India–US trade row: 'మోదీ నాపై అసంతృప్తిగా ఉన్నారు'..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

India–US trade row
x

India–US trade row: 'మోదీ నాపై అసంతృప్తిగా ఉన్నారు'..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Highlights

India–US trade row: ప్రధాని మోదీ తనపై అసంతృప్తిగా ఉన్నారంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

India–US trade row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ వాణిజ్య విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని చెప్పిన ట్రంప్… ప్రస్తుతం మాత్రం ఆయన తనపై అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు.

రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మోదీ చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టాలని ప్రయత్నించారు కూడా. కానీ రష్యా విషయంలో నేను సంతృప్తిగా లేను అన్న విషయం ఆయనకు తెలుసు. భారత్ మా దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యం చేస్తోంది. వారు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే, వారి ఉత్పత్తులపై మేం మరింత భారీ పన్నులు విధించగలం” అంటూ హెచ్చరించారు.

రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీయాలన్న అమెరికా ప్రయత్నాలకు భారత్ చమురు కొనుగోలు అడ్డుగా మారుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇదే కారణంగా గత ఏడాది (2025) భారతీయ వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పెంచిందని, ఈ నిర్ణయం మోదీకి నచ్చలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ టారిఫ్‌ల పెంపుతో భారత ఎగుమతులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రష్యా ఆయిల్ అంశం అడ్డంకిగా మారిందని తెలుస్తోంది.

లిండ్సే గ్రాహం ఘాటు వ్యాఖ్యలు

ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా ఘాటుగా స్పందించారు. తక్కువ ధరకు రష్యా ఆయిల్ కొనడం అంటే యుద్ధానికి సహకరించడమేనని విమర్శించారు. అవసరమైతే భారత్‌పై 500 శాతం వరకు పన్నులు విధించేలా చట్టం తీసుకొస్తామని హెచ్చరించారు.

అయితే భారత్ మాత్రం తమ ఇంధన అవసరాలు, ప్రజల ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమని, ఎవరి నుంచి చమురు కొనాలో తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలతో భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత సున్నిత దశకు చేరుతున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories