NRI News: కెనడాలో కాల్పులు... భారతీయ విద్యార్థిని మృతి

Indian Student Harsimrat Kaur Randhawa died in Canada gun shots during a clash between two parties
x

Indian Student died in Canada: కెనడాలో కాల్పులు... భారతీయ విద్యార్థిని మృతి

Highlights

Indian Student died in Canada shooting: కెనడాలో కాల్పుల్లో గాయపడిన ఇండియన్ స్టూడెంట్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Indian Student died in Canada: కెనడాలో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి ఒక భారతీయ విద్యార్థిని మృతి చెందారు. ఆ ఘర్షణతో ఏ సంబంధం లేని యువతి అన్యాయంగా బలైపోయారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆ విద్యార్థిని పేరు హర్‌సిమ్రత్ కౌర్ రంధవా. వయస్సు 21 ఏళ్లు. రెండేళ్ల క్రితమే మాస్టర్స్ కోసం కెనడా వెళ్లారు. హామిల్టన్‌లోని మోహక్ కాలేజీలో మాస్టర్స్ చదువుతున్నారు.

గురువారం రాత్రి 7.30 గంటలకు హామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్ స్ట్రీట్, సౌత్ బెండ్ రోడ్ ఈస్ట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ప్రకారం బ్లాక్ కలర్ మెర్సిడెస్ కారులోని వ్యక్తి ఎదురుగా ఉన్న వైట్ సెడాన్ కారుపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లోనే హర్‌సిమ్రత్ కౌర్‌కు బుల్లెట్ తగిలింది. కాల్పుల్లో ఒక యువతి గాయపడినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రెండు వర్గాలు అక్కడి నుండి చెరోవైపు పరారయ్యాయి.

కాల్పుల్లో గాయపడిన హర్‌సిమ్రత్ కౌర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె బుల్లెట్ గాయంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లా ధూండా గ్రామం హర్‌సిమ్రత్ కౌర్ రంధవా స్వస్థలం. తమ కూతురు శవం త్వరగా స్వగ్రామం చేరేలా చూడాల్సిందిగా హర్‌సిమ్రత్ కౌర్ తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై కెనడాలోని టొరొంటోలో ఉన్న ఇండియన్ కాన్సూలేట్ జనరల్ స్పందించారు. హర్‌సిమ్రత్ కౌర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన కాన్సూలేట్ జరనల్... రెండు వాహనాల మధ్య జరిగిన కాల్పుల్లో అమాయకురాలైన హర్‌సిమ్రత్ కౌర్ మృతి చెందడం బాధాకరం అని పేర్కొన్నారు. హర్‌సిమ్రత్ కుటుంబంతో తము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, ఆ కుటుంబానికి అన్నివిధాల సాయంగా ఉంటామని ప్రకటించారు. హర్‌సిమ్రత్ కౌర్ హత్యపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.

ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు ఇలా తరచుగా కాల్పులు, దాడుల్లో మృతి చెందుతున్న ఘటనలు స్వదేశంలో వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories