Khamenei death: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్

Khamenei death: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ అధికారికంగా స్పందించింది.
x

Khamenei death

Highlights

Khamenei death: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ స్పందించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయంలో నివాళులర్పించారు

Khamenei death: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలై ఆరురోజులైంది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్ తొలిసారి సంతాపం తెలిపింది. భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సంతాప పుస్తకంపై సంతకం చేయడం ద్వారా నివాళులర్పించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించారు. ఒక రోజు తర్వాత ఇరాన్ అధికారికంగా ఆయన మరణాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అయితే, అంతర్జాతీయ సమాజం నుంచి భిన్నమైన స్పందనలు వస్తుండగా, భారత్ మాత్రం ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిని అవలంబించింది.

పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలై ఆరు రోజులు గడుస్తున్న తరుణంలో, భారత్ ఈ కీలక అడుగు వేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం ఆ దేశానికి మరియు మధ్య ప్రాచ్య రాజకీయాలకు తీరని లోటుగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారి రాయబార కార్యాలయానికి వెళ్లడం దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Khamenei death: భారతదేశం - ఇరాన్ మధ్య చారిత్రక, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చాబహార్ ఓడరేవు వంటి వ్యూహాత్మక ప్రాజెక్టుల విషయంలో ఇరు దేశాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇరాన్ నాయకత్వ మార్పు, ఖమేనీ మరణం ప్రాంతీయ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన నెలకొంది.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమి-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ఈ సమయంలో, భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే మానవీయ కోణంలో సంతాపం వ్యక్తం చేసింది. ఇప్పటికే రష్యా, చైనా సహా పలు దేశాలు ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించాయి.

ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,230కి చేరింది..

అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 1,230 కు పెరిగిందని ఇరాన్ కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ఫౌండేషన్ ఆఫ్ మార్టిర్స్ అండ్ వెటరన్స్ అఫైర్స్ ను ఉటంకిస్తూ తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై సంయుక్త సైనిక దాడిని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అధికారులు రోజువారీ మరణాల సంఖ్యను విడుదల చేస్తున్నారు. తాజా గణాంకాలు మృతులలో పౌరులు, భద్రతా దళాల సభ్యులు ఉన్నారని చెబుతున్నాయి.

కాగా, తాము కువైట్, బహ్రెయిన్, యుఎఇలలోని 20 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. IRGC ప్రకారం, ఈ దాడులు గల్ఫ్ ప్రాంతంలోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, ఈ విషయంపై US నుండి అధికారిక ధృవీకరణ ఏదీ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories