Venezuela: అంధకారంలో వెనెజువెలా.. దాడుల తర్వాత చితికిపోయిన జనజీవనం.. రోడ్లపైనే ఫోన్ ఛార్జింగ్, ఆహారం కోసం హాహాకారాలు!

Venezuela
x

Venezuela: అంధకారంలో వెనెజువెలా.. దాడుల తర్వాత చితికిపోయిన జనజీవనం.. రోడ్లపైనే ఫోన్ ఛార్జింగ్, ఆహారం కోసం హాహాకారాలు!

Highlights

Humanitarian Crisis in Venezuela: మెరుపు దాడుల తర్వాత వెనెజువెలాలో యుద్ధ వాతావరణం! కరెంటు లేక, ఆహారం దొరక్క అల్లాడుతున్న ప్రజలు. ఫోన్ల ఛార్జింగ్ కోసం రోడ్లపై బారులు.

Humanitarian Crisis in Venezuela: అమెరికా సైన్యం జరిపిన 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్' వెనెజువెలాను అతలాకుతలం చేసింది. వైమానిక దాడుల్లో భాగంగా విద్యుత్ గ్రిడ్‌లు, మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యం చేసుకోవడంతో రాజధాని కరాకస్ సహా అనేక ప్రధాన నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ యుద్ధం తర్వాత ఉండే భీకర పరిస్థితులు నెలకొన్నాయి.

స్తంభించిన జనజీవనం:

వైమానిక దాడుల కారణంగా వెనెజువెలాలో సాధారణ పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి:

విద్యుత్ కోత: కరాకస్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రులు, నివాస సముదాయాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

ఆహార సంక్షోభం: ప్రధాన సూపర్ మార్కెట్లు మూతపడటంతో చిన్న దుకాణాల వద్ద ఆహారం కోసం ప్రజలు 500-600 మంది క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు.

ఫార్మసీల వద్ద రద్దీ: అత్యవసర మందుల కోసం మెడికల్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర బారులు కనిపిస్తున్నాయి.

ఛార్జింగ్ కోసం పాట్లు:

కరెంటు లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఫోన్లలో ఛార్జింగ్ లేక ప్రజలు తమ బంధువులకు సమాచారం అందించలేకపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, రోడ్లపై ఇంకా పని చేస్తున్న కొన్ని విద్యుత్ దీపాల వద్దకు చేరుకుని, ఆ వైర్ల ద్వారా ప్రజలు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.

భారతీయుల పరిస్థితిపై ఆందోళన:

కరాకస్‌లో నివసిస్తున్న సునీల్ మల్హోత్రా అనే భారతీయుడు అక్కడి దయనీయ స్థితిని వివరించారు. "భారీ నష్టం జరిగింది. విమానాశ్రయం, మిలిటరీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆహారం, కరెంటు లేక జనం అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే భయమేస్తోంది" అని ఆయన వాపోయారు.

ప్రస్తుతం వెనెజువెలాలో సుమారు 50 మంది ఎన్ఆర్ఐలు, 30 మంది పిఐఓలు ఉన్నట్లు సమాచారం.

♦ వీరి భద్రత కోసం కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది.

♦ అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్: +58-412-9584288 ను సంప్రదించాలని భారత ప్రభుత్వం కోరింది.

అంతర్జాతీయ స్పందన:

మదురో అరెస్ట్, వెనెజువెలాలో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి (UN) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యను తప్పుబడుతుండగా, పొరుగు దేశమైన కొలంబియా శరణార్థుల రాకను తట్టుకునేందుకు సరిహద్దుల వద్ద బలగాలను మోహరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories