ఇరాన్‌.. భగ్గుమంటోంది.. యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోన్న మహిళల పోరాటం

Hijab Controversy Escalates in Iran | Telugu News
x

ఇరాన్‌.. భగ్గుమంటోంది.. యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోన్న మహిళల పోరాటం

Highlights

*మంటల్లో వేసి హిజాబ్‌ వస్త్రాలను కాల్చిన మహిళలు

Iran Protests: హిజాబ్.. ముస్లీం మహిళలు అనుసరించే ఈ సంప్రదాయంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మెడ, ముఖం కనిపించకుండా వస్త్రాన్ని కప్పుకునే ఈ కట్టుబాటుపై.. ఎక్కడో చోట మహిళలు నిరసనలు వెళ్లగక్కుతూనే ఉన్నారు. మాకోద్దూ ఈ సంప్రదాయం అంటూ.. నినదిస్తున్నారు. తాజాగా హిజాబ్ ధరించలేదని.. ఓ మహిళను.. ఇరాన్ మోరల్ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె మరణించడంపై ఇరానీయులు భగ్గుమన్నారు. హిజాబ్ నుంచి స్వేచ్ఛ కావాలని ఎలుగెత్తి చాటుతున్నారు.

పూర్తి ముస్లీం సంప్రదాయాన్ని అనుసరించే ఇరాన్ దేశం.. నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. సంప్రదాయపు చీకట్లను తొలగించుకునేందుకు.. అక్కడి నారీ లోకం కధం తొక్కింది. హిజాబ్‌ను ధరించేది లేదంటూ నినదిస్తోంది. నియంతృత్వ రాజ్యాన్ని ఎదిరిస్తూ ముస్లీం మహిళలు చేస్తున్న పోరాటం.. యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది.

మహ్ సా అమినీ అనే 22 మహిళను.. గత మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వీధుల్లో మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే.. ఆమె హిజాబ్ ధరించలేదు. ముఖం పూర్తిగా కప్పుకోకుండా ఉన్న అమినీని.. నైతిక రక్షక భటులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎంతలా ఎదిరించినా.. బలవంతంగా డిటెన్షన్‌ వ్యాన్‌లోకి ఎక్కించారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు వారి కస్టడీలో ఉన్న అమినీ కోమాలోకి వెళ్లింది. తర్వాత ఆస్పత్రికి తరలించగా.. గత శుక్రవారం ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇదే అక్కడి మహిళల్లో ఆగ్రహ జ్వాల రగిలించింది.

అమినీ మరణించిన ఆస్పత్రి ఎదుట.. పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకుని నిరసనలు చేపట్టారు. అమినీ గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు చెబుతుండగా.. ఆమెను తీవ్రంగా కొట్టారని.. తమపై బలమైన గాయంతోనే ఆమె కోమాలోకి వెళ్లినట్లు.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో భగ్గుమన్న మహిళలు తమ ముఖాలపై ఉన్న హిజాబ్ ను తొలగించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. నియంతృత్వ రాజ్యం దిగిపోయే సమయం వచ్చిందంటూ నినాదాలు చేశారు. క్రమంగా నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. తర్వాతి రోజు కుర్దిస్థాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన అమినీ అంత్యక్రియల్లో.. పాల్గొన్న మహిళలు.. తమ హిజాబ్‌ను తీసేశారు. వాటిని మంటల్లో కాల్చేశారు. తమకు హిజాబ్ వద్దని గొంతెత్తి చాటారు. నియంతకు చావు తప్పదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు మహిళలు తమ వెంట్రుకలను కట్ చేసుకునే వీడియోలు.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహిళలతో పాటు.. చాలాచోట్ల పురుషులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి.. తమ నిరసన వ్యక్తం చేశారు.

పలు చోట్ల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతాదళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే చాలా మందిని అరెస్టు చేసినట్లు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలు ఇరాన్‌తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు ఈ దారుణాన్ని ఖండించారు. మహ్ సా అమినీ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వాస్తవానికి ఇరాన్‌లో.. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించలేదన్న కారణంతో పాటు.. రకరకాల కారణాలతో మహిళలపై అణచివేత చర్యలు విపరీతంగా పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించకుండా ఇరాన్‌లో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలలోకి వీల్లేదు. పౌరుల్లో మత సంప్రదాయాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలిసింగ్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. అందులో భాగంగానే అమినీని మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మర్డర్ పెట్రోల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూలురు కూడా ఈ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అలీ ఖొమేనీపై విమర్శలు చేయడమే కాదు.. ఆయన ఫ్లెక్సీలను కూడా చించేశారు.

ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడారు. తమకు స్వేచ్ఛ కావాలంటూ వీధుల్లోకి వచ్చి ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. టాప్ లెస్‌గా వచ్చి.. తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కట్టుబాట్లు తమకే ఎందుకని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వాస్తవానికి హిజాబ్ అనేది.. ఓ సంప్రదాయం మాత్రమే. రాను రాను మతపెద్దలు.. దీన్ని తప్పనిసరిగా చేశారు. మనదేశంలో కర్ణాటకలో కూడా ఇటీవల హిజాబ్ వివాదం.. యావత్ దేశంలో కలకలం రేపింది. అయితే ఇక్కడి ముస్లీం మహిళలు మాత్రం.. హిజాబ్ కావాలని పట్టుబడితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు.. హిజాబ్ వద్దంటూ ఆందోళన చేపట్టడమే కొసమెరుపు.

Show Full Article
Print Article
Next Story
More Stories