Donald Trump: బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు.. ఇక వారిని తిరిగి ఇండియాకు పంపించేస్తారా?

Impacts of Donald Trump decisions on Indians in US and India
x

Donald Trump: బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు... ఆ ఒక్క సంతకంతో ట్రంప్ వారిని తిరిగి ఇండియాకు పంపించేస్తారా?

Highlights

How Donald Trump's executive orders impacts Indians in US: బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ పాలసీ అంటే ఏంటి? దానివల్ల అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ట్రంప్ రాకతో ఇండియన్స్‌కు ఎదురయ్యే ఇతర సవాళ్లు ఏంటనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Impacts of Donald Trump decisions on Indians in US: డోనల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేశారు. అమెరికాలో ఉండే విదేశీయులు, మరీ ముఖ్యంగా ఇండియా నుండి వెళ్లిన ఎన్నారైలు ఎదైతే జరగకూడదని కోరుకున్నారో... ట్రంప్ అదే చేశారు.

ఎన్నికలకు ముందు అమెరికన్స్‌కు ఇచ్చిన హామీ ప్రకారమే అమెరికాలో 150 ఏళ్ల నాటి పాత పాలసీని రద్దు చేస్తూ ఒక సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తను చార్జ్ తీసుకున్న మొదటి రోజు చేయబోయే పనుల గురించి ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే చెప్పడం మీకు గుర్తుండే ఉంటుంది. అందులో బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ పాలసీని రద్దు చేయడం అనేది చెప్పుకోదగిన వాటిల్లో అతి ముఖ్యమైనది. ఇదేకాకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించే పని కూడా చేస్తానన్నారు.

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే వచ్చీ రావడంతోనే ఆ పని కూడా మొదలుపెట్టారు.

అది సరే కానీ ఇంతకీ బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ పాలసీ అంటే ఏంటి? దానివల్ల అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ట్రంప్ రాకతో ఇండియన్స్‌కు ఎదురయ్యే ఇతర సవాళ్లు ఏంటనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ. ట్రంప్ 2.0 పై ఎన్నారైలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే మనం ఈ డీటేయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ పాలసీ అంటే...

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నేలపై పుట్టిన ఏ బిడ్డకైనా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వస్తుంది. వారి తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం ఉన్నా లేకపోయినా, వారు ఎలాంటి వీసాతో అమెరికాలో ఉన్నా సరే... వారికి పుట్టిన బిడ్డకు సహజంగానే అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది.

1868లో అమెరికా మొదటిసారి ఈ రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం ప్రపంచదేశాలకు చెందిన ఎన్నో లక్షలమంది అమెరికాలో పుట్టినందుకు పౌరసత్వంతో పాటు అమెరికా పాస్ పోర్ట్ కూడా తీసుకున్నారు. అందులో మన ఇండియన్స్ సంఖ్య కూడా భారీగానే ఉంది.

ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. అదేంటంటే... పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం రావడం కోసమే అక్కడికి వెళ్లి బిడ్డలు కన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా లేకపోలేదు. ఈ ట్రెండునే "బర్త్ టూరిజం" అని కూడా పిలిచే వాళ్లు. వినడానికి ఇదో పెద్ద జోక్‌లా అనిపించినప్పటికీ... అదే నిజం.

అదే నిజమని చెప్పడానికి ఉదాహరణే అమెరికా తీసుకున్న మరో కఠిన నిర్ణయం. విదేశాల నుండి ఇలా బిడ్డలను కంటానికే అమెరికా వస్తున్నారని గ్రహించిన అక్కడి ప్రభుత్వం... ఆ తరువాతి కాలంలో బర్త్ టూరిజంను అడ్డుకునేందుకు కొంచెం కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

ఎవరైనా కేవలం పిల్లలను కనేందుకే గర్భంతో అమెరికా వస్తున్నారని తెలిస్తే... వారికి వీసా ఇవ్వకుండా రూల్స్ టైట్ చేసింది. ఒకవేళ అమెరికాలో బిడ్డను కనాలని అనుకుంటే... అందుకు బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది. అదెలా అంటే... మెరుగైన చికిత్సా పరమైన అవసరాల కోసమే అమెరికాలో బిడ్డను కనేందుకు వస్తున్నామని నేరుగానే చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ ఖరీదైన వైద్యం అందుకునేంత ఆర్థిక స్తోమత ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వైద్యం కోసం అమెరికా వచ్చే వారికి అది ఒక తప్పనిసరి అవసరమని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం నమ్మితేనే వారికి వీసా ఇస్తుంది. దీనినే బి వీసా అంటారు. లేదంటే నో చెబుతుంది.

అయితే, ఇదంతా గతం. ఇకపై అలాంటి పప్పులు ఉడకవని అమెరికా కొత్త అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక్క సంతకంతో తేల్చేశారు. బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ పాలసీని రద్దు చేస్తూ మొదటి రోజే ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో అమెరికాలో కొత్త సంసారం స్టార్ట్ చేసి అక్కడే పిల్లల్ని కందామనుకున్న యువ జంటల ఆశలపై ట్రంప్ నీళ్లుజల్లారు.

ఇకపై అమెరికాలో ఉండే విదేశీయులకు ఒకవేళ అప్పటికే అమెరికా పౌరసత్వం ఉండి ఉంటే ఇబ్బంది లేదు. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతో పౌరసత్వం వస్తుంది. లేదంటే అమెరికా గడ్డపై విదేశీయులకు పుట్టే ప్రతీ బిడ్డ ఇక ఆ దేశం దృష్టిలో ఒక పరదేశీనే. 150 ఏళ్లుగా అమెరికన్స్‌తో సమానంగా విదేశీయులకు కూడా ఈ హక్కు ఉండేది. కానీ ఇక ఆ ఛాన్స్ లేదు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటున్న లక్షల మంది విదేశీయులపై ప్రభావం చూపిస్తుంది. అందులో లక్షల సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నారు.

వారిని దేశం దాటిస్తానంటున్న ట్రంప్

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిన మరో పాయింట్ విషయానికొద్దాం. అమెరికా జనాభా లెక్కల ప్రకారం అక్కడ ఒక కోటి 10 లక్షల మంది విదేశీయులు వివిధ దేశాల నుండి అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారు. వారిలో కొంతమంది ఇల్లీగల్‌గా బార్డర్ దాటి అమెరికా వెళ్లిన వాళ్లయితే... ఇంకొంతమంది అమెరికా ఇచ్చిన వీసా గడువు ముగిసినప్పటికీ సొంత దేశాలకు తిరిగి వెళ్లకుండా అక్కడే బతుకుతున్న వాళ్లు.

అలాంటి వాళ్లందరినీ అమెరికా దేశం దాటిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు హామీ ఇచ్చారు. ఆయా దేశాలతో మాట్లాడి, అమెరికా సొంత ఖర్చుతో విమానాలు ఏర్పాటు చేసి వారి స్వదేశాలకు పంపిస్తానని ట్రంప్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్న రోజే యుద్ధ ప్రాతిపదికన ఆ పని మొదలుపెడతానని అన్నారు. అన్నట్లుగానే ట్రంప్ ఆ ఫైలుపై సంతకం చేశారు. ఆయన అంతటితో సరిపెట్టుకోలేదు. అప్పుడే అమెరికా - మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీని ప్రకటించేశారు. ఆ లెక్క ప్రకారం చూస్తే... ట్రంప్ అప్పుడే మెక్సికో వైపు నుండి నరుక్కురావడం మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది.

మెక్సికో, సాల్వడార్ తరువాత అమెరికాలో ఎక్కువ సంఖ్యలో అక్రమంగా తల దాచుకుంటున్నది మన ఇండియన్సేనని ప్యూ రిసెర్చ్ అని ఒక నివేదిక చెబుతోంది. అదే అమెరికాలో అక్రమంగా వలస వెళ్లిన ఇండియన్స్ ఆందోళనకు కారణమైంది.

అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న ఆ కోటి 10 లక్షల మందిలో 7 లక్షల 25 వేల మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వేరే దేశం వాళ్లు అక్రమంగా ఇండియాలోకి వచ్చి ఉంటే అది ఎలాగైతే నేరమో... అమెరికాలో ఇది కూడా అలాగే నేరం కిందకు వస్తుంది. కాబట్టి అమెరికా అక్కున చేర్చుకున్నంత కాలం వారికొచ్చిన ఇబ్బంది లేదు. అలా కాకుండా కఠినంగా వ్యవహరించి కాదు పొమ్మంటే వారు మళ్లీ స్వదేశంలో కొత్త జీవితం ప్రారంభించాల్సిందే.

అంత ఈజీ కాదంటున్న ఎక్స్‌పర్ట్స్

అయితే, ఈ ఒక్క విషయంలో డోనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే... ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇందులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇదొక మిలిటరీ ఆపరేషన్ లాంటిది. సొంతగడ్డపైనే విదేశీయులతో ఆయుధం లేని యుద్ధం లాంటిది. అన్నింటికిమించి కోటి మందికిపైగా జనాన్ని విమానాల్లో దేశం దాటించడమంటే ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది అమెరికా ఖజానాపై ఊహకందనంత భారాన్ని మోపుతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. డోనల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ హామీపై అమెరికన్ మేధావులే విశ్లేషిస్తూ చెప్పిన మాట.

అసలు సినిమా మిగిలే ఉంది..

ఇక ఇవే కాకుండా H1B వీసాలు, వర్క్ పర్మిట్స్, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ పన్నుల విషయంలో డోనల్డ్ ట్రంప్ వైఖరి ఎలా ఉండనుందా అనే టెన్షన్స్ ఉండనే ఉన్నాయి. డోనల్డ్ ట్రంప్ అంటేనే నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుందనే పేరుంది. అది కూడా విదేశాలు, విదేశీయుల విషయంలో ట్రంప్ కఠిన వైఖరి ఎలా ఉంటుందనేది ఆయన మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే ఒక షో వేసి చూపించారు కదా అని ఎన్నారైలు గుర్తుచేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే... ట్రంప్ రాకను బలంగా స్వాగతిస్తున్న ఇండియన్ అమెరికన్స్ సంఖ్య కూడా భారీగానే ఉండటం కొసమెరుపు. బహుషా వారికి గ్రీన్ కార్డు ఉండటమే వారి భరోసాకు కారణమై ఉండొచ్చు. లేదంటే మనకొచ్చిన సమస్య ఏముందిలేననే వైఖరేనో వారికే తెలియాలి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్...

Show Full Article
Print Article
Next Story
More Stories