Imran Khan: రాజాలా బతికినోడు..జీవచ్ఛవంలా మారాడు..చూపు పోగొట్టుకున్న మాజీ ప్రధాని

Imran Khan: రాజాలా బతికినోడు..జీవచ్ఛవంలా మారాడు..చూపు పోగొట్టుకున్న మాజీ ప్రధాని
x
Highlights

రాజాలా బతికినోడు..జీవచ్ఛవంలా మారాడు..చూపు పోగొట్టుకున్న మాజీ ప్రధాని

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీహెచ్‌ఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి. అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్, ప్రస్తుతం చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తక్షణమే ఆయనకు మెడికల్ టెస్టులు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది సల్మాన్ సఫ్దర్, అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసి ఆయన ఆరోగ్యంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. అక్టోబర్ 2025 వరకు ఆరోగ్యంగా ఉన్న ఇమ్రాన్, ఆ తర్వాత అకస్మాత్తుగా కుడి కంటి చూపు కోల్పోయారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కుడి కన్ను కేవలం 15 శాతం మాత్రమే పనిచేస్తోందని, తక్షణమే చికిత్స అందకపోతే రెండు కళ్లు శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ కేవలం తన కుటుంబ సభ్యులను కలవాలని, తన కుమారులతో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు సఫ్దర్ కోర్టుకు తెలిపారు.

పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు కంటి నరాల్లో రక్తం గడ్డకట్టి, రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీనివల్ల నరాలు వాపు వచ్చి చూపు క్రమంగా తగ్గిపోతుంది. జైలులో ఉన్న ఒత్తిడి, సరైన వైద్యం అందకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు ఇప్పటికే ప్రాథమిక చికిత్స అందించామని చెబుతోంది.

ఈ నివేదికపై స్పందించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఇమ్రాన్ ఖాన్ ప్రాథమిక హక్కులను కాలరాయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఫిబ్రవరి 16వ తేదీ లోపు దేశంలోని ప్రఖ్యాత వైద్యుల బృందంతో ఇమ్రాన్‌కు పరీక్షలు నిర్వహించి, చికిత్స ప్రారంభించాలని ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ తన ఇద్దరు కుమారులతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ భద్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, ఆరోగ్య విషయంలో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేసింది.

మే 2023 నుంచి అవినీతి, సైన్యంపై తిరుగుబాటు ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గుతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాకిస్థాన్ రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. ఒకవేళ ఆయనకు చూపు పోతే, అది దేశవ్యాప్త అశాంతికి దారితీస్తుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జైలు నుంచి పెద్ద ఆసుపత్రికి తరలించే అవకాశం కనిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ తన కంటిచూపును కాపాడుకోగలరో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories