Putin: పుతిన్‌లో దూకుడు తగ్గిందా..?

Has Putin Aggression Decreased?
x

Putin: పుతిన్‌లో దూకుడు తగ్గిందా..?

Highlights

Putin: తిరుగబాటుదారుల అంతుచూసే వరకు వదలని పుతిన్.

Putin: పుతిన్ లో దూకుడు తగ్గిందా..? తనను పెంచి పోషించిన బాస్ పై ఉన్నట్టుండి ప్రిగోజిన్ కు ఎందుకు కోపమొచ్చింది..? ఎదురుతిరిగిన వెన్నుపోటు దారుల అంతుచూడనిదే వదలని పుతిన్.. ప్రిగోజిన్‌ విషయంలో ఎందుకు వెనుకడుగు వేశారు..? క్రమంగా పుతిన్ బలం తగ్గిపోతుందన్న దానికి వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సంకేతమా..? దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎదురులేని, తిరుగులేని నేతగా రష్యాను పరిపాలిస్తున్న పుతిన్‌ను ఓ సాయుధ తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నో రహస్య యుద్ధాల్లో తన కనుసన్నల్లో కాలుదువ్విన వాగ్నర్‌ గ్రూప్‌సేనలు తన మీదే తుపాకీ ఎక్కుపెట్టడం పుతిన్‌కు మింగుడు పడడం లేదు.

తనకు వంట చేసి పెట్టి తన కుడిభుజంగా ఎదిగిన ప్రిగోజిన్‌ తిరుగుబాటుకు తెగిస్తాడని పుతిన్‌ కలలో కూడా ఊహించలేదు. ఆయన తేరుకునేలోపే ప్రిగోజిన్‌ సేనలు రష్యాలో ఓ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని మాస్కో ముట్టడికి కదం తొక్కాయి.

అపారమైన సైనిక శక్తి, సాయుధ సంపత్తి కలిగిన రష్యా.. కిరాయి సేనలను ఎందుకు నిలువరించలేకపోయిందో ఎవరికీ అర్థం కాని మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తిరుగుబాటును ముందస్తుగా పసిగట్టలేనంత దుస్థితిలో రష్యా ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఉన్నాయా? పుతిన్‌లో మునుపటి దూకుడు లేదనడానికి ఇది నిదర్శనమా? ఇంతకీ పుతిన్‌కు ఏమైంది? రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇదే. పుతిన్‌కు ఇంతకాలం విధేయుడిగా మసలిన ప్రిగోజిన్‌కు ఎందుకు అంత కోపమొచ్చిందనే ప్రశ‌్న కూడా రేకెత్తుతోంది.

అయితే ఉక్రెయిన్‌లో తన సారథ్యంలోని వాగ్నర్‌ గ్రూప్‌ సేనలు సాధించిన విజయాలను రష్యా సైన్యం వారి ఖాతాలో వేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యుద్ధం గడుస్తున్న కొద్దీ కరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రిని భర్తీ చేయకపోవడం ప్రిగోజిన్‌ను అసహనానికి గురిచేసింది. నిజానికి అతడి కోపమంతా రష్యా రక్షణ మంత్రి, చీఫ్‌ జనరల్‌ పైనే. బఖ్‌ముత్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ సేనలతో జరిగిన యుద్ధంతో తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు రష్యా ససేమిరా అనడం కూడా వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటుకు ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రష్యా వైమానిక దళం కమాండర్‌ జనరల్‌ సురోవికిన్‌కు ఈ తిరుగుబాటు వ్యూహం గురించి ముందే తెలుసని అతడు కూడా ప్రిగోజిన్‌కు పరోక్షంగా మద్దతు పలికాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న మరికొందరు జనరల్స్‌ కూడా ప్రిగోజిన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. ఇవన్నీ పక్కనపెడితే మాజీ గూఢచారి అయిన పుతిన్‌ ఎందుకు ఈ తిరుగుబాటును పసిగట్టలేకపోయారు..? సొంత దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితికి పుతిన్ దిగజారిపోయారా అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా పుతిన్‌కు జూనియర్ భాగస్వామిగా బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకోను పిలుస్తారు. అలాంటి వ్యక్తి రష్యా తిరుగుబాటును సద్దుమణిగించడంతో పుతిన్‌ స్థాయి పడిపోయినట్టు అయ్యిందంటున్నారు.

అయితే తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష పెట్టడం అనేది తాత్కాలికమే అనే వాదన కూడా వినిపిస్తోంది. పుతిన్ తిరుగుబాటుదారుల్లో ఏ ఒక్కరినీ వదిలపెట్టడని కొందరు చెబుతున్నారు. అటు పుతిన్‌ కూడా తానేమీ తగ్గలేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఉన్నట్టుండి బుధవారం జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో కరచాలనాలు చేసి తానేమీ బెదిరిపోలేదనే సంకేతాలు పంపించారు. ఏది ఏమైనా మొత్తానికి పుతిన్ తన పవర్‌ను, కంట్రోల్‌ను కోల్పోయారన్నది మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories