భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన
x

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన

Highlights

వాణిజ్య సుంకాలపై భారత్, అమెరికాల మధ్య ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యక్ష భేటీతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు అమెరికా అధికారులు.

వాణిజ్య సుంకాలపై భారత్, అమెరికాల మధ్య ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యక్ష భేటీతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు అమెరికా అధికారులు. ట్రంప్ భారత్‌తో సంబంధాలు దూరం చేసుకోవడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికా ప్రయోజనాలకే నష్టమంటూ అధ్యక్షునికి లేఖ రాశారు. మరోవైపు భారత్‌ నుంచి దిగుమతయ్యే జనరిక్ ఔషధాలను సుంకాల నుంచి మినహాయించింది అగ్రరాజ్యం. ఈ పరిణామం భారత ఔషధ పరిశ్రమతో పాటు అమెరికన్ ప్రజలకు కూడా ఎంతో ఊరటనిస్తోంది


భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 % సంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 % కలిపి మొత్తం 50 % సుంకాలు విధించడం తెలిసిందే. దీని ప్రభావం ఇప్పటికే మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ట్రంప్‌ సుంకాల ధాటికి నాలుగు నెలల్లోనే అమెరికాకు భారత ఎగుమతులు 22శాతం మేర తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితేగానీ సుంకాల నుంచి భారం నుంచి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే తమ దేశం నుంచి చమురు, ఆయుధాలు, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ షరతులకు అంగీకరిస్తే భారత రైతులు, పాడి, మత్స్య పరిశ్రమ ప్రయోజాలు దెబ్బతినే అవకాశం ఉంది.


అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా వెళ్లి వెళ్లి అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్‌ గ్రోర్‌తో పలుమార్లు సమావేశాలు జరిపారు.అయినా.. ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, ఈ ప్రతిష్టంభన తొలిగి ట్రేడ్‌ డీల్‌ ఓ కొలిక్కి రావాలంటే భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ తప్పనిసరి అని అమెరికా భావిస్తోంది. వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందు ప్రధాని మోదీ తో భేటీ కావాలని ట్రంప్‌ సూచిస్తోంది. కానీ భారత విధానాల ప్రకారం అది సాధ్యం కాకపోవచ్చు. ఒకసారి ట్రేడ్‌ డీల్‌ కుదిరిన తర్వాతే ఇరు దేశాధినేతలు మాట్లాడుకుంటారు. దీనిపై భారత్‌కు యూఎస్‌ రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌ దీనిపై మన ప్రభుత్వంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా అక్టోబరు 26-28 మధ్య మలేసియాలోని కౌలాలంపూర్‌ వేదికగా ఆసియాన్‌, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సు అనుబంధంగా ట్రంప్‌-మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సదస్సుకు ప్రధాని పర్యటన ఇంకా ఖరారు కాలేదు.


మరోవైపు భారత్‌తో సంబంధాలు క్షీణించడంపై అమెరికాకు చెందిన చట్ట సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో అమెరికా సంబంధాలను వెంటనే పునరుద్ధరించాంటూ 19మంది చట్టసభ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. వారిలో ప్రముఖ డెమెక్రాట్‌ నేత దెబోరా రాస్‌, రోఖన్నా తదితరులు ఉన్నారు. భారత్ ఉత్పత్తులపై ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు అమెరికా వినియోగదారులను, భారత ఉత్పత్తిదారులను తీవ్రంగా నష్టపరిచిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘భారత్‌తో బలమైన కుటుంబ, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ఇండియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీలు నివసిస్తున్న ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా మీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నిర్ణయం ఇరుదేశాలకు ప్రతికూల ప్రభావాన్ని సృష్టించింది. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని మరమ్మతు చేయడానికి, పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని ఆ లేఖలో కోరారు.


అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న చర్యలు రష్యా, చైనాలతో భారత్‌ తన దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంచుకునేందుకు ఒత్తిడి చేశాయి. చైనాను కౌంటర్‌ చేసేందుకు భారత్‌ పాత్ర చాలా కీలకం. క్వాడ్‌లో భాగంగా ఉన్న భారత్‌.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి సమయంలో ఇండియా.. ఇలా రష్యా, చైనాకు దగ్గరకావడం చాలా ఆందోళన కలిగించే పరిణామం.రక్షణ రంగం విషయంలో అమెరికాకు భారత్‌ మంచి భాగస్వామి. అమెరికాతో ఆ దేశం సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా, మిత్రదేశాలతో సముద్ర మార్గాలను సమన్వయపరచడానికి భారత్‌ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోంది. రక్షణ, ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్లు, ఆవిష్కరణలు వంటి వాటిలో అమెరికా, భారత్‌ సహకారం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారత్‌ పట్ల అమెరికా తన నిబద్ధతను చాటాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా చట్టసభ సభ్యులు పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే బ్రాండెడ్‌, పేటెంట్‌ ఔషధ దిగుమతులపై 100శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ భద్రతను దృష్టిలోఉంచుకొని అమెరికాకు దిగుమతి అయ్యే ఈ ఔషధాలపై సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టారిఫ్‌లు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అప్పుడు జనరిక్‌ ఔషధాల దిగుమతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. జనరిక్‌ ఔషధాలపై టారిఫ్‌లు విధించే ప్రణాళిక ఏదీ లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌కు ఊరట లభించినట్లయ్యింది.

జనరిక్‌ ఔషధాలపై సుంకాలు విధించే అంశంపై ట్రంప్‌ పాలసీ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. వీటిపై టారిఫ్‌లు వేస్తే.. దానివల్ల దేశీయంగా ధరలు పెరగడమే గాక, ఔషధాల కొరత ఏర్పడుతుందని కౌన్సిల్ సభ్యులు వాదించారు. అంతేగాక, వాటిపై అధిక సుంకాలు వేసినా అమెరికా కు ఎలాంటి లాభం ఉండదని అభిప్రాయపడ్డాయి. దీంతో ట్రంప్‌ దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ ఔషధాల రంగంలో భారతీయ ఔషధ పరిశ్రమ ముందంజలో ఉంది. మన కంపెనీలు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చౌకైన, అధిక నాణ్యత గల మందులను పంపుతాయి. అమెరికాకు మనదేశం నుంచి జనరిక్‌ ఔషధాలే అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. అక్కడ ఉపయోగించే దాదాపు 47% జెనరిక్ మందులు మన దేశం నుంచే వస్తున్నాయి. అమెరికా ఆరోగ్య రంగంలో భారతీయ ఔషధాల సహకారం చాలా ముఖ్యమైనది. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి 30 బిలియన్‌ డాలర్ల విలువైన మందులు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. అందులో దాదాపు మూడో వంతు అమెరికాకే చేరాయి. మన ఔషధ పరిశ్రమకు అమెరికా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్, యాంటీబయాటిక్స్ వంటి జీవన రక్షక ఔషధాలు భారతీయ కంపెనీల నుండి భారీ మొత్తంలో దిగుమతి అవుతాయి. ఈ మందుల ధరలు అమెరికాలో స్థానికంగా ఉత్పత్తి చేసే ధరల కంటే చాలా తక్కువగా ఉంటాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories