Afghanistan: హిజాబ్‌ మాకొద్దు.. ఆఫ్ఘానిస్థాన్‌ మహిళల ఆందోళన

Hijab Controversy in Afghanistan | Live News
x

Afghanistan: హిజాబ్‌ మాకొద్దు.. ఆఫ్ఘానిస్థాన్‌ మహిళల ఆందోళన

Highlights

Afghanistan: హిజాబ్‌ ధరించకపోతే భర్తల ఉద్యోగాన్ని.. తొలగిస్తామని తాలిబన్ల హెచ్చరిక

Afghanistan: హిజాబ్‌ ఇటీవల భారత్‌లో తీవ్ర వివాదాస్పదం అయ్యింది. హిజాబ్‌ ధరించే విద్యాలయాలకు వస్తామని ముస్లిం విద్యార్థినులు పట్టుబట్టారు. తమను హిజాబ్‌తో అనుమతించాలని డిమాండ్‌ చేశారు. అందుకు పరీక్షలను కూడా బహిష్కరించారు. దీనిపై అప్పట్లో ముస్లిం దేశాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఓ ముస్లిం దేశంలో మహిళలు మాత్రం హిజాబ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ హిజాబ్‌ మాకొద్దు బాబోయ్‌ అంటున్నారు. హిజాబ్‌ను ధరించకపోతే భర్తల ఉద్యోగాలు పీకేస్తామని అక్కడి పాలకులు హెచ్చరిస్తున్నారు. హిజాబ్‌ ధరించనివారు జంతువులుగా పేర్కొంటున్నారు. అయినా ఎవరూ నోరు మెదపడం లేదు.

హిజాబ్‌ రెండు నెలల క్రితం భారత్‌లో తీవ్ర వివాదమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం దేశవ్యాప్తంగా వ్యాపించింది. విద్యాలయాల్లో హిజాబ్‌ ధరించరాదని కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. విద్యాలయాల ప్రాంగణాల్లోకి ఓకే కానీ తరగతి గదుల్లో మాత్రం హిజాబ్‌ను తొలగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే ముస్లిం విద్యార్థినులు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. ఈ వివాదం జనవరి చివరిలో ఉడిపి జిల్లాలో ప్రారంభమై చివరికి ఆ రాష్ట్రమంతటా వ్యాపించింది. మరోవైపు ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరిస్తే.. తాము కండువాలు ధరిస్తామంటూ హిందూ విద్యార్థులు పట్టుబట్టారు. చివరికి ఈ వివాదం కర్ణాటక హైకోర్టుకు చేరింది. హిజాబ్‌ అనేది ఇస్లాం ప్రకారం తప్పనిసరిక కాదని స్కూళ్లలో తప్పనిసరి యూనిఫాం ధరించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తెల్చి చెప్పింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఈ వివాదం మరుగున పడిపోయింది. దీనిపై అప్పట్లో ఇస్లామిక్ దేశాలు కూడా తీవ్ర విమర్శలు చేశాయి.

అయితే ఇస్లామిక్‌ దేశం అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. హిజాబ్‌ మాకొద్దు బాబోయ్‌ అంటూ అక్కడి మహిళలు మొత్తుకుంటున్నారు. హిజాబ్‌ను తప్పనిసరి చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరుకు టీవీ యాంకర్లు కూడా హిజాబ్‌ను ధరించాల్సిందేనని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ల తీరుపై ఆఫ్ఘాన్‌ మహిళలు మండిపడుతున్నారు. అయినప్పటికీ తాలిబన్లు మాత్రం హిజాబ్‌ ధరించాల్సిందేనని పట్టుబడుతున్నారు. హిజాబ్‌ ధరించని మహిళలను జంతువులుగా పేర్కొంటున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు హిజాబ్‌ ధరించకుండా బయటకు వచ్చిన మహిళల భర్తల ఉద్యోగాలను పీకేస్తామని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహిళల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాలిబన్లు మహిళల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నా ఇస్లామిక్‌ దేశాలు మాత్రం నోరు మెదపడం లేదు. భారత్‌పై మాత్రం నోరు పారేసుకుంటున్నారు. భారత్‌లో కేవలం తరగతుల్లో మాత్రమే హిజాబ్‌ వద్దన్నారు. బయట ఎవరిష్టం వారిదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇస్లామిక్‌ కంట్రీలో హిజాబ్‌ వద్దంటుంటే భారత్‌లో మాత్రం ధరిస్తామని పట్టుబడుతుండడం ఆశ్చర్యకరం.

మహిళ అంటే వంటింటి కుందేలే ఇది తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయం.. మహిళలు ఇంటికే పరిమితమవ్వాలని తాలిబన్ చీఫ్‌ హిబాతుల్లా ఖుంద్‌జాద్‌ ఆదేశించారు. తప్పనిసరి మహిళలు బయటకు రావాలనుకుంటే మాత్రం టాప్‌ టు బాటమ్‌ ఎక్కడా కనిపించకుండా కవర్‌ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక భారత్‌లోగా ఇష్టమైన దుస్తులు ధరించేందుకు కూడా అక్కడ అవకాశం లేదు. ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల తీరుపై ముస్లిం మహిళల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బాలికల విద్యను తాలిబన్లు నిషేధించారు. మహిళలు ఉద్యోగాలను చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడాన్ని కూడా నిషేధించారు. అంతేకాదు.. పురుషులు కూడా తప్పనిసరి గడ్డం పెంచాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆదేశించింది.

గతేడాది ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 1990లలో తాలిబన్ల అరాచక పాలనను అఫ్ఘాన్లు చవిచూశారు. దీంతో అప్పట్లో అఫ్ఘానిస్తాన్‌ దేశం విడిచి వెళ్లిపోయేందుకు యత్నించారు. వేలాది మంది వివిధ దేశాలకు వెళ్లిపోయారు. విదేశాలకు వెళ్లే స్తోమత లేని వారు మాత్రం అక్కడే ఉండిపోయారు. తాలిబన్లు కూడా తాము మారపోయామని చెప్పారు. మంచి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ వారి తీరు మారలేదు. గతంలో కంటే క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాము ఎప్పటికీ మారమని నిరూపిస్తున్నారు. ప్రజలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘాన్‌ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ప్రజలు తీవ్ర కరువు కాటకాలను అనుభవిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం కన్నా.. తాలిబన్లు మత విశ్వాసాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.

తాలిబన్లను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. మరోవైపు నిత్యం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తరచూ బాంబు దాడులకు దిగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తాలిబన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories