గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ - ట్రంప్‌తో సమావేశంలో నెతన్యాహు కీలక ప్రకటన

గాజాలో యుద్ధ విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ - ట్రంప్‌తో సమావేశంలో నెతన్యాహు కీలక ప్రకటన
పశ్చిమాసియాలో శాంతి కపోతాలు ఎగరబోతున్నాయా? గాజాపై యుద్ధం విరమించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లేనా? ప్రపంచ మంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఈ వార్తల కోసమే.
పశ్చిమాసియాలో శాంతి కపోతాలు ఎగరబోతున్నాయా? గాజాపై యుద్ధం విరమించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లేనా? ప్రపంచ మంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఈ వార్తల కోసమే. యుద్ధాన్ని విరమించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ఒత్తిడులు ఫలించాయి. ఆయన సూచించిన ఫార్ములాకు అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సంక్షోభానికి తెర దించేందుకు అంగీకనించారు. అయితే హమాస్ స్పందన ప్రకారమే అంటూ మెలిక పెట్టారు.. ఖతార్‌పై దాడి చేసినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ పరిణామాలను భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల నాయకులు స్వాగతించారు.
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్‌హౌజ్ వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు నెతన్యాహూ దాదాపుగా అంగీకరించారు. ఇటీవల ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన దిగివచ్చారు. ఖతార్ మీద దాడి చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఒత్తిడి మేరకు నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధాని అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ అల్ థానికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు అమెరికా అధ్యక్షుడు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు ట్రంప్. ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు.పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని అన్నారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు ట్రంప్.
నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు.
అయితే హమాస్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో అన్న అనుమానాన్ని వారు వ్యక్తం డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహూ. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణిమాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రణాళికను హమాస్ అంగీకరించాల్సిందేనని, అలా జరగని పక్షంలో ఆ ఉగ్ర సంస్థను అంతం చేసి తీరతామని హెచ్చరించారు.
ట్రంప్-నెతన్యాహు ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు.
మరోవైపు పశ్చిమాసియాలో శాంతి దిశగా కుదిరిన ప్రతిపాదనను భారత ప్రధాని మోదీ స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడి ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘గాజా లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక, స్థిరమైన శాంతిభద్రతకు మార్గమవుతుంది. యుద్ధం ముగించి, శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’ అని మోదీ రాసుకొచ్చారు.
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడులు చేయడం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్‌ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడులు చేపట్టింది. ఈ యుద్దంలో దాదాపు 66 వేల మంది పాలస్తీనావాసులు మరణించారు. లక్షా 68 వేల మంది గాయపడ్డారు. మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులేనని అంచనా. గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్.. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగిస్తోంది. దీంతో, ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోగా, తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో 7 లక్షల మంది భవనాల శిథిలాలు, టెంట్లలోనే ఉండిపోయారు. గాజా జనాభాలో దాదాపు 90 శాతం మంది నిరాశ్రయులుగా మారారు. పెద్దఎత్తున విధ్వంసం, మానవతా సంక్షోభం, కరవుతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



