
జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో 'జోంబీ ఫ్లవర్' లేదా దతురా మొక్కల గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. దతురాను స్థానికంగా ఉమ్మెత్తగా పిలుస్తాము.
Epstein files: అమెరికాకు చెందిన వివాదాస్పద ఆర్థికవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన కేసులో తాజాగా విడుదలైన ఈమెయిల్స్ పలు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాయి. ముఖ్యంగా "ట్రంపెట్ ప్లాంట్స్" (బాకా ఆకారపు పువ్వులు) లేదా "దతురా" వంటి విషపూరిత మొక్కలపై ఎప్స్టీన్ ప్రత్యేక ఆసక్తి కనబరిచినట్లు ఈ ఫైల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. కొలంబియా వంటి దేశాల్లో ఈ మొక్కల ద్వారా తయారయ్యే మత్తు పదార్థాలను ఉపయోగించి వ్యక్తులను తమ నియంత్రణలోకి తెచ్చుకునే అంశంపై ఎప్స్టీన్ - అతని అనుచరుల మధ్య చర్చలు జరిగినట్లు ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
'జోంబీ ఫ్లవర్' అంటే ఏమిటి? మెదడుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రస్తావించిన ఈ మొక్కలను సాధారణంగా "జోంబీ ఫ్లవర్స్" అని పిలుస్తారు. శాస్త్రీయంగా వీటిని 'దతురా' (Datura) అని అంటారు. ఈ మొక్కలు స్కోపోలమైన్ (Scopolamine) అనే అత్యంత శక్తివంతమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది మనిషి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రసాయనం వల్ల మనిషి తన విచక్షణను, జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని ఇతరులు సులభంగా తమ అదుపులోకి తీసుకోవచ్చు. వారు చెప్పినట్లు వినేలా "విధేయులుగా" మార్చవచ్చు. అందుకే దీనిని నేర ప్రపంచంలో "జోంబీ బ్రీత్" అని కూడా పిలుస్తారు. ఎప్స్టీన్ ఈ మొక్కల గురించి ఆరా తీయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈమెయిల్స్‌లో బయటపడిన మూడు కీలక సంఘటనలు..
అంతర్జాతీయ మీడియాలో ప్రచురితం అయిన కథనాల ప్రకారం ఎప్స్టీన్ దర్యాప్తులో భాగంగా సేకరించిన పత్రాల్లో ఈ మొక్కల గురించి మూడు ప్రధాన ఈమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది:
1. మార్చి 3, 2014 నాటి ఈమెయిల్:
జెఫ్రీ ఎప్స్టీన్ నేరుగా "ఆన్ రోడ్రిగ్జ్" అనే వ్యక్తికి ఈ సందేశం పంపారు. ఇందులో తన నర్సరీలో ఉన్న ట్రంపెట్ ప్లాంట్స్ గురించి ఒకరిని విచారించమని కోరారు. దీన్ని బట్టి ఎప్స్టీన్ తన వద్ద ఈ విషపూరిత మొక్కలను సాగు చేస్తున్నాడని లేదా నిల్వ ఉంచాడనే విషయం స్పష్టమవుతోంది.
2. జనవరి 27, 2015 నాటి ఈమెయిల్:
ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఆంటోయిన్ వెర్గ్లాస్ ఒక వార్తా కథనాన్ని ఎప్స్టీన్‌కు ఫార్వార్డ్ చేశారు. ఆ కథనం కొలంబియా అడవుల్లో దొరికే స్కోపోలమైన్ డ్రగ్ గురించి వివరించింది. ఒక వ్యక్తిని చిన్న పిల్లాడిలా మార్చి, ఎక్కడికైనా తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ వ్యాసంలో హైలైట్ చేశారు.
3. ఫిబ్రవరి 7, 2022 నాటి పత్రం:
ఇది బాధితుల వాంగ్మూలాలకు సంబంధించింది. ఇందులో 'మంజారో' అనే వ్యక్తి, తనకు తెలియకుండానే స్కోపోలమైన్ ఇచ్చి మత్తులోకి దించినట్లు పేర్కొన్నారు. తనకు డ్రగ్ ఇచ్చిన వ్యక్తులు "నేను అతనికి చాలా స్కోపోలమైన్ ఇచ్చాను" అని మాట్లాడుకోవడం విన్నట్లు అతను ఆరోపించాడు. దీనివల్ల తాను తీవ్రమైన గందరగోళానికి గురైనట్లు తెలిపాడు.
హిందూ సంప్రదాయంలో దతురా ప్రాముఖ్యత
భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ మతంలో దతురా (ఉమ్మెత్త) పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం, క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని (విషం) లోక కల్యాణం కోసం శివుడు స్వీకరించాడు. ఆ విషయానికి చిహ్నంగా ఉమ్మెత్తను భావిస్తారు. అందుకే శివునికి ఈ పువ్వును అర్పిస్తారు. మరేదేవునికి ఈ పూలతో పూజ చేయరు. ఈ చీకటి వ్యవహారానికి మత పరమైన ప్రాముఖ్యత లేకపోయినా..దతురా గురించి వివరించే క్రమంలో ఈ విషయాన్ని జాతీయ మీడియాలో ప్రస్తావిస్తుండడం గమనార్హం .
ఆ విషానికి ప్రతీకగా ఉమ్మెత్త (దతురా) పువ్వులను, పండ్లను భక్తులు శివాలయాల్లో సమర్పిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన వీటితో పూజలు చేస్తారు. అయితే, ఆధ్యాత్మికంగా ఇది రక్షణకు చిహ్నంగా ఉన్నప్పటికీ, ఎప్స్టీన్ వంటి వారు దీనిని దుర్వినియోగం చేసే కోణంలో చూడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఈ కొత్త ఆధారాలు మనుషుల అక్రమ రవాణా లేదా వారిని లొంగదీసుకోవడానికి రసాయన పదార్థాలను వాడి ఉండవచ్చనే వాదనకు బలాన్నిస్తున్నాయి. ప్రకృతిలో లభించే ఒక మొక్కను నేరపూరిత కార్యకలాపాలకు ఎలా వాడుకున్నారనే విషయాన్నీ ఈ ఫైల్స్ వెల్లడిస్తున్నాయి.
జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో 'జోంబీ ఫ్లవర్' లేదా దతురా మొక్కల గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. స్కోపోలమైన్ అనే డ్రగ్ ద్వారా వ్యక్తులను నియంత్రించే అంశంపై ఎప్స్టీన్ ఆసక్తి చూపినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




