Joe Biden: బైడెన్‌ను చుట్టుముడుతున్న సమస్యలు

Joe Biden Struggling Under a Pile of Crises | US News
x

Joe Biden: బైడెన్‌ను చుట్టుముడుతున్న సమస్యలు

Highlights

Joe Biden: భారీగా పెరిగిన చమురు, నిత్యావసరాల ధరలు

Joe Biden: అగ్రదేశం అధినేత బైడెన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర క్రితం మెజార్టీతో గెలిచిన ఆయన ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కోవిడ్‌ తరువాత సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు తమను బెడెన్‌ గట్టెక్కిస్తాడని భావించారు. అయితే దేశంలో తూటాలను కక్కుతున్న గన్‌ కల్చర్‌, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గర్బస్రావం హక్కులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, బేబీ ఫార్ములా షార్టేజీ, సరిహద్దులో పెరుగుతున్న వలసలతో బైడెన్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, తాజా పరిణామాలపై అధ్యక్షుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో బైడెన్‌ విఫమలయ్యారన్న ఆరోపణలను ఎక్కుపెడుతున్నారు.

2020లో కరోనా సృష్టించిన కల్లోలంతో అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. డోనాల్డ్‌ ట్రంప్‌ పాలన తీరుపై విసిగిపోయారు. ఈ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన జో బైడెన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమెరికాను వేధిస్తున్న గన్‌ కల్చర్‌, కరోనా కష్టాల నుంచి బైడెన్‌ తమను గట్టెక్కిస్తారని వారంతా భావించారు. 2021 జనవరి 20న బైడెన్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత సెకండ్‌ వేవ్‌ రావడంతో బైడెన్ పూర్తిగా కరోనాపైనే దృష్టి సారించారు. ఆ తరువాత కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏడాదంతా పాత సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి పెడతారనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఓపిక పట్టారు. అయితే ఇంతలోనే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వచ్చింది. వార్‌ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను బైడెన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో దేశంలో విపరీతంగా చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. గతంలో గ్యాలన్ పెట్రోలు ధర 250 రూపాయల లోపే ఉండేది. యుద్ధం తరువాత 400 రూపాయలకు చేరువయ్యంది. చమురు ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అమెరికాను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్య గన్‌ కల్చర్‌. ఎన్నికల ముందు గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని కఠినతరం చేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల వరుస ఘటనల్లో గన్నులు గర్జిస్తున్నాయి. టెక్సాస్‌లోని స్కూల్‌లో యువకుడు జరిపిన కాల్పులు ఏకంగా 22 మంది చనిపోయారు. ఆ తరువాత కూడా నాలుగైదు ఘటనలు జరగడంతో అమెరికన్లలో భయాందోళన వ్యక్తమైంది. గన్‌ కల్చర్‌కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని పటిష్ఠం చేస్తామని బైడెన్‌ చెబుతున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం వ్యతిరేకిస్తోంది. గన్‌ కంట్రోల్‌ చట్టం ఇప్పుడు రాజకీయ అంశంగా మారిపోయింది. చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం లేదని రిపబ్లికన్లు అంటున్నారు. ప్రజలు మాత్రం కఠిన చట్టాన్ని తేవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అధ్య‌క్షుడు బైడెన్‌పై ప్రజలు మండిపడుతున్నారు. చట్టాన్ని పటిష్ఠం చేస్తామని మౌనంగా ఉండడమేమిటంటూ నిలదీస్తున్నారు. అయితే నిజానికి గన్‌ కంట్రోల్‌ చట్టాన్ని మార్పులు చేయాలంటే ప్రతిపక్షం కూడా అందుకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిపక్షమేమో వ్యతిరేకిస్తోంది. దీంతో బైడెన్‌ ఏమీ చేయలేకపోతున్నారు. పైగా ప్రతిపక్షం బైడెన్‌పైనే విమర్శలు గుప్పిస్తోంది. స్కూళ్లలో సరైన రక్షణ లేదని ఆరోపించింది.

గర్భస్త్రావం హక్కులపై అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. అబార్షన్‌ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు అ దేశ అత్యున్నత కోర్టు నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది మహిళలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మా శరీరం, మా భవిష్యత్తు, మా అబర్షన్‌ అంటూ నినాదాలతో నిరసనలు తెలుపుతున్నారు. అబార్షన్‌ నిర్ణయం మహిళదేని ఆమె శరీరానికి సంబంధించిన నిర్ణయాన్ని మరొకరు తీసుకోవడమేమిటని అమెరికా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, టెక్సాస్‌, కెంటకీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రజలు రోయ్‌ వర్సెస్‌ వేడ్‌ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రోయ్‌ వర్సెస్‌ వేడ్‌ 1973 ప్రకారం అమెరికాలో అబార్షన్‌ చట్టబద్దమే. అబార్షన్‌ అనేది మహిళ ఇష్టం. అబార్షన్లతో మహిళల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఈ కేసు అమెరికా అత్యున్నత కోర్టులో విచారణ సాగుతోంది. కోర్టు ముసాయిదా ప్రతి లీక్‌ అయ్యింది. అబార్షన్‌ హక్కులను రద్దు చేసే అవకాశం ఉందని లీకైన ప్రతులతో వెల్లడయింది. దీంతో మహిళలు బగ్గుమంటున్నారు. మహిళలకు అనుకూలంగా బైడెన్‌ మాట్లాడినా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నారులకు పాల ఉత్పత్తుల కొరత అమెరికాను కుదిపేసింది. దేశవ్యాప్తంగా బేబీ ఫార్ములా షార్టేజీ పేరుతో ఆందోళనలు వెల్లువెత్తాయి. కరోనా తరువాత చిన్నారుల పాల ఉత్పత్తుల కొరత తీవ్రమైంది. నిజానికి 6 నెలల వయస్సు వరకు చిన్నారులకు తల్లి పాలు ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉద్యోగం, ఇతరాత్ర సమస్యల కారణంగా చిన్నారులకు తల్లి పాలు ఇవ్వడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారులకు ఆవు పాలతో తయారుచేసిన వివిధ కంపెనీల పాల ఉత్పత్తులను చిన్నారుల కోసం వాడుతున్నారు. దేశంలో పాల ఉత్పత్తుల కొరత తీవ్రమవడంతో పలువురు చిన్నారులు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం సరిపడా పాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారానికి విదేశాల నుంచి పాల ఉత్పత్తుల దిగుమతికి బైడెన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అమెరికా సరిహద్దులోనూ సంక్షోభం నెలకొంది. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక సరిహద్దుల్లో నుంచి 2లక్షల 34 వేల మంది దేశంలోకి వచ్చినట్టు గుర్తించారు. ఇది కూడా విమర్శలకు దారి తీస్తోంది. దీంతో బైడెన్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకదాని తరువాత ఒకటి వరుసగా సమస్యలు బైడెన్‌ను చుట్టుముడుతున్నాయి. నాలుగేళ్ల పాలనలో కేవలం ఏడాదిన్నరకే బైడెన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డెమోక్రాట్లలో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే డ్యామేజీని సరి చేసుకునేందుకు బైడెన్‌ ప్రభుత్వం కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories