Global Gas Crisis: ఇరాన్ ప్రతీకార దాడి..ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై డ్రోన్ల వర్షం..ఉత్పత్తి నిలిపివేత..ఆకాశానికి ధరలు

Global Gas Crisis: ఇరాన్ ప్రతీకార దాడి..ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై డ్రోన్ల వర్షం..ఉత్పత్తి నిలిపివేత..ఆకాశానికి ధరలు
x
Highlights

ఇరాన్ ప్రతీకార దాడి..ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై డ్రోన్ల వర్షం

Global Gas Crisis: మధ్యప్రాచ్యంలో రగిలిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా కూటమి ఇరాన్‌పై దాడులు చేయడంతో మొదలైన ఈ చిచ్చు, ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది. తనపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఏకంగా 8 గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రధాన గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు జరగడంతో, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది.

ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని ఇంధన కేంద్రంపై ఒక డ్రోన్ దాడి చేయగా, మెసాయిద్‌లోని పవర్ ప్లాంట్‌లోని నీటి ట్యాంకును మరో డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఎల్ఎన్‌జీ ఉత్పత్తిని, ఎగుమతులను ఖతార్ నిలిపివేసింది. ఈ వార్త బయటకు రాగానే అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. యూరప్‌లో ప్రధాన గ్యాస్ ధరల సూచీ అయిన డచ్ TTF నేచురల్ గ్యాస్ బెంచ్‌మార్క్ ఏకంగా 45 శాతం పెరిగి 54 డాలర్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాలతో పోటీ పడుతూ ఖతార్ భారీగా గ్యాస్ ఎగుమతులు చేస్తోంది. అయితే ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా షిప్పింగ్ పూర్తిగా నిలిచిపోవడం గ్యాస్ సరఫరాకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన ధరల భారంతో సతమతమవుతున్న దేశాలకు, ఖతార్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం కోలుకోలేని దెబ్బ అని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సప్లై చైన్ దెబ్బతినడంతో రాబోయే రోజుల్లో విద్యుత్, గ్యాస్ బిల్లులు సామాన్యుడికి మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఖతార్ సంక్షోభం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం ఖతార్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. 2025 లెక్కల ప్రకారం, భారత్ మొత్తం 25.6 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకోగా, అందులో దాదాపు 40-42 శాతం అంటే 10.9 మిలియన్ టన్నులు ఒక్క ఖతార్ నుండే వచ్చింది. ఇప్పుడు ఖతార్‌లో ఉత్పత్తి ఆగిపోవడం, సరఫరా మార్గాలు మూసుకుపోవడంతో భారత్‌లో గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, పరిశ్రమలకు ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీయవచ్చు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరాన్ తన దాడులను మరింత ఉధృతం చేస్తే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో తలదూర్చితే పరిస్థితి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, దేశాల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో చివరకు బలి అవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే.

Show Full Article
Print Article
Next Story
More Stories