మిత్ర దేశాలను కలుపుకుని అమెరికా రెక్కలు విరిచేందుకు పుతిన్‌ స్కెచ్‌

Indias PM Modi to attend SCO summit in Uzbekistan
x

మిత్ర దేశాలను కలుపుకుని అమెరికా రెక్కలు విరిచేందుకు పుతిన్‌ స్కెచ్‌

Highlights

*భారత్, చైనా, ఇరాన్‌తో అమెరికాకు కళ్లెం

Russia: ప్రపంచం తమ గుప్పిట్లోనే ఉండాలి. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. ఏ దేశమైనా.. తాము చెప్పినట్టు నడుచుకోవాలి.. ఇది పశ్చిమ దేశాల తీరు. ఇన్నాళ్లు పశ్చిమ దేశాల ఆటలు సాగాయి.. తమకు ఎదురులేదని విర్రీగాయి.. ఇప్పుడు ఆ దేశాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌, రష్యా, ఇరాన్‌, చైనా రంగంలోకి దిగుతున్నాయి. నోట నవ్వుతూ.. నొసటితో వెక్కిరించే అమెరికాకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అగ్రదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలను ఒకతాటిపైకి తేచ్చేందుకు స్కెచ్‌ పడింది. అందుకు షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌సీవో వేదిక కానున్నది. 8 దేశాల ఈ కూటమిలోకి అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించే ఇరాన్‌కు సభ్యత్వం ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అదే జరిగితే.. ఇరాన్‌ చమురు, భారత్, చైనా, రష్యా ఆయుధాలు తోడైతే.. పశ్చిమ దేశాలు తోక ముడవాల్సిందే.

అగ్రదేశం అమెరికా తీరు ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏ దేశానికైనా అమెరికా సాయం చేస్తుందంటే దాని వెనుక ఏదో భారీ స్కెచ్‌ వేసినట్టే లెక్క. అందుకు ఎన్నో ఉదాహరణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన ఇరాక్‌ను అమెరికా సర్వనాశనం చేసింది. 1990లో ఇరాక్‌ ఓ వెలుగు వెలిగింది. అప్పటి అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ను హతమార్చి బాగ్దాద్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఇరాక్‌ పునర్నిర్మాణం పేరుతో అమెరికా కంపెనీలు రంగంలోకి దిగాయి. పునర్నిర్మాణంలో పాల్గొన్న 70కి పైగా అమెరికా కంపెనీలు 7వేల 200 కోట్ల డాలర్లను అర్జించాయి. అమెరికా దోపిడీ కారణంగా 2018 నాటికి ఇరాక్‌ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. కోటి 20 లక్షల మంది ప్రజలు ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ దేశంలో పూర్తిగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నిత్యం ఆందోళనలతో దద్దరిల్లుతోంది. దీనంతటికి కారణం అమెరికానే ఒక్క ఇరాకే కాదు అలాంటి బాధిత దేశాల గురించి చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది. అమెరికా కుటిల బుద్ధిని ఏ దేశాలు గుర్తించాయి? అగ్రదేశానికి ముకుతాడు వేసేందుకు ఏం చేస్తున్నాయి?

కాలం మారిపోయింది. అమెరికా తీరును.. భారత్‌, ఇరాన్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నిశితంగా గమనించాయి. అగ్రదేశంపై ఒంటరి పోరాటం చేస్తే.. ఏం జరుగుతుందో ఎన్నో సంఘటనల ద్వారా తెలుసుకున్నాయి. అప్పటి నుంచి అమెరికాను నమ్మడం మానేశాయి. అలా అని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. సమయం కోసం పలు దేశాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటికే రష్యా, ఇరాన్, నార్త్‌ కొరియా, చైనా వంటి దేశాలు అమెరికా తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అమెరికా తీరును ఎండగడుతున్నాయి. తాజాగా యుద్దంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలపై రష్యా కత్తులు నూరుతోంది. పశ్చిమ దేశాలను ఇబ్బంది పెట్టేందకు ఉన్న అన్ని మార్గాలను మాస్కో వినియోగించుకుంటోంది. అందులో భాగంగా మిత్ర దేశాలను కలుపుకుని.. అమెరికా రెక్కలు విరిచేడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్కెచ్‌ వేశారు. అందుకు చైనా, భారత్‌తో పాటు ఇరాన్‌ను కలుపుకుని.. అగ్రదేశాన్ని తుక్కు రేగొట్టాలని యోచిస్తున్నారట. ఈ క్రమంలో తాజాగా జరిగే ఉజ్బెకిస్థాన్‌లో జరిగే షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌సీవోను వేదికగా ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది.

ఎస్‌సీవో సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్‌, జిన్‌పింగ్‌ కూడా హాజరుకానున్నారు. ఈ ముగ్గురు నేతల్లో మోడీ అత్యంత కీలకమైన నేతగా మారారు. ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్‌.. సూపర్ పవర్‌ కాదు కానీ కింగ్‌ మేకర్‌ అని ప్రపంచ దేశాలు గుర్తించాయి. దీంతో ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత పలు దేశాలు భారత్‌వైపు ఆశగా, ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పటివరకు న్యూట్రల్‌గా ఉన్న భారత్‌.. అమెరికా తీరుతో అసహనానికి గురవుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అమెరికా అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించడంపై ఢిల్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని నిర్మూలించదు సరికదా.. ఆ యుద్ధ విమానాలను భారత్‌పై ప్రయోగించేందుకు ఏ మాత్రం వెనుకాడదు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని చెబుతూనే... పాక్‌ ఆయుధాల తప్పును దులిపేసి పదును పెట్టడానికి సిద్ధమైంది. దీంతో అమెరికాపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌తో పాటు చైనా, ఇరాన్‌తో అమెరికా జుట్టు పట్టుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది.

ఇరాక్‌కు ఎస్‌సీవో సభ్యత్వం ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. 8 దేశాల కూటమితో ఉన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో వచ్చే సంవత్సరంలోగా పూర్తి సభ్యత్వం ఇవ్వాలని ఎస్‌సీవో నిర్ణయించింది. చైనా, భారత్‌తో ఇరాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కూటమిలోకి ఇరాన్‌ చేరితే.. పశ్చిమ దేశాలకు భారీ దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పశ్చిమ దేశాలకు గ్యాస్‌ సరఫరాను రష్యా నిలిపేసింది. ఇప్పుడు ఇరాన్‌కు ఎస్‌సీవోలో చేరితే ఆ దేశం నుంచి కూడా చమురు నిలిచిపోనున్నది. అంతేకాకుండా.. మరో చమురు ప్రధాన ఎగుమతి దేశం సౌదీ అరేబియా కూడా అమెరికాపై గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌సీవోలో ఇరాన్‌ చేరికతో ప్రపంచ సమీకరణలు మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా, భారత్‌, చైనా, ఇరాన్‌ కలిస్తే ఈ కూటమిని ఎదుర్కోవడం ప్రపంచ శక్తిగా ఉన్న అమెరికాకూ కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఈ నాలుగు దేశాలపైనే ప్రపంచంలోనే 100కు పైగా దేశాలు ఆధారపడుతున్నాయి. అందుకే ఈ రకంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే భారత్‌ ఇక్కడ కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. చైనా కూడా పాక్‌కు సాయం చేస్తున్న సంగతి భారత్ విస్మరించదని.. ఈ నేపథ్యంలో భారత్ పరిమితస్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు.

అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ అనేది.. ఆర్థిక సహకారానికి ఏర్పాటైన కూటమే రక్షణ రంగానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వదు. దీంతో అమెరికాపై పెద్దగా ప్రభావం పడదని కొందరు చెబుతున్నా ఇరాన్‌ ఈ కూటమిలో చేరితే చమురు కష్టాలు తప్ప... ఏమీ లేదంటున్నారు. అసలు కష్టాలు అవే కదా అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories