుద్ధం తీవ్రతతో ప్రపంచ దేశాలకు తీరని నష్టం మిగులుతుంది. ఇదిలా ఉంటే.. నాటో జోక్యాన్నే పుతిన్‌ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని.. పశ్చి మదేశాల తూర్పు సరిహద్దుల్లో దళాలను మోహరించొద్దని పుతిన్‌ మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇస్తే.. అమెరికా దళాలు.. రష్యా సరిహద్దులోకి చేరుకున్నట్టే.. ఇది సహజంగా మాస్కోను ఆందోళనకు గురిచేసే అంశం.. పైగా నాటో బలపడడం పుతిన్‌ను అస్సలు ఇష్టం లేదు. నాటో సభ్యత్వం ఇవ్వడమంటే.. విస్తరణవాదమేనని పుతిన్‌ ఆరోపిస్తున్నారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. ప్రారంభంలో రెండ్రోజుల్లో యుద్ధం పూర్తవుతుందని పుతిన్‌ అంచనా వేశారు. బెలారస్‌ మీదుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ దశగా.. మాస్కో బలగాలు వేలమంది సైన్యం దండెత్తింది. కీవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. ఉక్రెయిన్ గెరిల్లా పోరాటానికి క్రెమ్లిన్‌ సైన్యం విలవిలలాడింది. కీవ్‌ను మాత్రం చేరుకోలేకపోయింది. మూడు నెలల తరువాత.. గత్యంతరం లేక.. డాన్‌బాస్‌ వైపు మళ్లాయి. కానీ.. ఖార్కివ్‌ ప్రావిన్స్‌లోని ఇజియం ప్రాంతంలో రష్యా సైన్యం తిష్టవేసింది. తాజాగా అక్కడి నుంచే రష్యా దళాలను ఉక్రెయిన్‌ తరిమికొట్టింది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు చెందిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ధ్వంసమయ్యాయి. కీవ్‌కు చెందిన సైన్య, పౌరులు కలిపి.. మొత్తం 15 వేల మంది మృత్యువాత పడ్డారు. రష్యాకు మాత్రం భారీగా సైనిక, ఆయుధ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం కారణంగా.. ఉక్రెయిన్‌కు చెందిన 60 లక్షలకు పైగా ప్రజలు విదేశాలకు వలసవెళ్లారు. మరో కోటి మందికి పైగా స్వగ్రామాలను వదిలి.. సురక్షిత ప్రాతాలకు తరలివెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. ఐరోపాలో తొలిసారి భారీ మానవ వలసలు సంభవించినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం తెలిపింది.

తాజాగా పరిణామాలపై ఐరోపా, అమెరికా దేశాల్లో ఆందోళన మొదలయ్యింది.. పుతిన్ అణ్వస్త్ర దాడికి దిగితే.. ఏం చేయాలన్న ప్రశ్న ఆయా దేశాల నేతలను వేధిస్తోంది. యుద్దానికి దిగితే మాత్రం సర్వం కోల్పోవాల్సిందే. ఈ విషయం ఆయా దేశాల నేతలకు కూడా తెలుసు.. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేయాలని పలు దేశాలు రష్యాకు, ఉక్రెయిన్‌కు పిలుపునిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories